Adsense

Showing posts with label Number 108. Show all posts
Showing posts with label Number 108. Show all posts

Sunday, December 8, 2024

108 నంబర్‌కు ఉన్న పవర్ అంతా ఇంతా కాదు.

ఈ సంఖ్య చెప్పగానే ఠక్కున గుర్తుకు వచ్చేది ప్రభుత్వ అంబులెన్స్. అత్యవసర పరిస్థితిలో ప్రాణాలు కాపాడేందుకు వినియోగించే అంబులెన్స్ వాహనానికి ఆ నంబర్ నే ఎందుకు పెట్టారు..?

ప్రాణాలు నిలిపేంత శక్తి ఈ సంఖ్యకు ఉందా.. గుడిలో 108 ప్రదక్షిణాలు చేస్తే కోరిన కోరికలు తీరుతాయని నమ్మడం వెనుకున్న రహస్యం ఏంటి..? దేవుని నామస్మరణలో ఉండే పూసల సంఖ్య 108 ఎందుకు ఉంటాయి..? అసలు ఈ సంఖ్య వెనుకున్న మర్మం ఏంటి.. హిందూ ధర్మం చెబుతున్న రహస్యం ఏంటి..? అంటే..

కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తి దీక్షతో నమ్మకంతో అష్టోత్తరశతనామావళి పఠిస్తే దేవుడు కరుణిస్తాడని నమ్మకం. అందుకు జపమాలతో నామస్మరణ చేయవలసి ఉంటుంది. అయితే ఆ జపమాలలో సరిగ్గా 108 పూసలు ఉంటాయి. అనాదిగా ఈ ఆచారం కొనసాగుతూ వస్తోంది. 108 సార్లు దేవుడి నామస్మరణ చేయడం ద్వారా మనసుకు.. మనిషికి ప్రశాంతత లభిస్తుందనేది నిజం. మరి కొన్ని మతాల్లో కూడా ఈ జపమాల సంప్రదాయం ఉంది.

క్షీరసాగర మథనంలో 54 మంది రాక్షసులు, 54 దేవగణాలు ఇరువైపుల ఉండి సాగరాన్ని చిలికితే అమృతం వెలికి వచ్చింది. అయితే ఇందులో ముందుగా విషం వచ్చిందన్నది తెలిసిన సత్యమే. అయినా విశ్రమించకుండా సాగరమథనాన్ని కొనసాగించారు. చివరన పుట్టిందే అమృతం. ఈ 108 సంఖ్య మనిషిలోని మంచి, చెడు లక్షణాలను రెండుగా వేరు చేస్తుందని శాస్త్రం చెపుతోంది. ఈ సంఖ్య బలంతో మంచిది పైచేయి అయి మనిషి అమృతమయమైన మోక్షాన్ని సాధించగలుగుతాడని చెబుతోంది.

కేవలం హిందూ ధర్మం.. హిందూ దేశంలోనే కాదు ఈ సంఖ్యను పాశ్చత్య దేశాలు కూడా పాటిస్తున్నాయి. శాస్త్ర సాంకేతికత అసలు పుట్టనే పుట్టని సమయంలో వందల ఏళ్ల క్రితమే భారత్ ఖగోళశాస్త్రంపై పట్టు సాధించింది. ఇందుకు సాక్ష్యం ఇప్పుడు మనం ఫాలో అవుతున్న సైన్స్. భారతీయ ఖగోళ శాస్త్రవేత్తలు పదిహేను వందల సంవత్సరాల క్రితమే సూర్యసిద్ధాంతం ద్వారా విశ్వంలో చిట్టచివరన ఉన్న శని గ్రహం చుట్టు కొలత కనుగొన్నారు. సూర్యుడికి భూమికి మధ్య కొలతలను కచ్చితంగా లెక్కకట్టగలిగారు. ఆ లెక్కల్లోని సంఖ్యే 108.

సూర్యుని చుట్టుకొలతను 108 గుణిస్తే భూమికీ, సూర్యునికీ మధ్య ఉన్న దూరం వస్తుంది. చంద్రుని చుట్టుకొలతను 108తో గుణిస్తే భూమికీ, చంద్రునికీ మధ్య ఉన్న దూరం వస్తుంది. అంతే కాదు సూర్యుడు దాదాపు భూమికి 108 రెట్లు పెద్దగా ఉంటాడని కూడా 15 వందల సంత్సరాల క్రితమే మన భారతీయులు తెల్చేశారు. దీంతో 108 పై శాస్త్రవేత్తలకు సైతం పూర్తి నమ్మకం ఉందని సమాచారం.

హిందూ సంప్రదాయం ప్రకారం వ్యక్తి పుట్టుకను 108 సంఖ్య తెలియజేస్తుంది. 27 నక్షత్రాలను నాలుగేసి పాదాలతో భాగిస్తే 108 పాదాలు వస్తాయి. దీంతో పుట్టిన ప్రతి ప్రాణి 108 వర్గాలలో ఏదో ఓ వర్గానికి ప్రతిబింబమే అని చెబుతోంది శాస్త్రం. ఇక ఈ సంఖ్య వెనకున్న పూర్తి రహస్యాలను మాత్రం ఇప్పటికీ ఎవరూ బట్టబయలు చేయలేకపోయారు. ఈ సంఖ్యకి మనిషికి జీవితంలో ఎక్కడో ఓ సంబంధం ఉందని మాత్రం అర్థం అవుతోంది. నమ్మిన వారికి బలాన్నిచ్చే సంఖ్య, నమ్మకం లేని వారికి కూడా సహయం చేసే ప్రాణ దాత 108. చివరగా చెప్పేది 108 గురించి తెలిసింది గోరంత.. తెలియాల్సింది కొండంత.