💠వరంగల్లు జన జాతర చూడాలంటే రెండేళ్లకొక్కసారి జరిగే మేడారం జాతరకి పోవాలన్నది మాట. అదొక్కటేనా, తెలంగాణల పెద్ద పండుగ దసరాకి కూడా వరంగల్ మొత్తం సంబరాలతోటి సందడి సందడిగ ఉంటది. దసరా పండుగకి వరంగల్ పోతే ఈ పెద్ద పండుగ ఎంత వైభవంగ ఉంటదో తెలుస్తది.
💠 తెలంగాణలో దసరా అంటే అన్ని పండుగలకు పెద్ద పండుగ.
బతుకమ్మ నుంచి మొదలుపెడితే దసరా పండుగ రోజు వరకు పది, పన్నెండు రోజులంతా సందడే.
వరంగల్ లో దసరా పండుగ వచ్చిందంటే జాతరే. ఆ రేంజ్ లో ఉంటాయి మరి వేడుకలు. సద్దుల బతుకమ్మ రోజు, దసరా పండుగ రోజు వేయిస్తంభాల గుడికి కానీ, పద్మాక్షి దేవాలయానికి కానీ పోతే అసలైన దసరా పండుగ వైభవాన్ని చూడొచ్చు .
💠 వరంగల్ ప్రత్యేకత ఏంటంటే భద్రకాళి, పద్మాక్షి, వేయిస్తంభాల గుళ్లు. పొద్దున, సాయంత్రం వేలాది మంది భక్తులు ఇక్కడ
పూజలు చేస్తుంటారు.
నవరాత్రి ఉత్సవాల్లో భద్రకాళీ ఆలయం, దసరా ఉత్సవాల సందర్భంగా ఓరుగల్లు భద్రకాళీ ఆలయంలో నిర్వహించే దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఆద్యంతం భక్తిభావాన్ని పెంపొందిస్తాయి.
కాకతీయుల రాజధాని ఏకశిల నగరంగా చెప్పుకునే ప్రస్తుత వరంగల్ లోని భద్రకాళి అమ్మవారిని.. తొమ్మిది రోజుల పాటు వివిధ దేవతామూర్తుల రూపంలో అలంకరిస్తారు.
💠 ఉదయం, సాయంత్రం వేళల్లో భక్తి శ్రద్ధలతో అభిషేకాలు చేస్తారు.
ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా దేశంలోని చాలా ప్రాంతాల నుంచి బతుకమ్మ,దసరా పండుగలకు భద్రకాళి ఆలయానికి వస్తుంటారు భక్తులు.
దసరా రోజున సాయంత్రం భద్రకాళి చెరువులో ఎంతో వైభవంగా తెప్పోత్సవం నిర్వహిస్తారు. హంసవాహనంపై అమ్మవారిని ఊరేగిస్తారు. భద్రకాళి, భద్రేశ్వరులకు కల్యాణం, పుష్పయాగంతో నవరాత్రి ఉత్సవాలకు ముగింపు పలుకుతారు.
💠 ఈ ఉత్సవాన్ని చూడటం భక్తులకు కన్నులపండుగే.వేయిస్తంభాల గుడికి పోవాల్సిందే.
💠 వరంగల్ పేరు చెప్పగానే ఎవ్వరికైనా గుర్తొచ్చే వేయిస్తంభాల గుడికి దసరా సీజన్లో వెళ్లి తీరాల్సిందే. రుద్రేశ్వరస్వామి ఆలయం ప్రాంగణంలో బతుకమ్మ ఆట రాష్ట్రమంతటా ఫేమస్.
💠 శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రుద్రేశ్వర దేవికి పూజా కార్యక్రమాలు, చండీయాగం నిర్వహిస్తారు. అమ్మవారి ప్రతిమలతో పురవీధుల్లో ఊరేగింపు చేపడతారు.
ఎక్కడ చూసినా కలర్ఫుల్ లైట్లు కనిపిస్తాయి.
💠 సీతారాములు, లక్ష్మణుడు, ఆంజనేయుల విగ్రహాలతో నిర్వహించే శోభాయాత్ర చూస్తే దసరా పండుగకు ఒక అర్థం వచ్చినట్టే ఉంటుంది.
రావణవధ కార్యక్రమం ఇంకా బాగా ఆకట్టుకుంటుంది.
💠 ఉర్సు గుట్ట,ఖమ్మం బైపాస్ రోడ్డు, కరీమాబాద్, హన్మకొండ పద్మాక్షి గుట్ట, హన్మకొండ చౌరస్తా, హంటర్ రోడ్డు, కొత్త బస్టాండ్ రోడ్లన్నీ మూడు నాలుగు కిలోమీటర్ల దూరం జన జాతర ఉంటుంది.
💠 ఓరుగల్లు నగరంలో చాలా ప్రత్యేకం రావణ వధ.
దసరా ఉత్సవాల కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చే జనమంతా సాయంత్రం ఈ కార్యక్రమాలు ప్రధానంగా జరిగే రంగలీల మైదానం, పద్మాక్షి టెంపుల్ ఏరియాలకు చేరుకుంటారు.
ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో 60 నుంచి 70 అడుగుల ఎత్తుతో పది తలల రావణాసురుని ప్రతిమలు ఏర్పాటు చేస్తారు.
రంగురంగుల తారాజువ్వలతో ఏర్పాటు చేసేమల్లె పందిరి, నాగ సర్పం.. చీకట్లో కాలుతుంటే మిరుమిట్లు వెదజల్లుతాయి. నిర్వాహకులు ఏర్పాటు చేసిన వేదికపై కళాకారులు ప్రదర్శనలు ఇస్తారు.
చివర్లో రావణ వధ జరిగే సమయంలో పెద్ద పెద్ద బాంబులతో పాటే రావణుడి తల పేలిపోతుంటే.. జనం మురిసిపోతారు.
'జై శ్రీరామ్' అన్న నినాదం చుట్టుపక్కలంతా ప్రకంపనలు సృష్టిస్తుందా అనిపిస్తుంది.