Adsense

Showing posts with label mannar rajagopala swamy temple. Show all posts
Showing posts with label mannar rajagopala swamy temple. Show all posts

Saturday, March 25, 2023

మన్నార్ రాజగోపాల స్వామి ఆలయం, విజయనగరం జిల్లా విజయనగరం.




💠 శ్రీకృష్ణ పరమాత్మకు సంబంధించిన ఆలయాలు భారతదేశంలో ఎన్నో ఉన్నాయి.
ఈ ఆలయాల్లో శ్రీకృష్ణ పరమాత్మ వివిధ పేర్లతో, వివిధ రూపాల్లో భక్తులకు దర్శనం ఇస్తూ అనుగ్రహిస్తూ ఉంటాడు.
శ్రీకృష్ణ పరమాత్మకు ఉన్న ఎన్నో పేర్లలో
" రాజమన్నార్" అనే పేరు బహు విశిష్టమైనది.

💠 "రాజమన్నార్" అనే పేరుతో స్వామివారి ఆలయాలు భారతదేశంలో చాలా అరుదు.
"రాజమన్నార్ "అనే పేరు వినగానే శ్రీవైష్ణవులకు, విష్ణుభక్తులకు, శ్రీ కృష్ణ భక్తులకు టక్కున  గుర్తుకు వచ్చే పేరు 108 శ్రీవైష్ణవ దివ్యదేశాలలో ఒకటైన తమిళనాడులోని  రామేశ్వరం దగ్గరలొని మన్నారుగుడి " శ్రీ రాజగోపాలస్వామి" ఆలయం.

💠 " రాజమన్నార్ " పేరుతో పిలువబడే శ్రీకృష్ణ పరమాత్మను దర్శించాలి అనుకునే తెలుగువారి కోసం అదే పేరుతో శ్రీకృష్ణ పరమాత్మ మన ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర ప్రాంతమైన విజయనగరం జిల్లా కేంద్రం విజయనగరం నగరంలోనే అత్యద్భుతమైన పురాతనమైన ఆలయంలో దర్శనమిస్తూ విజయనగర వాసులకే కాక ఉత్తరాంధ్ర ప్రాంతం మొత్తానికి ఒక శ్రీవైష్ణవ దివ్య దేశాన్ని చూసినంత, దర్శించినంత అనుభూతి కలిగిస్తూ అనుగ్రహిస్తున్నాడు.

💠 అటువంటి పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం
" మన్నార్ రాజగోపాలస్వామి"  ఆలయం, విజయనగరం.
ఈ ఆలయ వివరాలు ఈ రోజు మన గుడి శీర్షికలో తెలుసుకుందాం....

💠  విజయనగరంలోని కొత్తపేట, మండపంవీధి లోని మన్నార్ రాజగోపాల స్వామి ఆలయం 800 సంవత్సరాలకు పైగా పురాతనమైనది నమ్ముతారు.
స్థానికంగా సంతాన గోపాల స్వామి, కొత్త కోవెల లేదా వేణుగోపాల స్వామి ఆలయంగా పిలువబడే శ్రీ మన్నార్ రాజగోపాల స్వామి ఆలయం శ్రీ భగవత్ రామానుజాచార్య (1017-1137AD) మార్గదర్శకత్వంలో నిర్మించబడింది అంటారు.

💠 ఈ ఆలయం కొన్ని సంవత్సరాలుగా అనాసపరపు వంశము వారి ఆధీనంలో ఉండేది కాలక్రమేణా చుట్టుపక్కల ఆక్రమణలు మూలంగా భక్తులకు ఇబ్బందికరంగా ఉండుట వలన అనాదరణకు గురై జీర్ణావస్థకు చేరుకుంది.

💠 ఆలయ ధుస్థితిని చూసి భక్తులు  పునరుద్ధరణకు నడుంబిగించారు. దేవాదాయశాఖ మరియు ప్రభుత్వ తరపున సుమారు 42 లక్షల రూపాయల సహాయం లభించింది. ఇవి కాకుండా భక్తులు అధిక మొత్తంలో విరాళాలు కూడా అందించారు. ఫలితంగా ఇప్పుడు ఆలయం నూతన శోభతో కళకళలాడుతూ ఉంది. ఆక్రమణలు తొలగించి తూర్పు వైపు నూతనంగా అత్యంత సుందరంగా గాలిగోపురం నిర్మించారు.

💠 గోపురం ఇరువైపులా గజరాజులపై రక్షకభటులు సహజ రూపంలో అతి సుందరంగా నిర్మించారు. ఒక వైపు శ్రీ మహలక్ష్యీదేవి ఇంకొక వైపు శేషపాన్పుపై శయనించిన శ్రీలక్ష్మీ సమేతంగా శ్రీమన్నారాయణుడు చూడ ముచ్చటగా భక్తిభావం ఉట్టిపడేలా దర్శనం.
ప్రాకారంలోకి ప్రవేశిస్తే ద్వజస్తంభం కనిపిస్తుంది. దేవాలయం పైన ఒకవైపు వరాహస్వామి, మరోవైపు నరసింహస్వామివారి రూపాలు దర్శనమిస్తారు. మధ్యలో మాధవుడు మరియు ఒక ఆవు ఉంటారు.

💠 గోపురం లొపల ఇరువైపులా రమణీయంగా వసుదేవుల తైలవర్ణ చిత్రాలు, గాలిగోపురం దాటి లోపలికి వెళ్లితే 40 స్థంభాల ఆస్థాన మండపం పూర్తిగా శిలలతో నిర్మాణం చూపరులను అకర్షిస్తుండుటే కాకుండా నాటి శిల్పుల సాంకేతిక పరిజ్ఞానాన్ని మనకు అబ్బురపడేలా చేస్తుంది.

💠 అక్కడి స్తంభాల పైన చిన్న శిల్పం & గోడలపై రామాయణాన్ని వర్ణించే చిత్రాలు ఉన్నాయి.
ఈ మండపానికి అనుబంధంగా జగన్నాథ బలభద్ర సుభద్రను కలిగి ఉన్న 2  దేవాలయాలు మరియు ఒక లక్ష్మిదేవి ఉపాలయం ఉన్నాయి.

💠 గర్భగుడిలో రాజగోపాలస్వామి (కృష్ణుడు) మరియు రుక్మిణి & సత్యభామ
సమేతంగా ఇరు నాంచారులతొ ఉన్న రాజగోపాలస్వామి దర్శనం ఇస్తుంటారు.

💠 అంతరాళానికి ఇరువైపులా శ్రీ ఆండాళ్ (శ్రీ గోదా దేవి) మరియు శ్రీ రామానుజాచార్యుల చిన్న దేవాలయాలు ఉన్నాయి.

💠 గర్భాలయ గోపురంపై తిరుమల గర్భాలయ గోపురంలా విమాన శ్రీ రాజగోపాలస్వామి దర్శనంతో పునీతులు అవుతారు.

💠 ఈ ఆలయంలో ఇంకోక విశిష్టత విజయనగరం పూల్ బాగ్ రొడ్డులొ ఊటగెడ్డ నెల్లిమర్ల మధ్యలో శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయం 1000  సంవత్సరాల ముందు నిర్మించారు కాలక్రమేణా అ ప్రాతం వేణుగోపాలపురంగా గ్రామం ఏర్పడింది. ఒకనాడు ఆ ఆలయంపై పిడుగు పడి శిధిలమైంది. ఆ తరువాత ఈ ఆలయం కొత్తగా నిర్శించుట వలన కొత్త కోవెలగా ప్రసిద్ధి చెందినది.

💠 పిడుగుపాటుకు శిధిలమైన ఆలయం దట్టమైన పొదల్లో కనుగొని అచ్చట ఉన్న వేణుగోపాలస్వామి వారి విగ్రహాన్ని తీసి ఈ ఆలయంలో ఒకవైపు ప్రతిష్ఠించారు.
ఈ ఆలయం అణువణువునా శిల్పకళలతొ ఉట్టిపడేలా చేస్తుంది.

💠 ఇంకొక విశిష్టత ఏమిటంటే భక్తులు తమ కోరిక నేరవేరుటకొరకు 11 పర్యాయములు ఆలయ ప్రదక్షిణలు చేసి స్వామి వారికి తమ కొరిక విన్నవించుకొన్నంతలొ 40 రోజులలో తమ కోరిక నెరవేరుతాయి.
అనంతరం 108 పర్యాయములు ఈ ఆలయ ప్రదక్షిణలు చేయాలి.
ఇంతటి మహనీయత కల ఈ ఆలయం భక్తులు విశేష కృషి మూలంగా మరలా పూర్వవైభవం పొందింది.

💠 ఇక్కడ వార్షిక కల్యాణోత్సవం ఐదు రోజుల పండుగ.
శ్రీ వైష్ణవ సంప్రదాయమైన పంచారాత్ర ఆగమంలో పూజలు నిర్వహించబడే ఏకైక ఆలయం కూడా ఇదే

💠 ఇది విజయనగరం రైల్వే స్టేషన్ నుండి దాదాపు 3 కిమీ దూరంలో మాత్రమే ఉంది.