Adsense

Thursday, May 20, 2021

గంగ... కేవలం ఒక నది కాదు !!! About River Ganga

గంగ... కేవలం ఒక నది కాదు !!!

వైశాఖంలో శుద్ధ సప్తమి అనేక విశేషాల సమాహారంగా కనిపిస్తుంది. ఈ సప్తమిని 'గంగా సప్తమి' అనీ .. 'నింబసప్తమి' అనీ .. 'కమలాసప్తమి' అని అంటారు. 

భగీరథుని ప్రయత్నం కారణంగా భూమి మీదకి వచ్చిన గంగ, ఉత్సాహంతో పరుగులు తీస్తూ జహ్నుమహర్షి ఆగ్రహానికి గురవుతుంది. గంగను మింగిన ఆయన, భగీరథుని ప్రార్ధనకి శాంతించి తిరిగి తన చెవినుంచి వదులుతాడు. అలా గంగాదేవి జన్మించిన రోజు గంగాసప్తమిగా చెప్పబడుతోంది.

 ఈ రోజున ఆ తల్లిని ఆరాధించడం వలన విశేషమైన ఫలితాలు లభిస్తాయి.

ఇక ఈ రోజున  ఆరోగ్యాన్ని ప్రసాదించమంటూ  వేపచేట్టును పూజించే సప్తమి కనుక దీనిని నింబ సప్తమిగా పిలుస్తుంటారు. 

భగీరథ ప్రయత్నం వల్ల వచ్చింది కాబట్టి భగీరథి అయ్యింది.

 జహ్ను పొట్టలోంచి పుట్టి జాహ్నవిగా పరిచయమైంది. నింగి, నేల, పాతాళం-మూడులోకాలు. తూర్పు, పడమర, దక్షిణం-మూడు దిక్కులు. ముచ్చటగా మూడువైపులా పారి, 'త్రిపథగ' అన్న పేరునూ సార్థకం చేసుకుంది. 

ఆ ప్రవాహం పుణ్యమాని సగరులు ముక్తులయ్యారు. భూమి మురిసిపోయింది. దేవతలు పులకించారు. మానవులు పరవశించారు. జలచరాలు జయజయధ్వానాలు చేశాయి. పచ్చని పంటలు ప్రాణం పోసుకున్నాయి. భూమి స్వర్గమైంది. 

మహాభారతంలో... అంపశయ్య మీది నుంచే భీష్ముడు గంగా మహత్తును వివరిస్తాడు. 

ఒక్క గంగాస్నానంతో... యజ్ఞయాగాదులు చేసినంత పుణ్యం, పూజలూ వ్రతాలూ చేసినంత ఆధ్యాత్మిక సంపత్తి.

 గంగ తగిలితే చాలు... అటు ఏడు తరాలూ ఇటు ఏడు తరాలూ పవిత్రమైపోతాయట.

 గంగ లేని దేశం... సోమం లేని యజ్ఞమట! చంద్రుడు లేని రాత్రిలాంటిదట. పూలు పూయని చెట్టులాంటిదట.

 'ఇన్ని మాటలెందుకు కానీ, గంగ గొప్పదనం చెబుతూ పోతే, సముద్రంలో నీటి కణాల్ని లెక్కపెట్టినట్టే ఉంటుంది' అంటాడు భీష్మపితామహుడు! 

గంగ మహత్యానికి కొన్ని శాస్త్రీయమైన కారణాలూ ఉన్నాయి

. ఆ నీటికి కఫాన్ని తగ్గించే గుణం ఉంది. అందుకే, తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నవారి గొంతులో చిటికెడు గంగ పోస్తారు.

గంగానదిలోని కొన్నిరకాల సూక్ష్మక్రిములకు వివిధ వ్యాధుల దుష్ప్రభావాన్ని తగ్గించే గుణం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి.

 అన్నిటికీ మించి, గంగ మీదున్న నమ్మకం, అచంచలమైన భక్తి..ఆ నీటికి అంత మహత్తునిచ్చింది.

పరిస్థితులను బట్టి సర్దుకుపోవడం ఎలాగో గంగను చూసే నేర్చుకోవాలి.

 ఉద్ధృత గంగా ప్రవాహం... అవసరాన్ని బట్టి అక్కడక్కడా మందగిస్తుంది. పరిస్థితులకు తలవొగ్గి, నిశ్శబ్దంగా ముందుకెళ్తుంది. నదీప్రవాహంలోనే కాదు, జీవన ప్రవాహంలోనూ పట్టువిడుపులుండాలన్న గొప్పపాఠమది. 

గంగ స్నేహానికి ప్రాణమిస్తుంది. ఎలాంటి ప్రాశస్త్యమూ లేని మామూలు వాగుల్నీ వంకల్నీ చిన్నాచితకా నదుల్నీ ప్రేమగా తనలో కలిపేసుకుంది. వాటికి పవిత్రతను కల్పించింది.

సజ్జన సాంగత్యంలోని గొప్పతనమే అది. 

రోజుకు పాతిక లక్షల మంది గంగలో మునుగుతారు. రోజుకు కోటిమంది పూజలోనో, వ్రతంలోనో, యజ్ఞంలోనో, పితృకార్యంలోనో గంగను తలుచుకుంటారు. 'గంగ పుట్టింది వెుదలు సముద్రంలో కలిసేదాకా... ప్రతి అడుగూ భారతీయులకు పవిత్రమే. 

ఆ ఒడ్డున ఎన్ని నాగరికతలు పుట్టాయి! ఎన్ని సామ్రాజ్యాలు వెలిశాయి! ఎన్నెన్ని మట్టి కొట్టుకుపోయాయి! మానవ వికాస చరిత్రకు గంగా ప్రవాహమే సాక్ష్యం'.

 *ఓం నమో నారాయణాయ🙏*

No comments: