Adsense

Showing posts with label Vizag Airport. Show all posts
Showing posts with label Vizag Airport. Show all posts

Sunday, January 5, 2025

విశాఖపట్నం విమానాశ్రయంని ఎందుకు VTZ అంటారు? ఎందుకు VSKP అన్నారు?

ప్రపంచంలోని అన్ని విమానాశ్రయాలకూ గుర్తింపు కోడ్ లను ఇచ్చే సంస్థలు రెండు ఉన్నాయి. ఒకటి అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ,ICAO. ఇది ఐక్యరాజ్య సమితిలో ఒక భాగం. వీళ్లు ప్రతి విమానాశ్రయానికీ నాలుగక్షరాల గుర్తింపు సంకేతాన్ని కేటాయిస్తారు. ఇందులో మొదటి అక్షరం ఒక దేశాన్ని గాని, కొన్ని దేశాల సమూహం ఉన్న భౌగోళిక ప్రదేశాన్ని గానీ సూచిస్తాయి. రెండవ అక్షరం ఆ దేశం/ భౌగోళిక ప్రదేశంలోని ప్రాంతాన్ని సూచిస్తుంది. చివరి రెండక్షరాలు ఆ విమానాశ్రయం పేరునో, అది ఉన్న ఊరినో ఆధారం చేసుకొని ఉంటాయి. భారతదేశానికి VA,VE,VI,VO అన్న నాలుగు సంకేతాలు కేటాయించారు. భారత పశ్చిమ ప్రాంత విమానాశ్రయాలు (ముంబై రీజియన్) VA తోను, తూర్పుప్రాంతానివి (కోల్కత రీజియన్) VE తోను, ఉత్తర ప్రాంతంవి (ఢిల్లీ రీజియన్) VI తోను, దక్షిణ ప్రాంతపు విమానాశ్రయాలు (చెన్నై రీజియన్) VO అన్న అక్షరాలతోను ప్రారంభం అవుతాయి. ఉదాహరణకు ఢిల్లీ విమాశ్రయం కోడ్ VIDP అని, విజయవాడ విమానాశ్రయం కోడ్ VOBZ అని, విశాఖపట్నం కోడ్ VOVZ అనీ ఇచ్చారు. అంతర్జాతీయ వ్యవహారాలలోను, పైలట్ల మధ్య సంభాషణలకొరకు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కొరకు, ఈ ICAO వారి నాలుగక్షరాల సంకేతాన్నే వాడుతారు.

ఇక రెండవది, మనకు బాగా పరిచయమైన మూడక్షరాల సంకేతం మరో అంతర్జాతీయ సంస్థ ఐన 'ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ అసోసియేషన్' (IATA) వారిది. వారు ప్రపంచంలోని ప్రతి విమానాశ్రయానికీ (కొన్నిసార్లు కొన్ని నౌకాశ్రయాలకు, రైల్వేస్టేషన్లు, బస్ స్టాండులకు కూడా) ఒక మూడక్షరాల సంకేతనామాన్ని కేటాయిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ట్రావెల్ ఏజెన్సీలు, టూర్ ఆపరేటర్లు, విమానయాన సంస్థల ఉపయోగంకోసం ఈ కోడ్ ను రూపొందించారు. మనకు జారీ చేసే విమానం టిక్కెట్లపై ఉండేది ఈ IATA వారి సంకేతమే. వీలైనంతవరకు ICAO కోడ్ లోని చివరి రెండక్షరాలను తీసుకొంటూ మరో అక్షరాన్ని కలిపి వీరి కోడ్ ను జారీ చేస్తారు. ఇది ప్రపంచంలోని మరే విమానాశ్రయంతోనూ పోలకుండా ప్రత్యేకంగా ఉండాలి గనుక, మూడక్షరాలతో చేయగలిగే పర్మ్యూటేషన్లు మరీ ఎక్కువ ఉండవు గనుక, ఏదో ఒక అక్షరం పెట్టి సరిపెట్టేస్తారు. అలా విశాఖపట్నంకు ICAO ఇచ్చిన కోడ్ లోని చివరి రెండక్షరాలైన VZ ను తీసుకొని మధ్యలో ఒక అక్షరం చొప్పించి VTZ చేసారు. అలాగే రాజమండ్రికి RJA, విజయవాడకు VGA ఇలా.

ప్రత్యేకంగా ఉండడం తప్ప ఈ కోడ్ కు IATA వారి దృష్టిలో మరే ప్రాముఖ్యం లేదు. అందుకే కొన్ని విమానాశ్రయాల పేరుకు, ఊరికి, ఆ కోడ్ కు ఏమీ సంబంధం ఉండదు. ఉదాహరణకు చండీఘడ్ విమానాశ్రయం కోడ్ IXC, బెల్గాం విమానాశ్రయం కోడ్ IXG, అమృత్ సర్ విమానాశ్రయం కోడ్ ATQ ఇలా ఉంటాయి.