మంగళగిరి శ్రీలక్ష్మీనృసింహస్వామి కల్యాణం :
శ్రీ హరికోసం శ్రీలక్ష్మి తపస్సు చేసిన ప్రదేశం మంగళగిరి. మంగళగిరిలో మూడు నరసింహ ఆలయాలున్నాయి. కొండ దిగువన వున్న శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం, కొండపైన వున్న పానకాల స్వామి ఆలయం, కొండ శిఖరాన గండాలు నరసింహస్వామి ఆలయం. మంగళాద్రి నృసింహునికి కృత యుగంలో అమృతాన్ని, త్రేతాయుగంలో ఆవునెయ్యిని, ద్వాపర యుగంలో ఆవుపాలను సమర్పించారు. కలియుగంలో బెల్లపు పానకాన్ని సమర్పిస్తున్నారు. పానకాలస్వామి ఆలయంలో లోహంతో చేసిన స్వామి ముఖం మాత్రమే తెరచిన నోటితో దర్శన మిస్తుంది. భక్తులు స్వామికి సమర్పించే పానకాన్ని స్వామి నోట్లో పోస్తారు. పానకం సగం అవగానే గుటక వేసిన శబ్దం వస్తుంది. అప్పుడు పానకం పోయటం ఆపి, మిగతాది భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. ప్రతిరోజూ పానకం వినియోగమవుతున్నా, గుడిలో ఒక్క చీమ కూడా కనిపించకపోవటం విశేషం. పానకాలస్వామి గుడి వెనుక కొంచెం ఎత్తులో శ్రీలక్ష్మి ఆలయం వుంది. కొండకింద శ్రీలక్ష్మీ నరసింహస్వామిని, మెట్ల మార్గంలో భ్రమరాంబా మల్లికార్జునస్వామిని పాండవులు ప్రతిష్టించారని స్థలపురాణం. విజయవాడ గుంటూరు రహదారిలో విజయవాడకు దాదాపు 16 కి.మీ. ల దూరంలో మంగళగిరి వుంది. కొండపైన పానకాల స్వామి ఆలయం ఉదయం 7గం. లనుంచి సాయంత్రం 3 గం.లదాకా మాత్రమే తెరచి వుంటుంది.