Adsense

Showing posts with label vedam. Show all posts
Showing posts with label vedam. Show all posts

Saturday, March 13, 2021

వేద పురుష ఆశీర్వచనం.. శతమానం భవతి శతాయుః , దీర్ఘాయుష్మాన్ భవ

“శతమానం భవతి శతాయుః పురుషశ్శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి.”
వేద పురుష ఆశీర్వచనం

మనలను నిండా నూరేళ్లు బ్రతకమని వేదం ఆశీర్వదిస్తోంది. వేద మంత్రానికి ఉన్న శక్తి గొప్పది కాబట్టి వేదజ్ఞులైన పెద్దలకు నమస్కరించి వారిచే ఈ ఆశీర్వచనం పొందుతూ ఉంటాం.
 
అలాగే నిత్యం చేసుకొనే సూర్యోపస్థానంలో “పశ్యేమ శరదశ్శతం, జీవేమ శరదశ్శతం, నందామ శరదశ్శతం, మోదామ శరదశ్శతం” అని చెప్పబడించి.

“నిండు నూరేళ్లు ఆ సూర్యుని చూడగలగాలి.నిండా నూరేళ్ళు జీవించాలి. ఆది కూడా ఆనందంగా జీవించాలి” అని ఆకాంక్షిస్తాం. ఇలా ఆకాంక్షించటంలో ఎంతో విలువ ఉంది. 

మంచి మనస్సు నుండి వచ్చే శుభాశీస్సుకు, శుభాకాంక్షాలకు కూడ శక్తి ఉంది. దాని వలన మేలు జరుగుతుంది. ఇది పూర్వకాలపు విషయమే కాదు, నేటి విషయం కూడా అని అర్థం చేసుకొనగలం.

“బ్రతికి యుండిన శుభములు బడయవచ్చు”
కాబట్టి బ్రతికి ఉండటం అంటే ఆయుర్దాయం మొదట కోరదగినది. అందుకే 
ఏ పూజ చేసినా సంకల్పంలో ఆయురారోగ్య భోగభాగ్యాలు కాంక్షిస్తాం.అందులో ముందు కోరేది ఆయుర్దాయాన్నే.
 

కోట్ల సంపద లభించినా అయుర్దాయం లేక మరుసటి రోజే మరణించే వానికి ఈ కోట్ల సంపద వలన ప్రయోజనమేమిటి ? అందువలనే మొదట కోరదగినది ఆయుర్దాయం.
 
నిజమే. ఆయుర్దాయమనేది కోరుకొంటే వచ్చేదా ? అనేది ప్రశ్న.

“దీర్ఘాయుష్మాన్ భవ”*అని దీవించటం వల్ల ఆయుర్దాయం పెరుగుతుందా? ఆని సందేహం.

    ఆయుః కర్మ చ విత్తం చ విద్యా నిధన మేవ చ|
   పంచైతా న్యపి సృజ్యంతే గర్భస్థస్తైవ దేహినః||

అని చెప్పబడింది. అంటే  “ఆయుష్షు, వృత్తి, ధనం, విద్య, చావు అనేవి ఐదూ జీవి గర్భంలో ఉండగానే నిర్ణయింపబడుతూ ఉంటాయి” అని దాని అర్థం.

ఆయుర్దాయం, మరణం అనేవి ముందే నిర్ణయింపబడితే ఇంకా ఈ ఆశీస్సుల వల్ల కాని, మరే జాగ్రత్తల వల్ల కాని ప్రయోజనమేమిటని ప్రశ్న ?

“లలాట లిఖితా రేఖా పరిమార్ట్షుం న శక్యతే” నుదుట వ్రాసిపెట్టినది ఎవరూ తుడవలేరని, మార్చలేరని, జరిగి తీరుతుందని మరికొందరి మాట.
 
“ఏది నిజం” మనేది సామాన్యునకు వచ్చే ప్రశ్న. ఆయుష్షుకు వృద్ధి, క్షీణతలు ఉంటాయా ? ఉంటేనే దాని విషయంలో జాగ్రత్తలు తీసుకొనటం అవసరం తప్ప అదేమీ లేనప్పుడా యత్నమే వ్యర్థం కదా!


ఆయుర్వేదం అనే వైద్య విధానం పేరులోనే ఆయువు ఉన్నది. ఆయుర్వేదమనేది ఊసుపోక చెప్పిన సామాన్యపు మాట కాదు. వేదాలలో మొదటిదైన ఋగ్వేదానికి సంబంధించిన ఉపవేదమే ఆయుర్వేదం. అంటే ఆయువును గూర్చి తెలిసికొనదగిన విజ్ఞానం అది. అందువల్ల ఆయువునకు సంబంధించి వృద్ధి క్షయాలు కూడ పరిగణింపదగినవే అని తెలుస్తుంది.

      
లలాట లిఖితమైన ఆయుర్దాయాన్ని ఎవ్వరూ మార్చలేరనేది యదార్థమైనా మార్కండేయుడు, శంకరాచార్యుల వారు మొదలైన వారు దైవానుగ్రహం వలన ఆయుర్దాయాన్ని పెంచుకొనటం చూస్తాం. అంతే కాదు హనుమంతుడు, విభీషణుడు మొదలగు వారు చిరంజీవులుగా వరమందటమూ చూస్తాం. ఇంకా విశేషం ద్వాపర యుగంలో సాందీపనే గురువు యొక్క పుత్రుడు మరణించగా శ్రీకృష్ణుడు గురుదక్షిణగా బ్రతికించినట్లు, త్రేతాయుగంలో చనిపోయిన వానర వీరుడు గంధమాదనుని హనుమంతుడు బ్రతికించి తెచ్చినట్లు కూడ ఇతిహాసాల ద్వారా తెలుస్తోంది !

కాబట్టి దైవానుగ్రహం వలన కాని, అమోఘవచనులైన ఋష్యాదుల ఆశీర్వచనాల వల్ల కాని ఆయుర్దాయం పెంచుకొనటం సాధ్యమే అని తెలుస్తుంది.


కాబట్టే మన పూర్వజులు “ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం” అని సంకల్పంలో చెప్పుకొనటంలో అనౌచిత్యం లేదని, “శతమానం భవతి” అంటూ మహనీయుల ఆశీస్సులు పొందటం శ్రేయస్కరమే అని తెలుస్తుంది.


అందుకే అట్టి ఆశీర్వచనాల కోసం పెద్దల యెడ వినయ విధేయతలతో ఉండాలి. చదువొక్కటే కాదు సంస్కారం కూడా ఖచ్చితంగా అలవర్చుకోవాలి. సంస్కారం లేని ఎంతగొప్ప చదువైనా అది సామాజిక శ్రేయస్సుకు, వ్యక్తి శ్రేయస్సుకు ఉపకరించదు !!