కోవిడ్ మహమ్మారి రెండోదశలో కోవిడ్-19 వ్యాప్తి నియంత్రణకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ పరిధిలోని ‘‘భాక్రా బియాస్ మేనేజ్‌మెంట్ బోర్డ్’’ (బీబీఎంబీ) ముందుకొచ్చింది. ఈ మేరకు వైరస్‌పై యుద్ధం దిశగా అనేక చర్యలు చేపట్టడంసహా నంగల్ శివారు పట్టణంలోని ‘బీబీఎంబీ’ ఆస్పత్రిలో ప్రత్యేక ‘కోవిడ్ ఏకాంత చికిత్స కేంద్రం’ కూడా ఏర్పాటు చేసింది. ఇక్కడ కోవిడ్-19 పీడిత రోగులకు చికిత్స అందించడంద్వారా సమాజ సేవా కర్తవ్య నిర్వహణకు సిద్ధమైంది. ఈ ప్రత్యేక ‘కోవిడ్ ఏకాంత చికిత్స కేంద్రం’లో మొత్తం 65 పడకలతోపాటు ఆక్సిజన్ సౌకర్యం కూడా కల్పించింది. ప్రస్తుత సంక్లిష్ట దశలో ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు, కాంట్రాక్టు కార్మికులుసహా స్థానిక సమాజ సభ్యులకు ఈ ఆస్పత్రి అద్భుతమైన ఆరోగ్య సేవలు అందిస్తోంది.
కరోనా సోకినవారు రోగ లక్షణాలను తగ్గించుకునేలా గృహ ఏకాంతవాసం పాటించేలా వారికి మార్గదర్శనం చేయడం కోసం స్థానిక పాలన యంత్రాంగం ‘సహాయ బృందా’లను ఏర్పాటు చేసింది. ఈ బృందాల్లోని సభ్యులు ఒక డాక్టరు నేతృత్వంలో పనిచేస్తూ- ప్రారంభ దశలో సలహాలు, వ్యాధిసోకినవారికి మార్గనిర్దేశం చేస్తున్నారు. ఈ ప్రత్యేక ‘కోవిడ్ ఏకాంత గృహవాస’ సహాయ బృందాలు వైద్య ఉపకరణాలు, గృహనిర్బంధ చికిత్స పొందుతున్న రోగులకు వైద్య పరికరాలు, చికిత్స సరంజామా అందిస్తున్నాయి. ఈ మేరకు వారితో నిత్య సంబంధాలు నెరపుతూ ఇతరత్రా సహాయ సహకారాలు కూడా అందిస్తున్నాయి.
మరోవైపు ‘బీబీఎంబీ’ ఆస్పత్రి స్థానిక నివాసులకు ఉచితంగా ‘ఆర్టీ-పీసీఆర్’ రోగ నిర్ధారణ పరీక్ష సదుపాయం కూడా కల్పిస్తున్నారు. అలాగే, ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు, కాంట్రాక్టు కార్మికులకే కాకుండా సాధారణ ప్రజలందరికీ టీకాలు వేసే కార్యక్రమం కూడా నిర్వహిస్తోంది. ఈ మేరకు రోజుకు సగటున 200 మందికి టీకాలు వేస్తోంది. దురదృష్టవశాత్తూ ఎవరైనా మరణిస్తే, కోవిడ్ విధివిధానాలకు, సంప్రదాయాలకు అనుగుణంగా అంత్యక్రియల నిర్వహణ కోసం నంగల్ ఆస్పత్రి సిబ్బంది వారి కుటుంబాలకు సహాయం అందిస్తున్నారు. మొత్తంమీద ప్రస్తుత సంక్షోభ సమయంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ప్రాంతంలో వైద్యపరంగా సహాయం అందించడంలో బీబీఎంబీ ముందుండి నాయకత్వం వహిస్తోంది.
Release Id :-1718938
No comments:
Post a Comment