ఆత్మస్థైర్యం (బాలల సరదా నీతి కథ)
ఒక ఊరిలో ఒక రాజకుమారుడికి వివాహం చేయడానికి ఆయన తల్లి దండ్రులు పక్క ఊరి రాజు కూతుర్ని చూడటానికి వెళ్ళారు. రాజు ఆమెతో “ఆపద సమయాలలో నిన్ను ఎవరు కాపాడతారు"? అని ఒక ప్రశ్న వేశాడు.
ఆమె “నన్ను నా తల్లితండ్రులు కాపాడతారు" అని చెప్పింది. ఆ సమాధానం రాజుకి నచ్చలేదు. దాంతో వాళ్ళు మరొక వూరికి వెళ్ళారు.
అక్కడి రాజు కూతుర్ని కూడా “నిన్ను ఆపదలో ఎవరు కాపాడతారు" అని అదే ప్రశ్న వేశాడు. ఆమె నా అన్నదమ్ములు కాపాడుతారని చెప్పింది. ఆ సమాధానం కూడా రాజుకు నచ్చలేదు.
మరొక వూరికెళ్ళి ఆ రాజు కూతుర్ని కూడా ఇదే ప్రశ్న వేశాడు. ఆమె నా అక్కా చెల్లెలు కాపాడతారని చెప్పింది. రాజుకు ఆ సమాధానం కూడా నచ్చలేదు. దాంతో రాజు స్వయంవరం ప్రకటించాడు.
అనేకమంది రాకుమార్తెలు స్వయంవరానికి వచ్చారు. అందరికి భోజన సౌకర్యాలు సమకూర్చేందుకు ఒక ముసలి అవ్వను నియమించారు.
ఆ అవ్వకు ఒక మనుమరాలు వుంది. ఆమె కూడా అక్కడే ఉంది. సభలో రాజు ఈ ప్రశ్న వేయగానే అందరూ తలాఒక సమాధానం చెప్పారు.
రాజుకు ఏ సమాధానమూ నచ్చలేదు. అపుడు రాజుకు అక్కడ పనిచేస్తున్న అవ్వ మనుమరాలు కనబడింది. ఆమెని పిలిచి అదే ప్రశ్న వేశాడు.
దానికి ఆమె "ఆపద సమయంలో నేను ఒకరి సహాయం కోసం ఎదురు చూడను. నన్ను నేనే కాపాడుకొంటాను" అని సమాధానం ఇచ్చింది.
ఆ మాటలు విన్న రాజు ఇంతకాలానికి నా ప్రశ్నకు సరియైన సమాధానం వచ్చిందని ప్రకటించి అవ్వ మనుమరాల్ని తన కుమారునికి ఇచ్చి వివాహం జరిపించాడు.
-సేకరణ
No comments:
Post a Comment