Adsense

Thursday, May 20, 2021

''మడి" ఆచారం గురించి, "మడి" ఎలా కట్టుకోవాలి..

"మడి" ఆచారం గురించి, "మడి" ఎలా కట్టుకోవాలి..
 మన హిందూసాంప్రదాయంలో మాత్రమే ఉన్న ఒక పరమపవిత్ర ఆచారం మడి కట్టుకోవటం. అదేంటో తెలీక అదొక ఛాందసాచారమని ఆడి పోసుకునేవారూ మనలో లేకపోలేదు. కానీ అదొక ఆరోగ్యవంతమైన, శుచి శుభ్రతలకు సంబంధించిన ఆచారమేకాని, చాదస్తం ఎంతమాత్రంకాదు. మన ఆచారాలు మనం పాటించాలి, వాటిని వదిలేయద్దు. మన ఆచారాలను వదిలిచేసే ఏ ఆరాధనలు మనకు ఫలించవు.

 "ఆచార హీనం నపునంతి వేదాః" అని ఆర్షవాక్యం. "ఆచారహీనున్ని వేదాలుకూడా పవిత్రున్ని చేయలేవు" అని అర్థం. అందుకే అందరం సనాతన సాంప్రదాయాలను పాటిద్దాం.
 
 "మడి కట్టుకోవటం" అంటే ఏమిటి ? 
 
మడి అంటే శారీరక శౌచము. (ధర్మ దేవతకు సత్యము, శౌచము, తపస్సు, దయ అనేవి నాలుగు పాదాలు) శౌచము లేక శుభ్రత అనేది శారీరకం, మానసికం అని 2 విదాలు. శారీరక శౌచం లేకుండా గృహస్థునకు మానసిక శౌచం కల్గదు. సర్వసంగ పరిత్యాగులకు మాత్రం యిది వర్తించదు. కనుక నిత్య జీవనంలో మానసికంగా శౌచం కలగాలంటే ముందు అన్ని వర్ణాలవారూ ఈ మడిని పాటించితీరాలి. నేడు అనేకమందికి అసలు మడి ఎలా కట్టుకోవాలన్నదే తెలీదు.

 మడి ఎలా కట్టుకోవాలి ? రేపు మడికి కట్టుకోవాలనుకున్న పంచ లేక చీరలను ఈరోజు ఉదయంపూటే ఆరవేయాలి. లేదా ఏరోజుకారోజు ఆరేస్తే ఉత్తమం. ఉతికి జాడించి, తర్వాత  స్నానం చేసి, తడిబట్టతో బావి లేక మోటరు నీటితో మళ్లీ తడిపి, పిండి దండెంమీద ఇంటిలోగానీ లేక ఆరు బయటగానీ ఎవరూ తాకకుండా ఆరవేయాలి. 
(ఒకవేళ చిన్నపిల్లలు, తెలీనివారు ఆ గదిలోకి వచ్చినా ఎవరూ ముట్టుకోకుండా ఉండటానికి ఇప్పటికీ కొన్ని ఇళ్లలోపల అందనంత ఎత్తులో ఓ గోడకు దండెమువంటి కఱ్ఱలు వ్రేలాడుతూ ఉంటాయి. వాటిపై కఱ్ఱతో ఈ బట్టలు ఆరవేస్తారు)

మర్నాడు ఉదయాన్నే మళ్లీ స్నానంచేసి తడిగుడ్డతోవచ్చి ఆరిన మడిబట్టలను తెచ్చుకొని గోచీపోసి కట్టుకోవాలి. మడికట్టుకొన్న తర్వాత ఇక ఎలాంటి మైలవస్తువులను తాకకూడదు. తాకితే మళ్లీ స్నానంచేసి మళ్లీ వేరే మడిబట్ట కట్టుకొని వంట లేక పూజ చేయాలి. మడితోనే సంధ్యావందనం, నిత్యానుష్ఠానాలు, పూజ మొదలైనవిచేసి దేవునికి  నైవేద్యముపెట్టి, ఆ మడితోనే భోజనంచేయాలి. ఆ తర్వాత మడివదలి మైలతాకుతారు. (ఇది ఉత్తమ మైన మడి పద్ధతి)

 శ్రాద్ధాదిక్రతువులకు తడిబట్టతోనే వంట చ
చేయాలి. చనిపోయినప్పుడుచేసే కర్మకాండలు తడి బట్టతోమాత్రమే చేయాలి. కానీ పూజాదికాలకు తడిపి ఆరేసిన బట్టమాత్రమే మడి. నీళ్లోడుతున్న తడిబట్ట పనికిరాదు. మడిబట్ట లేనప్పుడు పట్టు బట్టను కట్టుకొని వంటవండి, నైవేద్యం అయిన తర్వాత మళ్లీ జాగ్రత్తగా ఎవ్వరూ తాకకుండా పట్టుబట్టవిడిచి జాగ్రత్తగాపెట్టుకొని, పక్కరోజు వాడుకోవచ్చు. అయితే పట్టుబట్టలను ప్రతి అమావాస్యకు తడిపి ఆరవేయాలి. లేకపోతే పట్టుగుడ్డలు మడికి పనికిరావు. పట్టుబట్టలో కొంత దోషముంటుంది, అదే జీవహింస, కావున కొంతమంది దానిని కట్టుకోరు. కావున శ్రేష్టము నూలుగుడ్డ. అది కుదరనిచో (స్వచ్ఛమైన) పట్టువస్త్రము.

మగవాళ్ళు పంచను లుంగీలాగా కట్టుకొని గానీ, ఆడవాళ్ళు చీరను పావడాతోగాని కట్టుకొని దైవకార్యాలు చేయకూడదు. కారణం, జననేంద్రియాలు ఆచ్ఛాదనలేకుండా వుండకూడదు. కావున మగవాళ్ళుగానీ, ఆడవాళ్ళుగానీ గోచీపోసి మాత్రమే పంచ లేక చీర కట్టుకోవాలి. పంచ లేక చీరమాత్రమే ఎందుకు కట్టుకోవాలి అంటే ఏక వస్త్రంతో కూడిన దాన్నిమాత్రమే ధరించాలి. కత్తిరించినవి, ముక్కలుచేసి కలిపికుట్టినవి వైదిక క్రతువులకు పనికరావు. మడితో పచ్చళ్ళు, వడియాలు, పాలు, పెరుగు, నెయ్యి చేయడమనేది పూర్వపుఆచారం. ఇవన్నీ చాలావరకు నేడు పోయాయి. కానీ నేటితరం యువతీ యువకులలో పరమేశ్వరుని అనుగ్రహంచేత కొద్దికొద్దిగా మన సనాతన సాంప్రదాయ పద్ధతులపై ఆసక్తి పెరుగుతున్నది. 

ఆసక్తికలిగినవారు క్రమక్రమంగా మార్పుకు సిద్ధపడాలి. మరలా ఆచరణలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. మనం ఆచరించి, అందరికీ చూపించి ఆదర్శమవ్వాలి. మనల్ని మనం కాపాడుకోవాలి. ఒక్కసారి మడి కట్టి చూడండి. దానిలోని ఆనందం, స్వచ్ఛత, పరిశుభ్రత, దైవత్వం అనుభవంలోకి వస్తాయి. నేటికీ కొంతమంది ఎంత కష్టమొచ్చినా మడిలేని ఇంట భుజించరు. బయటి వస్తువులు స్వీకరించరు. ఆదర్శంగా నిలుస్తున్న అటువంటివారికి శిరస్సువంచి పాదాభివందనం ...

No comments: