Adsense

Showing posts with label TELUGU INSPIRATION STORIES. Show all posts
Showing posts with label TELUGU INSPIRATION STORIES. Show all posts

Tuesday, March 9, 2021

తెలుగు కథలు

ఎడారి దారిలో...

ఒక వ్యక్తి ఎడారిలో దారి తప్పిపోయాడు. అతడు తెచ్చుకున్న నీళ్లు రెండు రోజుల తర్వాత అయిపోయాయి. నడుస్తున్నాడు. నీరు ఎక్కడా కనబడటం లేదు. తన జీవితపు ఆఖరు దశకు చేరానని అతడికి తెలిసిపోయింది. ఈ రాత్రి గడవదు. రేపు ఉదయం చూడను అని అనుకుంటున్న దశలో ప్రయత్నం చెయ్యడమా? అలాగే నిరాశతో కూలబడి పోవడమా ఎటూ నిశ్చయించుకోలేకపోతున్నాడు. దూరంగా ఒక గుడిసెలాంటిది కనబడింది. అది నిజమా? తన భ్రమా? ఏమో! నిజమేమో! అక్కడ తనకు నీరు దొరకవచ్చునేమో! చనిపోయేముందు ఆఖరు ప్రయత్నం చెయ్యాలనుకున్నాడు.
శక్తిని కూడదీసుకున్నాడు. తడబడిపోతున్న అడుగులతో ముందుకు నడుస్తున్నాడు. గుడిసెలోకి వెళ్లాడు. అక్కడ ఒక నీటి పంపు(బోరింగ్) కనబడింది. దానిని చూడగానే ప్రాణం లేచి వచ్చినట్టయింది. దాని దగ్గరకి వెళ్లి కొట్టాడు. నీరు రావడం లేదు. శక్తినంతా ఉపయోగించి కొట్టాడు. అయినా ప్రయోజనం లేదు. నిరాశ నిస్పృహ ఆవరించాయి. ఒంట్లో ఉన్న కొద్ది నీరూ అయిపోయింది. కళ్లు మూసుకుపోతున్నాయి. ఒక మూలన సీసా కనిపించింది. దానిలో నీరు ఉంది. మూత గట్టిగా బిగించి ఉంది. మూత విప్పి దాన్ని ఎత్తిపట్టి తాగుదామని పైకి ఎత్తాడు. దానికి ఒక కాగితం కట్టి ఉంది. దాని మీద ఇలా ఉంది. 
ఈ బాటిల్‌లో నీరు బోరింగ్ పంపులో పోయండి. పంపు కొట్టండి.. నీరు వస్తుంది. మీరు మళ్లీ ఈ బాటిల్ నింపి పెట్టండి.
అతడికి సందేహం కలిగింది. ఈ నీరు తాగెయ్యడమా? బోరింగ్ పంపులో పొయ్యడమా? ఎంత కొట్టినా రాని నీరు.. ఈ బాటిల్లో నీరు పోస్తే వస్తుందా? ఉన్న ఈ నీరు కాస్తా పోసేస్తే తర్వాత రాకపోతే తన గతి ఏమి కాను? చేతిలో ఉన్న నీరు తాగితే కనీసం ఇంకో రెండు రోజులు బతకొచ్చు. అంతులో పోసేస్తే మరణం ఖాయం.
ఏమి చేయాలి? ఎంతకూ ఆలోచనలు తెగడం లేదు. ఒక నిశ్చయానికి వచ్చాడు. నీళ్లను పంపులో పోశాడు. బోరింగ్ పంపు కొట్టడం మొదలుపెట్టాడు. ఆశ్చర్యం. పాతాళ గంగ పైకి తన్నుకు వచ్చింది. నీళ్లు తాగి బాటిల్ నింపాడు. మూలన పెట్టాడు. తను తెచ్చుకున్న బాటిల్ నింపుకున్నాడు. గుడిసెలో ఎడారి మ్యాప్ కనబడింది. తను ఎటు వెళ్లాలో చూసి బయలుదేరాడు.
ఏదైనా పొందాలంటే ఇవ్వడం నేర్చుకోవాలి. ఇవ్వడం వల్ల మనం పొందగలం అనే నమ్మకాన్ని కలిగి ఉండాలి. ఫలితం మీద ఆశ పెట్టుకోకుండా ప్రయత్నించాలి. కృషి చెయ్యకుండా ఫలితం 
ఆశించకూడదు. నువ్వు ఇవ్వకుండా దేనినీ పొందలేవు.



మంచినీ, సంకల్పాన్నీ తట్టిలేపే కథ!"

ఒకానొక చిన్న పల్లెటూరు. అందులో చాలా పేరుగాంచిన జ్యోతిష పండితుడు నివసించేవాడు.

ఆయన చెప్పిన మాట పొల్లుపోదనీ చెప్పిన జ్యోస్యం తప్పుకాదనీ ఆ ఊరి ప్రజల విశ్వాసం.

ఆ నోటా ఈ నోటా విన్న ఓ పేదరైతు పక్కనున్న గ్రామం నుంచి జ్యోతిషుని దగ్గరకు వచ్చి తనకు జోస్యం చెప్పమని తన జాతకాన్ని అతనికి ఇస్తాడు.

తనపై నమ్మకముంచి వచ్చినందుకు ఆ పేదరైతును కూర్చోమని సైగచేసి అతని జాతకాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించి చూస్తాడు. ఎటువంటి జాతకాలను చూసినా చలించని ఆ జ్యోతిషుడు పేదరైతు జాతకం చూస్తూనే కంగారు పడతాడు.

ఎందుకంటే ఆ జాతకం ప్రకారం పేదరైతుకు ఆనాటి రాత్రి ప్రాణ గండం కనిపించడం వల్లనే!

ఎంతటి నిజాన్నైనా చెప్పగలను కానీ రైతుతో సూటిగా ‘నీకు ప్రాణగండం ఉందని’ ఎలా చెప్పనని చింతించి ఎలాగోలా తనను తాను తమాయించుకొని రైతుకు ఏమాత్రం సందేహం రాకుండా ‘ఇవాళ నాకు చాలా పనిఉంది. మీ జాతకం నా దగ్గరే ఉంచి వెళ్ళండి. రేపు మీరు మళ్ళీ రాగలిగితే నేను నిశితంగా పరిశీలించి చెబుతాను’అని అని అంటాడు.

జ్యోతిషునిపై మర్యాదతో ఆ పేదరైతు సరేనని కృతజ్ఞతలు చెప్పి వెళ్ళి పోతాడు. రైతు వెళ్ళగానే జ్యోతిషుడు తన భార్యతో ఈ విషయం చెబుతాడు.

కానీ మనసులో ‘పాపం పేదరైతు నేడు మరణిస్తాడే. నేను రేపు రమ్మన్నాననే తలంపుతో వెళ్ళిపోయాడే’నని చింతిస్తాడు జ్యోతిషుడు.

పేదరైతు జ్యోతిషుని ఇంటినుండి బయలుదేరి తన గ్రామానికి నడిచి వెళుతున్నాడు. దారిలోనే చీకటి పడటంతో తలదాచుకోవడానికి స్థలాన్ని వెదకడం మొదలుపెట్టాడు.

ఇంతలో కుండపోతగా వర్షం కురవసాగింది. కాస్త దూరంలో శిథిలావస్థలో శివుని ఆలయం కనిపించిందతనికి. అక్కడికి చేరుకొని ఆలయం ముందున్న మండపంలో నిలబడి ఆలయ స్థితిని చూసి ఎంతో బాధపడ్డాడు.

ప్రజలకు మనఃశ్శాంతినీ, భక్తి భావాలనూ పెంపొందించే ఆలయం నేడు ఈ దుస్థితికి చేరిందే. నా దగ్గర డబ్బుండుంటే నేను ఈ శివాలయాన్ని పునరుద్ధరించే ప్రయత్నాన్ని చేసేవాణ్ణని మనసులో అనుకుంటాడు.

మానసికంగానే ఎలా గోపురాన్ని నిర్మించాలి. రాజగోపురం ఎంత ఎత్తుగా ఉండాలి.

మండపాలు ఎలాకడితే బాగుంటుంది.
అలా పూర్తిగా కట్టబడిన శివాలయంలో అభిషేకాలూ, పూజలూ నిర్విఘ్నంగా జరుగుతుంటే ఎంత బాగుంటుందనీ శివుని ఆన ఉంటే తప్పక అది జరుగుతుందనీ అనుకుంటుండగానే మండపం పైభాగంలోంచి నల్లని త్రాచుపాము అతనిని కాటు వేయడానికి అతనిపై దూకపోతుంటే తప్పించుకొని ఆ ఆలయం నుండి బయటకు వచ్చేస్తాడు.

మండపంతో సహా ఆ పాడుబడిన గుడి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. అమ్మయ్య! బతికి పోయాననుకొని ఇంటికి చేరుకుంటాడా పేదరైతు.

మరునాడు తన జాతకాన్ని గురించి తెలుసుకోవాలనుకొని జ్యోతిషుని దగ్గరకు వెళతాడు పేదరైతు. అతణ్ని చూసి ఆశ్చర్యపోయిన జ్యోతిషుడు
నా గణనలో తప్పు జరిగి ఉంటుందని
చాలా శాస్ర్తాలను తిరగేసి మళ్ళీ మళ్ళీ
అతని జాతకాన్ని పరిశీలిస్తాడు.

కానీ గణింపులో ఎక్కడా తేడాలేదు. అంతా సరిగ్గానే ఉంది. ఇక తప్పదన్నట్లు విషయం పేదరైతుకు వివరించి జ్యోతిషుడు నిన్న ఏం జరిగిందో ఏదీ మర్చిపోక తెలియజేయమని రైతుకు చెబుతాడు.

జరిగిందంతా వివరిస్తాడు పేదరైతు.

మంచి చేయాలనే కేవలం తలంపు మాత్రంగా అనుకున్నందుకే ఇంత గొప్ప ఫలితం చేకూరితే మనకు చేతనైనంత మంచి చేస్తే ఎటువంటి జీవితం లభిస్తుందో రైతుకు జరిగిన సంఘటనే నిదర్శనం!

మనం బాగుండాలంటే మన ఆలోచనలు బాగుండాలి.

మన ఆలోచనలు సత్సంకల్పాలయితే మన చుట్టూ ఉన్న ప్రపంచం బాగుంటుంది.

ప్రపంచం బాగుంటే అందులోని మనం కూడా బాగుంటాం!

-----------------------------------------------------------------------------------------------------------
ఒక అద్భుతమైన కథ...!
స్టీఫెన్ అనే ఒక ప్రఖ్యాత డాక్టర్, 
వైద్య రంగంలో తాను చేసిన పరిశోధనలకు తాను పొందిన ఒక గొప్ప అవార్డును అందుకోవడానికి వెరే నగరానికి బయలుదేరాడు.

రెండూ గంటల ప్రయాణం తరువాత అతను ఎక్కిన విమానం కొన్ని సాంకేతిక లోపాల వల్ల ఆగిపోయింది.

కాన్‌ఫరెన్సుకు ఆలస్యం అవుతోంది అన్న ఆందోళనతో అతను ఒకా కారు అద్దెకు తీసుకుని ప్రయాణం కొనసాగించాడు. 
మళ్ళి కొంతసేపు అయిన తరువాత, 
విపరీతమైన గాలివాన, వర్షం..
దానితో ఈ వాతావరణంలో ముందుకు సాగలేకఆగిపోయాడు. 
భరించలేని ఆకలి, అలసట, వేళకు వెళ్ళలేకపోతున్నాను అనే చికాకులతో ఉన్నాడు ..ఆ డాక్టరు.

కొంతదూరం ముందుకు వెళ్ళాక, అతనికి ఒక చిన్న ఇల్లు కనిపించింది. 
ఆ ఇంట్లోకి వెళ్ళి వారి ఫోను ఉపయోగించుకుందాము అనుకున్న ఆ డాక్టరుకు 
ఆ ఇంటి తలుపు తీసిన ఒక ముసలామె 
తన ఇంట్లో కరంటు, ఫోను సౌకర్యాలు లేవు అని, 
బాగా వర్షంలో తడిసిపోయినందున తన ఇంట్లో కొంత సేపు విశ్రాంతి తీసుకోమని, 
వెచ్చగా ఉండేందుకు టీ, 
కొంత ఆహారం తేబుల్ మీద పెట్టి తను ప్రార్ధన చేసుకోవడానికి వెళ్ళింది.

ఆమె పక్కన ఉయ్యాలలో ఒక పసివాడు ఉన్నాడు. ఆమె గురించిన వివరాలు తెలుసుకుందామనుకున్నా, ఆమె ప్రార్ధనలు ఎంతకీ పూర్తి అవటం లేదు. 
ఎట్టకేలకు ఆమె ప్రార్ధనలు ముగించి వచ్చిన తరువాత, ఆమె మంచి మనసుకు ఆమె చేసిన ప్రార్ధనలు అన్నీ ఆ భగవంతుడు వింటాడు అని భరోసా ఇచ్చాడు.

ఆ ముసలామె చిరునవ్వు నవ్వి, భగవంతుడు నేను కోరిన అన్ని కోరికలూ తీర్చాడు ఒక్కటి తప్ప,
ఎందుకనో ఈ కోరిక మాత్రం తీర్చడం లేదు అని చెప్పింది.

ఆమెకు అభ్యంతరం లేకపోతే, ఆమెకు కల కోరిక ఏమిటో చెప్పమని, 
తాను సాధ్యమైనంత సహాయపడతానని చెప్పాదు వైద్యుడు.

ఆమె ఇలా చెప్పటం ప్రారంభించింది.

"ఈ ఉయ్యాలలో ఉన్నవాడు నా మనుమడు. 
అతనికి ఒక అరుదైన క్యాన్సర్ వ్యాధి సోకింది. 
ఎంతో మంది వైద్యులకు చూపించాము. 
ఎవ్వరూ నయం చేయలేకపోయారు. 
ఒక్క స్టీఫెన్ అన్న ఆయన మాత్రమే ఈ వ్యాధి తగ్గించగలడు, 
ఆయన ఇక్కడికి చాలా దూరంలో ఉన్నాడు. 
అందుకే వైద్యం మీద ఆశ వదిలేసి, 
భగవత్ ప్రార్ధనలతో జీవితం గడిపేస్తున్నాను
అని చెప్పింది.

వింటున్న డాక్టరు కళ్ళల్లో నీళ్ళు.
"భగవంతుడు దయామయుడు. 
ఆయన మీ ప్రార్ధనలు వినడమే కాదు, 
ఆ డాక్టరును మీ వద్దకే తీసుకువచ్చాడు కూడా. విమానం పాడయ్యి, 
గాలివానలో చిక్కుకుని, 
నేను మీ ఇంటికి వచ్చాను. 
కాదు కాదు, 
ఈ పరిస్థితి సృష్టించి ఆయనే నన్ను మీ వద్దకు పంపాడు. 
ఆ డాక్టర్ స్టీఫెన్ ను నేనే." అని బదులిచ్చాడు.

అప్పుడు ఆ క్షణం అతను అందుకోవలసిన అవార్డు అతనికి గుర్తు రాలేదు.

ప్రార్ధన లోని మహత్యం అదే. 
మనం వెళ్ళలేని చోటుకు కూడా దాని శక్తి వెళుతుంది. కావలసినది నమ్మకం అంతే.

1.అడగడం, 
2. నమ్మడం, 
3.అందుకోవడం...ఇవే ప్రార్ధనకు కావలసిన అంశాలు.

నమ్మి మనం ప్రార్ధిస్తే, 
మనకు కావలసినది ఆయన తప్పక మనకు లభింపచేస్తాడు..
---------------------------------------------------------------------------------------------------------------------
రక్త సంబంధం

ఒకరోజు తమ్ముడు ఫోన్ చేసాడు. అక్కా నీ మరదల్ని తీసుకుని మీ ఇంటికి వస్తున్నాను అని.   అందుకు సంతోషంతో పొంగిపోయిన అక్క వంటగది అంతా వెతికింది. వారికోసం ప్రత్యేకంగా ఏదైనా వండాలి అని.  పేదరికంలో ఆమె ఓడిపోయింది. ఏమీ కనిపించలేదు....     రెండే రెండు ఆరంజ్ పళ్ళు కనిపించాయి. వాటితో రెండు గ్లాసుల జ్యూస్ తయారు చేసి ఇద్దరి కోసం సిద్ధంగా ఉంచింది...

బెల్ మోగింది తమ్ముడు వచ్చేసాడని పరిగెత్తుకుంటూ వెళ్ళి తలుపు తీసింది.  ఎదురుగా తమ్ముడు, మరదలు, మరదలు తల్లి కూడా రావడంతో క్షణం ఆలోచనలో పడిపోయింది.  అయినా వారిని ఆనందంగా ఆహ్వానించి కూర్చోబెట్టింది...

వంట గదిలోకి వెళ్ళింది. రెండు గ్లాసుల్లో జ్యూస్ తీసుకుని ఒక గ్లాసు లో నీళ్లు తెచ్చింది. మరదలు ముందు ఆమె తల్లి ముందు ఆరంజ్ జ్యూస్ ఉంచింది. తమ్ముడి ముందు మాత్రం నీళ్ళ గ్లాసు ఉంచింది...     తమ్ముడికి 7up అంటే ఇష్టం అని చెబుతూ...

తమ్ముడి అది తాగి నిజం తెలుసుకున్నాడు.
ఇంతలో అత్తగారు నాకు 7up కావలి అని అడగడంతో గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది అక్కకు...

అక్కా నువ్వు కూర్చో నేను తెస్తానని చెప్పి వంటింట్లోకి వెళ్ళి ఒక  గ్లాసు కింద పడేసాడు . 
అయ్యో ఏమైంది ఆని అందరూ అడిగితే....     జ్యూస్ ఒలికింది. నేను వెళ్ళి బయట తెస్తాను అని అల్లుడు వెళ్తుంటే...    అత్తగారు వద్దులే బాబు అంటూ వారించింది.

 ఇక వెళ్ళొస్తామంటూ...    బయల్దేరారు ముగ్గురూను.

 తమ్ముడు అక్క దగ్గరకు వచ్చి, చేతులు పట్టుకుని "అక్కా.! జాగ్రత్త. వంటగదిని శుభ్రంగా తుడిచేయి. లేదంటే చీమలు వచ్చేస్తాయి" అని చేతిలో కొంత డబ్బును చేతిలో పెట్టాడు.  భార్యకు, అత్తగారికి కనిపించకుండా డబ్బులను, అక్కకు తెలియకుండా.. కంటి నీరుని దాచుకుంటూ, అక్క కష్టాన్ని కాస్త తాను పంచుకుంటూ.* 
"ఇక నుంచి తరచూ.. పనుల మీద ఈ ఊరు రావలసి వస్తుంది. వచ్చినపుడల్లా...     నీ చేతి వంట రుచి చూడాల్సిందే" అన్నాడు.
 భవిష్యత్తులో చేయవలసిన వాటికి బీజం వేస్తూ...
ఆలోచించుకుంటూ....!
సోదరులంటే ఇలా ఉండాలి కదా....!
బంధం అనే కాదు...    కష్టాల్లో  ఉన్నవారికి మన వల్ల చేతనైన సాయం అందించి వారిని కష్టాల నుండి బయటపడే సహాయం, ప్రయత్నం చేయాలి.
ఆత్మీయతను కోల్పోకండి.!
 మనకి అందరు దొరుకుతారు. ఎక్కడ అయినా తోడపుట్టిన వాళ్ళని కోల్పోతే వాళ్ళు దొరకరు. ఏదైనా విభేదాలు ఉన్నా...      మనమే ఒక అడుగు ముందుకు వేసి కలుపు కోవడంలో తప్పు లేదు.
 "ఏమంటారు"..?
-సేకరణ
----------------------------------------------------------
చిలుక-ఏనుగు

చాలా కాలం పంజరంలో ఉన్న ఒక చిలుకకు విసుగొచ్చి, చాలా కష్టాలు పడి  పంజరంలోంచి తప్పించుకొని అడవికి చేరింది. అడవిలో దొరికే తియ్యని పండ్లు తింటూ, తన ఇష్టం వచ్చినట్లు చెట్లమీద గెంతుతూ కొన్నాళ్లు ఆనందంగా గడిపింది.

ఒకరోజు ఒక పెద్దచెట్టు కింద కాళ్ళు బోర్లాచాపి పడుకున్న ఏనుగు ఒకటి ఆ చిలుకకు కనిపించింది.  ఆ వెంటనే చిలుకకు ఒక చిలిపి కోరిక పుట్టి ఎలాగైనా ఆ ఏనుగు నిద్ర చెడగొట్టాలనుకుంది.

వెంటనే చెట్టుమీదనుండి రివ్వున కిందకి ఎగిరి తన ముక్కుతో ఏనుగు తల మీద పొడిచింది. చిలుక వాడియైన ముక్కు
చురుక్కుమంటూ గుచ్చుకోవడంతో ఏనుగు ఒళ్లు
విదిలించుకుంటూ కళ్ళు తెరిచింది.

చిలుక చెట్టుమీదకి చేరి కిలకిలా నవ్వింది. ’ఏయ్ చిలకా! నా నిద్ర ఎందుకు పాడుచేశావ్?’ అంది ఏనుగు కోపంగా. ’ఊరికే’ అంటూ చిలుక మళ్ళీ నవ్వింది. చేసేది ఏమీ లేక ఏనుగు మళ్ళీ కళ్లు మూసుకుని పడుకుంది. కొంచెం సేపటి తరువాత చిలుక మళ్ళీ రివ్వుమని కిందికొచ్చి, ఏనుగు మరోసారి పొడిచి, వెళ్ళి చెట్టు ఎక్కి కూర్చుంది. ఏనుగు నిద్ర మరోసారి చెడింది. ఈసారి ఏనుగు ’ఏయ్ చిలకా! నీకేం పనిలేదా?’ అంటూ కోపంగా ఘీంకరించింది. కానీ చిలుక మరో రెండుమూడు సార్లు అలాగే చేసింది. దాంతో ఇక లాభం లేదని ఏనుగు అక్కడినుంచి లేచి బయలుదేరింది.

చిలుకకు అది ఇంకా సరదా అనిపించింది. మరోసారి ఎగిరి ఏనుగు తల మీద పొడిచి వెళ్ళి ఒక చెట్టుమీద వాలింది. ఏనుగుకి కోపం ముంచుకొచ్చింది. చిలుకకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకొని, అక్కడికి దగ్గరలో ఉన్న చెరువులోనికి దిగి తన తల, మూపురం తప్ప మిగిలిన శరీరమంతా నీటిలో ముంచింది.
అది చూసిన చిలుకకు మరింత ఉత్సాహమనిపించింది. అది అనుకుంది, "ఆహా! నాకన్నా వెయ్యిరెట్లు బలమైన ఏనుగుకూడా నా దెబ్బకు భయపడిపోయి, వెళ్ళి నీళ్ళలో దాక్కున్నది చూడు" అని. ’ఊ.... ఈ పిరికి ఏనుగుకి మరోసారి నా దెబ్బ చూపిస్తా’ అనుకొని అది రివ్వున ఎగిరి ఏనుగు మీద వాలి దాన్ని
పొడవబోయింది. కానీ చిలుక అలా చేస్తుందని ముందుగా
ఊహించిన ఏనుగు అప్పటికే తన తొండంలో నింపుకున్న నీటిని "ఉఫ్..." మంటూ చిలుక మీదికి చిమ్మింది. ఆ నీటి తాకిడికి ఉక్కిరి బిక్కిరి అయిన చిలుక, ఇక ఎగరలేక, ఆ చెరువులో పడి గిలగిలా కొట్టుకున్నది. 

దయగల ఏనుగు దాన్ని చూసి జాలిపడి దానిని ఒడ్డుమీదికి విసిరి చిలుకకు ఇక బుద్ధి వచ్చింది. తనను క్షమించమని ఏనుగును వేడుకొన్నది. ఏనుగు గంభీరంగా చిరునవ్వు నవ్వి, తన దారిన తను వెళ్ళిపోయింది. 
---------------------------------------------
సహాయం
అనగనగా ఒక ఊళ్ళో ఒక నది. ఆ నది ఒడ్డున రెండు పెద్ద చెట్లు. ఆ దారిన వెళుతున్న ఒక చిన్న పిట్ట తన పిల్లలకు చిన్నగూడు కట్టుకుందామనుకొని, మొదటి చెట్టు దగ్గరకు వెళ్ళింది.

' వర్షాకాలం వస్తోంది, నేనూ నా పిల్లలూ ఉండటానికి నీ కొమ్మ మీద గూడు కట్టుకోనా ? అని అడిగింది. ' వద్దు ' అనేసింది మొదటి చెట్టు.

ఆ పిట్ట చిన్నబుచ్చుకుంది. నిరశగా రెండో చెట్టు దగ్గరకు పోయి సహయం కోసం వేడుకుంది. ' సరే ' అంది రెండో చెట్టు.

ఆనందంగా ఎగిరి గంతులేస్తూ గూడుకట్టే పని మొదలుపెట్టింది పిట్ట. వానాకాలం వచ్చేలోపే రెండో చెట్టు మీద గూడు కట్టేసుకుంది. పిల్లలతో ఆనందంగా కాలం గడపసాగింది. ఈలోగా వర్షాకాలం వచ్చేసింది.

ఓరోజు వర్షం మొదలైంది. చూస్తుండగానే పెద్దదైంది. వరద రావడం మొదలైంది. ఆ వరదలో మొదటిరోజు కూకటివేళ్ళతో సహా కూలిపోయి, నీటిలో కొట్టుకునిపోతోంది. ఆ ధృశ్యాన్ని రెండో చెట్టు మీద కూర్చున్న పిట్ట చూస్తూ...' భగవంతుడు నీకు తగిన శిక్ష వేశాడు. నాకు సహయం చేయడానికి నిరాకరించావుగా ' అంది నవ్వుతూ. ' నేను బలహీనమైనదానినని నాకు తెలుసు. వరద వస్తే కొట్టుకోనిపొతానని కూడా తెలుసు. నాతోపాటు నీ గూడు కూడా కొట్టుకుపోకూడదనే నువ్వు గూడు కట్టుకునేందుకు నిరాకరించాను. నన్ను క్షమించు. పిల్లలతో పదికాలాలు సుఖంగా ఉండు ' అంది.


ఆ చిన్నపిట్ట గుండెలనిండా పశ్చాత్తపం.

( ఎవరైనా సహాయం చేయడానికి నిరాకరిస్తే తప్పుగా అనుకోకుడదు. వారు ఏ నిస్సహయ పరిస్థితిలో అలా చేశారో అర్దం చేసుకోవడానికి ప్రయత్నించాలి.)

--------------------------------------
స్త్రీ కోరిక

హర్షవర్ధనుడనే రాజు యుద్ధంలో ఓడిపోయాడు. అతనిని చేతులకు బేడీలతో గెలిచిన రాజు వద్దకు తీసుకునివెళ్ళారు, ఆ సమయంలో గెలిచిన రాజు సంతోషకరమైన మానసిక స్థితిలో ఉన్నాడు.

 రాజు హర్షవర్ధనుని ముందు ఒక ప్రతిపాదనను ఉంచాడు "ఆ ప్రతిపాదన ఏమిటంటే "మీరు నాకు ఒక ప్రశ్నకు సరిగ్గా సమాధానం ఇవ్వగలిగితే నేను మీ రాజ్యాన్ని మీకు తిరిగి ఇస్తాను, ఒకవేళ ఇవ్వలేకపోతే రాజ్యాన్ని ఇవ్వడం కాదుకదా శిక్ష కూడా అనుభవించాలి"మరియు మీరు నా దేశంలో మీ జీవితాంతం ఖైదీగా ఉండవలసి ఉంటుంది అని అన్నాడు".

 “ప్రశ్న ఏమిటంటే, 

'ఒక స్త్రీ పురుషుని నుండి ఏమి కోరుకుంటుంది..?' 
 సమాధానం ఇవ్వడానికి మీకు ఒక నెల సమయం లభిస్తుంది. ”అని అనగా...

 రాజు ప్రతిపాదనను హర్షవర్ధనుడు అంగీకరించారు.

హర్షవర్ధనుడు వివిధ ప్రదేశాలకు వెళ్లి అనేక మంది పండితులు, బోధకులు, పూజారులు, నృత్యకారులు, వేశ్యలు, గృహిణులు, పనిమనిషి మరియు మరెంతో మందిని కలుసుకున్నారు.

 ఆమెకు ఆభరణాలు కావాలని కొందరు చెబితే, ఆస్తిపాస్తులని కొందరు, శారీరక సుఖాలని కొందరు మరికొందరేమో తాము మనిషి నుండి పిల్లలను కోరుకుంటున్నారని, మరొకరు అందమైన ఇల్లు మరియు కుటుంబం అని అన్నారు, మరొకరు స్త్రీ సింహాసనం కావాలని కోరుకుంటుంది అన్నారు

 ఈ సమాధానాలతో హర్షవర్ధనుడు అస్సలు సంతృప్తి చెందలేదు.

 నెల ముగిసిపోయే సమయం వచ్చింది,

 మరోవైపు, హర్షవర్ధనుడు సంతృప్తికరమైన సమాధానం సేకరించలేకపోయాడు.

 అప్పుడు ఎవరో చాలా దూరంగా, మరొక దేశంలో ఒక మంత్రగత్తె నివసిస్తున్నారని సమాచారం, ఇస్తూ ఆమెకు అన్ని సమాధానాలు తెలిసి ఉన్నందున ఆమె మాత్రమే ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వగలదు, అని సలహా ఇచ్చారు

 అప్పుడు హర్షవర్ధనుడు తన స్నేహితుడైన సిద్ధిరాజ్‌తో పాటు, పొరుగు దేశం వెళ్లి మంత్రగత్తెని కలిశాడు. హర్షవర్ధనుడు తన ప్రశ్న ఆమెను అడిగాడు.

అందుకు  మంత్రగత్తె,  "మీ స్నేహితుడు సిద్దిరాజు నన్ను వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తేనే నేను మీకు సరైన సమాధానం ఇస్తాను" అని షరతు పెట్టింది.

 హర్షవర్ధనుడు చాలా ఆలోచించాడు మంత్రగత్తె ను చూస్తే చాలా ముసలిదానిలా కనిపిస్తూ ఉంది, మరియు చాలా అందవికారంగా ఉంది, తన స్నేహితుడికి ఇలాంటి వ్యక్తితో వివాహమంటే మిత్రుడికి అన్యాయం చేయటమే, అని ఆలోచించి సమాధానం తెలీకున్నా పరవాలేదు, కానీ మిత్రుడికి నష్టం జరగాలని అతను కోరుకోలేదు.అందుకే హర్షవర్ధనుడు ఆ ప్రతిపాదనను తిరస్కరించాడు

 కానీ సిద్దిరాజు మాత్రం, తన స్నేహితుడు, తన దేశ రాజు అయిన హర్షవర్ధనున్ని కాపాడటానికి మంత్రగత్తెను వివాహం చేసుకోవడానికి సమ్మతి తెలిపి  వెంటనే వివాహం కూడా చేసుకున్నాడు.

 అప్పుడు మంత్రగత్తె హర్షవర్ధనునికి సమాధానమిస్తూ, “ఒక స్త్రీ స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటుంది, తద్వారా ఆమె స్వయంగా నిర్ణయాలు తీసుకుంటుంది.”

 హర్షవర్ధనుడు ఈ సమాధానంకు సంతృప్తి పడ్డాడు,
అతను తనను గెలిచిన రాజుకు ఈ సమాధానం చెప్పాడు.  రాజు సమాధానం ఒప్పుకొని, హర్షవర్ధనున్ని విడుదల చేసి తన రాజ్యాన్ని అతనికి తిరిగి ఇచ్చాడు.

 మరోవైపు, తన పెళ్లి రాత్రి మంత్రగత్తె తన భర్తతో, “మీకు స్వచ్ఛమైన హృదయం ఉంది.  మీ స్నేహితుడిని కాపాడటానికి మీకు మీరే త్యాగం చేసారు, కాబట్టి నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ” అంది

 “ప్రతిరోజూ, నేను 12 గంటలు అందవికారంగా కనిపిస్తాను మరియు తరువాతి 12 గంటలు చాలా అందంగా కనిపిస్తాను. మీరు ఇప్పుడు చెప్పండి, మీరు ఏ రూపాన్ని అంగీకరించాలనుకుంటున్నారు. ”అని అడిగింది

దానికి సిద్ధిరాజ్ “అది మీ నిర్ణయం నేను నిన్ను నా భార్యగా అంగీకరించాను, కాబట్టి, నీవు ఎలా వున్నా సరే అలాగే కోరుకుంటున్నాను అని బదులిచ్చాడు.”

 ఇది విన్న మంత్రగత్తె అందంగా మారి “మీరు నన్ను స్వయంనిర్ణయం తీసుకోవడానికి అనుమతించారు, అందువల్ల ఇప్పటినుండి నేను ఎప్పుడూ అందంగానే ఉంటాను” అని అన్నది.

 “వాస్తవానికి ఇదే నా నిజమైన రూపం.  చుట్టుపక్కల ఉన్న అసహ్యమైన ప్రజల కోసం నేను నా రూపాన్ని అందవికారమైన మంత్రగత్తెగా మార్చాను అని చెప్పింది.....

 ఇందులో పాఠకులు గమనించాల్సిందేమంటే
 సామాజిక నిబంధనలు మహిళలను మగాడి మీద ఆధారపడేలా చేశాయి, కానీ, మానసికంగా ఏ స్త్రీ కూడా ఇతరుల మీద ఆధారపడటాన్ని అంగీకరించదు.

 అందువల్ల, భార్యలకు స్వయం నిర్ణయాధికారం ఇచ్చిన గృహాలు సాధారణంగా సంతోషంగా ఉంటాయి.

 భార్యను ఇంటి అధిపతిగా ఉండటానికి మీరు అనుమతించకపోవచ్చు, కాని, ఆమె జీవితంలో సగం మాత్రమే మీరు, మిగితా భాగాన్ని, ఆ సగం భాగాన్నయినా విడుదల చేయాలి, దీనితో ఆమె బహిరంగంగా ధైర్యంగా తన నిర్ణయాలు తీసుకోవచ్చు. తనకు ఒక మనస్సుందని, తనకంటూ ఒక వ్యక్తిత్వం ఉందని గుర్తించండి, మీలో మానవత్వం మొగ్గతొడిగితే తాను మీ మనోక్షేత్రంలో పూవై పూస్తుంది...
------------
జిత్తులమారి నక్క 

అనగనగా ఒక అడవిలో ఒక జిత్తులమారి నక్క నివసిస్తుండేది. ఒక రోజు ఆ నక్క ఆహారం కోసం వెతుక్కుంటూ అడవిలో తిరుగుతుండగా దానికి ---ఢం..ఢం...గర్..గర్...గర్...అంటూ విచిత్రమైన శబ్దం వినవచ్చింది.

‘అమ్మో! ఇదేం శబ్దం? ఏదైనా వింత జంతువుగానీ ఈ అడవిలోకి రాలేదు కదా?’ అనుకుని భయపడి గబగబా పరిగెత్తుకుని పోయి ఒక పొద వెనకాల దాక్కుని అటూ ఇటూ చూసింది. ఎంతసేపటికీ నక్కకి ఆ చుట్టు ప్రక్కల మానవ సంచారం కానీ, జంతు సంచారం కానీ కనిపించలేదు.



నక్క ‘అమ్మయ్య’ అనుకునే లోగానే మళ్ళీ అదే శబ్దం ‘ఢం..ఢం...గర్..గర్..గర్ర్..’ అని ఈసారి ఇంకా ఎక్కువగా కర్ణ కఠోరంగా వినిపించింది.

‘ఇక్కడ చూస్తే కనుచూపు మేరలోఎవ్వరూ కనిపించడం లేదు, మరి ఆ శబ్దం ఎక్కడనుండి వస్తోందబ్బా?’ అనుకుని ధైర్యం చేసి నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ పొద చాటునుండి బయటకి వచ్చి ఆ పరిసరాలని పరికించి చూసింది. అప్పుడు ఆ నక్కకి తాను నిలుచున్న ప్రదేశానికి కొంత ఎత్తులో ఒక చెట్టు క్రింద ఏదో పెద్ద వస్తువు కనిపించింది. అదేమిటా అని దగ్గరగా వెళ్ళి చూడగా అది ఒక ఢంకా [యుధ్ధ భేరి.] ఆ చెట్టు కొమ్మలు ఢంకా మీద వ్రాలి గాలికి అటూ ఇటూ రాసుకుంటూ కదులుతుండడం చేత ఆ శబ్దం వస్తున్నదని గ్రహించింది నక్క.

అంతే అకారణ  కోపంతో ‘ ఓసి మాయదారి ఢంకా ! నువ్వా నన్నంత హడలు గొట్టి భయపెట్టావు? ఉండు నీ పని చెప్తాను’ అని శబ్దం చేస్తూ దానిపై పొరలా ఉన్న జంతు చర్మాన్ని కొరికి తింది. అలా కొన్నాళ్ళు ఆ చర్మాన్నే ఆహారంగా తింటూ అక్కడే ఉండిపోయింది  నక్క.

ఏ విషయమైన కేవలం చెవులతో విని ఏదేదో ఊహించుకుని భయపడేకంటే కళ్ళతో చూసి నిజానిజాలు తెలుసుకుని ఒక నిర్ణయానికి రావడం ఎల్లప్పుడూ మంచిది.

🪴🪴🪴🪴🪴🪴🪴🪴

 *వినదగు నెవ్వరు చెప్పిన* 
 *వినినంతనె వేగపడక* *వివరింపదగున్* 
 *గని కల్ల నిజము దెలిసిన* 
 *మనుజుడెపో నీతిపరుడు* *మహిలో సుమతీ...* 


లోకంలో ఎవ్వరు ఏమి చెప్పినా ఓపికగా వినేవాడే ఉత్తముడు. ఏదేని విషయాన్ని విన్న వెంటనే తొందరపడి మాట్లాడకుండా... అందులో నిజా నిజాలను తెలుసుకునేవాడే ఈ భూప్రపంచంలో నీతిపరుడుగా నిలుస్తాడని ఈ పద్యం యొక్క భావం.

🪴🪴🪴🪴🪴🪴🪴🪴🪴