Adsense

Monday, April 12, 2021

అరుణాచల గిరి ప్రదక్షిణమార్గం

🕉️⚜️🚩 ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః 🙏
⚜️🚩 'అరుణాచల గిరి ప్రదక్షిణమార్గం' 
           పుణ్య చరిత్ర🙏 (సేకరణ)

⚜️🚩  ఒకప్పుడు పరమేశ్వరుని అంశతో జన్మించిన "దూర్వాస మహాముని" నిత్యమూ పరమశివుని అర్చించే నిమిత్తం ఒక అందమైన పూలవనం పెంచి, చేరువలో కుటీరం నిర్మించుకుని శివధ్యానంలో కాలం గడుపుతుండేవాడు. 
♦️ఇలావుండగా ఒకనాడు 'కళాధరుడు', 'కాంతిశాలి' అనే యిరువురు గంధర్వులు ఆకాశమార్గాన దేవవిమానంలో వెళుతూ, ఆ పూలవనం చూసి, అబ్బురపడి మనసు నిలవక కిందకిదిగి అందులో ప్రవేశించారు. 
♦️కళాధరుడు యిచ్ఛవచ్చినట్లు పూలను తుంచి వాసన చూస్తూండగా, కాంతిశాలి ఒళ్ళుమరచి పూలమొక్కల్ని తొక్కుతూ వనమంతా తిరగసాగాడు. 
♦️అలికిడికి కుటీరము నుంచి బయటకువచ్చిన దూర్వాసుడు జరుగుతున్నది చూసి కోపంపట్టలేక వారిని జంతువులుగా భూమిపై పుట్టమని శాపంపెట్టాడు. 
♦️తెలియక జరిగిన తప్పిదమనీ, శాపవిమోచన మీయమనీ గంధర్వులు చేసిన అభ్యర్ధనలకు శాంతించిన దూర్వాసుడు, 'అరుణగిరి' ప్రదక్షిణంతో తిరిగి స్వస్వరూపాలు పొందగలరని విమోచనమార్గం అనుగ్రహించాడు

♦️ఫలితంగా ఒకరు అరుణగిరిని ఆవరించిన అడవులలో అందమైన పునుగుపిల్లి (కస్తూరిమృగం) గాను, 
♦️మరొకరు పాండ్యదేశపు రాజధాని మదురై పట్టణంలో చక్కనైన గుర్రంగాను జన్మించారు.   
♦️ఆ దేశపు రాజైన వజ్రాంగదపాండ్యుడు ఆగుర్రపు లక్షణాలకు ముచ్చటపడి దానిని తన రాజాశ్వంగా ఎంచుకున్నాడు.
♦️ రాజైనవాడు వినోదంకోసం, అప్రమత్తత పెంచుకోవడంకోసం ఒంటరిగా అడవులకు వెళ్ళడం రివాజు. 
♦️అలా ఒకనాడు వజ్రాంగదుడు మదురై పట్టణానికి చాలా దూరంగా దట్టంగా కమ్మిన అరుణగిరి అరణ్యాలలోకి తన రాజ అశ్వాన్ని అధిరోహించి వేటకు వెళ్ళాడు.

⚜️🚩అప్పటికి 'అరుణగిరి' నానావిధ వృక్ష జాతులతో కప్పబడి వన్య ప్రాణులకు తప్ప మానవుల దృష్టికి మరుగైవుండేది. 
♦️అలాంటి ప్రాంతంలో ధీరుడైన వజ్రాంగదుడు వేడుక తీర్చుకోవడానికై అడవిమృగాలకోసం  వెదకసాగాడు. 
♦️ఎప్పటికో మధ్యాహ్నం దాటిపోయి, వేసారి వెనుదిరుగుదామనుకున్నంతలో ఒకపొద కదలికల వెనక మిలమిలమెరిసే కళ్ళతోదాగిన పునుగుపిల్లి అతని కంటబడింది. 
♦️దానిని ప్రాణాలతో పట్టుకోవాలని ఆశించి, రాజు వల విసిరే వ్యవధిలోనే అపాయాన్ని కనిపెట్టిన ఆపిల్లి, నేర్పుగా తప్పించుకుని కనిపించి కనుమరుగౌతూ గిరిని చుట్టుముట్టి పరుగిడ సాగింది. ♦️పట్టువదలని రాజు అశ్వంపై దానిని వెంబడించగా, ప్రదక్షిణం పూర్తికావడంతో శాప విమోచనమై అది తూలిపడి తన శరీరాన్ని విడిచింది. 
⚜️🚩విభ్రాంతుడై రాజు అశ్వంపైనించి దిగడంతో అతని గుర్రంకూడా నిలువునా కూలబడి ప్రాణం వదిలింది. 
♦️మరుక్షణంలో వాటి శరీరాల్లోంచి వెలుగులీనుతూ యిరువురు గంధర్వులు బయటకురాగా అదేక్షణంలో రత్నాలు పొదిగిన దేవవిమానం వారిని తీసుకుపోయే నిమిత్తం ఆకాశం నించి వచ్చి ఆగింది.

⚜️🚩ఇదంతా ఆశ్చర్యంగా చూస్తున్న రాజు ఆ దివ్య పురుషులను ఆపి, "సంగతేమిటో వివరించి సందేహ నివృత్తి చేయవలసింద"ని ప్రార్ధించగా 
♦️వారు తమ శాపవృత్తాంతం అంతా చెప్పి, "రాజా! ఈ కనిపిస్తున్న గిరి ఎంతో మహిమాన్వితమైనది. ♦️సాక్షాత్తూ ఆదిదేవుడైన పరమేశ్వరుడే ఈ గిరి రూపంగా వెలసివున్నాడు. భక్తితోతప్ప దీని రహస్యాన్ని తెలుసుకోవడం సాధ్యంకాదు.
⚜️🚩 బ్రహ్మాది దేవతలుసైతం రోజూ ఉదయానే చప్పుడు చేయకుండా వచ్చి దీనిని పూజించి వెళ్తుంటారు. 
♦️అటువంటి గిరిని ప్రదక్షిణంచేసే భాగ్యం మాకు నీ కారణంగా కలిగి శాపవిమోచనమైంది" అని అన్నారు. ♦️వెంటనే రాజు అంజలి ఘటించి "మహాత్మ్యమైన ఈ గిరిని మీతోపాటే ప్రదక్షిణంచేసిన నాకు ఏఫలితమూ కలగని కారణమేమిటి? తెలుపవలసింది" అని వినయంగా అర్దించగా
⚜️🚩 "రాజా! ఈ గిరిప్రదక్షిణాన్ని వాహనంతోగాని, పాదరక్షలతోగాని చేయరాదు. 
♦️నీవు అశ్వంపై ఉండిపోయావు. 
అలాకాక దీనిని మనసులో స్మరిస్తూ సవ్యదిశలో కాలినడకన ప్రదక్షిణం చేసినట్లయితే వారు ఏది కోరితే అది, చివరికి ఇంద్రపదవినయినా పొందగలరు" అని వివరించి, 
♦️గంధర్వులు సెలవుతీసుకొని విమానం అధిరోహించి తమలోకాలకు వెళ్ళిపోయారు..........
♦️ఈ ఘటన బలంగా నాటుకున్న వజ్రాంగదుడు, ఇంద్ర పదవిని కోరుకుని సకల భోగాలను సౌఖ్యాలను తిరస్కరించి, రాజ్యాన్ని తరువాతివారికి ఒప్పజెప్పి, రోజుకు మూడుసార్లు చొప్పున మూడు సంవత్సరాలపాటు తదేక దీక్షతో గిరికి ప్రదక్షిణాలు చేయగా ఒక ముహూర్తాన...
⚜️🚩అరుణగిరినాధుడు ప్రత్యక్షమై ఏంవరం కావాలో కోరుకొమ్మని అడిగాడు. 
♦️అప్పటికి ఎన్నోరోజులుగా ఆ జ్ఞానతేజస్సును ప్రదక్షిణాలతో ఆరాధిస్తూ వుండడంవల్ల పక్వచిత్తుడైన రాజుకు ఆశలూ భయాలూ ఎండుమట్టల్లా రాలిపోయి, 
♦️ఇంద్రపదవి కూడా గడ్డిపరకలా తోచి, తనకి అహంకార రహిత శాశ్వత సాయుజ్య మీయవలసిందని వేడి అరుణగిరిలో లీనమైపోయారు.
⚜️🚩 నేడు 'అరుణాచల'మని పేరుబడ్డ అరుణగిరి పుణ్యక్షేత్రం తమిళనాడుకు చెందిన తిరువణ్ణామలైలో వుంది. 
♦️కోరికలీడేర్చే ఈ గిరిని దేశ విదేశీయులెందరో అగ్నిలింగంగా భావించి ప్రదక్షిణం చేస్తారు. 
♦️నేటి ఈ ప్రదక్షిణమార్గపు మొత్తం చుట్టుకొలత 8 మైళ్ళు (సుమారు 14 కి.మీ.). 
♦️అలనాడు పాండ్యరాజు వజ్రాంగదుడు మూడు సంవత్సరాలపాటు ప్రదక్షిణంగా నడవగా ఏర్పడిన మార్గమిది. 
♦️ఈదారిలో ఇప్పుడు మనకు కనిపించే దేవాలయాలు, కొలనులు, విశ్రాంతి మంటపాలు మొదలైనవాటిలో కొన్ని ఆ కాలంలో అతను నిర్మించినవే,వీటిలో దూర్వాస మహాముని ఆలయము కూడా మనకు కనిపిస్తుంది.
⚜️🚩♦️ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమోనమః♦️
                     ♦️🌼♦️🌼♦️🌼♦️

No comments: