మన తొలి పండుగ – ఉగాది
సమూహం లోని సభ్యులందరికీ “ప్లవ” నామ సంవత్సర శుభాకాంక్షలు.ఉగాది మన తొలి పండుగ.తెలుగు వారి కొత్త సంవత్సరం.ఉగాది పండుగ చైత్ర మాసం , శుక్లపక్షం లో పాడ్యమి రోజు జరుపుకుంటాము.చైత్ర మాసం తెలగు మాసాలలో మొదటిది, అలాగే ఇది వసంత ఋతువు.ఈ రోజు ప్రకృతి లో వున్న అందాలన్నీకొత్త చిగుర్లు తొడిగే వేళ . ఈ పండుగ విశేషాలు ఓసారి చూద్దాం..
తెలుగు సంవత్సరాలు మొత్తం అరవై(60).ప్రభవ నామ సంవత్సరం మొదటిది. క్షయ నామ సంవత్సరం చివరిది.రాబోయే రెండు రోజుల్లో మనం "ప్లవ" నామ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాము.ఈ మొత్తం 60 సంవత్సరాలలో మనిషి తన జీవిత కాలం మొత్తం మీద రెండు కన్నాఎక్కువ సార్లు ఒకే సంవత్సరాన్నిచూడలేడు.అందుకే తను జన్మించిన సంవత్సరం మళ్ళి చూసిన నాడు అంటే తన అరవయ్యో ఏట(60 పుట్టినరోజు) తనకి అంత ఆయుష్షు ఇచ్చినందుకు గాను “షష్టిపూర్తి మహోత్సవం “జరుపుకుంటాడు.
ఉగాది ప్రాశస్త్యం:
సోమకుడనే రాక్షసుడు వేదాలను దొంగిలిస్తాడు.అప్పుడు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ధరించి సోమకుని సంహరించి వేదాలను బ్రహ్మ కి అప్పగిస్తాడు. బ్రహ్మఅప్పుడు సృష్టి, స్థితి, లయ అనే మూడు పనులలో మొదటిదైన సృష్టి కార్యాన్నిఈ నాడే అంటే చైత్ర శుద్ధ పాడ్యమి నాడు మొదలుపెట్టాడని మన పురాణాలు చెపుతున్నాయి …యుగానికి ఆది అంటే యుగానికి మొదటి రోజు కావున అది యుగాది గా మనం ఈనాడు జరుపుకుంటున్నాము.
ఉగాది రోజు:
ఉగాది రోజు ఇష్ట దైవాలను పూజించి పెద్దలకు,పిన్నలకు కొత్త బట్టలు ఇవ్వడం ఆనవాయితీ. అలాగే ఉగాది పండుగ రోజు మాత్రమే చేసుకునే ఉగాది పచ్చడి వెనుక కూడా ఎంతో అర్ధంవుంది. జీవితంలో ఎదురయ్యే సుఖ దుఖాలు, ఆశ్చర్యానందాల కి ప్రతి రూపంగా ఆరు రుచుల సమ్మేళనంతో చేసే ఈ పచ్చడిని ఈ రోజు ప్రతి ఒక్కరు తప్పకుండా సేవించాలి.
ఈ పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్ధం మన జీవితంలో ని ఒక్కొక భావానికి, అనుభవానికి ప్రతీక
బెల్లం – తీపి – ఆనందానికి సంకేతం
ఉప్పు – జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం
వేప పువ్వు – చేదు -బాధకలిగించే అనుభవాలు
చింతపండు – పులుపు – నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు
పచ్చి మామిడి ముక్కలు – పులుపు – కొత్త సవాళ్లు
మిరపపొడి – కారం – సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులు
శాస్త్రీయకారణం:ఇంతే కాక ప్రకృతి అప్పుడే చలికాలం నుండిఎండాకాలం లోకి మారుతుంది కాబట్టి వాతావరణం మార్పులకి కఫ దోషాలు ఇతర ఆరోగ్య సమస్యలు రాకుండా ఈ పచ్చడి ఎంతో ఉపయోగపడుతుంది.ఉగాది రోజు నుంచి శ్రీ రామ నవమిరోజు వరకు ఈ పచ్చడి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని పెద్దలు చెపుతున్నారు.
పంచాంగ శ్రవణం:
ఈ రోజు పంచాంగ శ్రవణం వినడం ఆనవాయితీ.ఆ సంవత్సరికి గాను తమ పేరున ఆదాయ లాభాలు,
ఖర్చులూ, తమ కుటుంబ స్థితిగతుల మీద ఒక అవగాహన తెచ్చుకుంటారు.పంచాంగం అంటే ఐదు అంగాలు అని అర్ధం.
తిధి,వారం,నక్షత్రం,యోగము,కరణము అనే ఐదు అంగాలతో కూడుకున్నది కాబట్టి అది పంచాంగం అని అంటారు.మనకి మొత్తం 15తిథులు,7 వారాలు,27 నక్షత్రాలూ,27 కరణములు,11 యోగములు వున్నాయి.ప్రతి మనషి యొక్క జన్మ నక్షత్రాన్నిబట్టి అతనికి ఆ సంవత్సరం ఎలా వుందో ,ఏ కార్యక్రమాలు చెయ్యవచ్చో పంచాంగం తెలియచేస్తుంది.మనం ఇంగ్లీష్ క్యాలెండర్ వాడుతున్నప్పటికి.. శుభకార్యాలకి మాత్రం పంచాంగం ప్రకారమే ముహూర్తాలు పెట్టుకుంటాం.
ఇంతే కాకుండా ఈనాడు పండితులూ,కవులూ సాహిత్య సమావేశాల్లో పాల్గుని కవితాగోష్టి నిర్వహిస్తారు కూడా.
ఇన్నివిశేషాలు కలిగిన మన తెలుగు వారి మొదటి పండుగని మీరంతా మీ కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకొని ఆనందిస్తారని…ఈ ప్లవ నామ సంవత్సరం మీకు అన్నింటిలో విజయాలు కలిగించాలని కోరుకుంటూ మిత్రులు అందరికీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు…
No comments:
Post a Comment