గర్భిణీ ధర్మములు : గర్భిణి యైన స్త్రీ యేనుగు, గుఱ్ఱము, బండి మొదలగునవి యెక్కి వెళ్లగూడదు. పర్వతము, మేడ మున్నగు ఉన్నత ప్రదేశములు ఎక్కరాదు. ఎక్కువ పని చేయుట, పరిగెత్తుట చేయరాదు. మలిన వస్తువులయందు, రోకలి – రోలు మొదలగు పనిముట్లయందు కూర్చుండుట తగదు. జలములో మునుగుట, శూన్య గృహమందుగానీ – చెట్లక్రింద గానీ నిలుచుటయు పనికిరాదు. కలహించుట – ఒండ్లు విరుచుట, అతివేడి వస్తువులు – అతిశీతలములు – పులుసుగారునవి - అజీర్ణమును గలిగించునవి భుజించుట తగదు. సంధ్యలయందు తినరాదు. మైథునము, శోకము, పగలు నిద్రించుట, రాత్రి ఒంటరిగా మేల్కొని యుండుట, భస్మము-బొగ్గు-గోళ్లు మొదలగు వానిచే గీతలు గీయుట, ఎల్లప్పుడు శయనించుట, అమంగళ కరములైన మాటలు మాట్లాడుట, అధికముగ నవ్వుట ఇవి వర్జింపవలెను. కొప్పువిప్పుకొని యుండగూడదు. గబుక్కున జడుసుకొనుట, గొంతుక కూర్చొండుటయు కూడదు. గర్భరక్షణమునకై శుచిత్వము కలిగి మంచి మంత్రములుకల రక్షరేకులను, పుష్పమాలికలు, గంధము ధరించి ఉండవలెను. మంచి గృహమందు నివసించ వలెను. దానములు చేయవలెను. అత్తమామలను పూజించ వలెను. పసుపు, కుంకుమ, సింధూరము, కాటుక మొదలగు వానిచే అలంకరించుకొని దువ్వినకొప్పుతో తాంబూలము మంగళాభరణములు ధరించి ఉండవలెను. నాలుగు, ఆరు మరియు ఎనిమిది మాసములందు ప్రయాణము గూడదు. అందులో ఆరవ మాసము అస్సలు తగదు. – ధర్మసింధు
శ్లో|| ప్రవ్యక్త గర్భావనితా భవేన్మాస త్రయాత్పరం|
షణ్మాసా త్పరతః సూతిః నవమే రిష్ట వాసినీ||
భావం : మూడునెలల తరువాత స్త్రీకి గర్భము స్పష్టమౌతుంది. ఆరునెలల తరువాత ప్రసూతి. తొమ్మిదవ నెలలో సూతికా గృహవాసము.
సూతికా గృహము : పురుడు పోసుకోవడానికి ప్రత్యేక గృహంలోకి వెళ్లాలి. అక్కడే పురుడు పోసుకుని, అక్కడే శుద్ధి అగువరకు ఉంటారు.
గర్గుడిట్లా చెప్పాడు. రోహిణి, మృగశిర, రేవతి, స్వాతి, శతభిషం, పునర్వసు, పుష్యమి, హస్త, ధనిష్ఠ, ఉత్తర, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, అనూరాథ, చిత్త, అశ్విని వీటియందు స్త్రీ సూతికా గృహాన్ని ప్రవేశించాలి.
వశిష్ఠుడు : ఒకవేళ ప్రసవం వస్తున్నట్లైతే (పై తారలతో పనిలేకుండా) వెంటనే సూతికా గృహంలో ప్రవేశించాలి.
ఈ సూతికా గృహము నిర్ ఋతి దిశలో ఉండాలి. ఆయుధాలు, అగ్ని, తుమ్మికి కర్రలు, పూర్ణకుంభములు, దీపములు, రోకలి, పలుచని రంగులతో అలంకరించినదై ఉండాలి. - నిర్ణయసింధు
-సేకరణ
No comments:
Post a Comment