Posted Date:- May 21, 2021

తౌక్టే తుఫాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాల్లో వీలైనంత ఎక్కువగా సహాయాన్ని అందించడానికి విద్యుత్ మంత్రిత్వ శాఖ (కార్యదర్శి, విద్యుత్) రాష్ట్ర విద్యుత్ వినియోగాలు, పీజీసీఐఎల్, ఆర్ఈసీ, పోస్కోలతో క్రమం తప్పకుండా సమీక్ష సమావేశాల‌ను నిర్వహిస్తోంది.


తౌక్టే తుఫాను కారణంగా అత్య‌ధిక‌ ప్రభావిత ప్రాంతాలుగా ఉన్న గుజరాత్ మరియు కేంద్ర పాలిత ప్రాంతమైన డ‌య్యూల‌లో విద్యుత్ పునరుద్ధరణ పనులను వేగవంతం చేసే ఉద్దేశ్యంతో విద్యుత్ శాఖ కార్యదర్శి గురువారం ఒక‌ ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వ‌హించారు. ఈ సమావేశంలో పాల్గొన్న‌వారిలో పీజీసీఐఎల్ సంస్థ సీఎండీ, ఏసీఎస్ ఎనర్జీ గుజరాత్, ఐఈఈఎంఏ అధ్యక్షులు త‌దిత‌రులున్నారు. పది 220 కేవీ టవర్లను భర్తీ చేయగల సామ‌ర్థ్యం క‌లిగిన‌ ఈఆర్ఎస్‌-ఎమర్జెన్సీ రిస్టోరేషన్ సిస్టమ్‌తో మొత్తం 150 మందికి పైగా అనుభవజ్ఞులైన మానవ శక్తితో కూడిన.. ఒక బృందం గుజరాత్‌కు చేరుకున్నట్లుగా పీజీసీఐఎల్ తెలియజేసింది. ఈ బృందం కేంద్ర పాలిత ప్రాంతం డ‌య్యూకు విద్యుత్ సరఫరాను అందించే 220 కేవీ విద్యుత్ లైన్‌ను పునరుద్ధరించే పనిని ప్రారంభించిన‌ట్టుగా పీజీసీఐఎల్ తెలిపింది. 66 కేవీ వ్యవస్థ యొక్క పునరుద్ధరణ పనుల కోసం సంప్రదించగల కాంట్రాక్టర్ల జాబితాను పీజీసీఐఎల్ అందుబాటులో ఉంచింది. విద్యుత్ స‌ర‌ఫ‌రా పునరుద్ధరణ పనులను వేగవంతం చేయడానికి ట్రాన్స్మిషన్ లైన్ల నిర్మాణంలో పాల్గొన్న ఎలక్ట్రికల్ పరికరాల తయారీదారులు, ప్రధాన కాంట్రాక్టర్లతో సమన్వయం చేస్తామని ఐఈఈఎంఏ హామీ ఇచ్చింది. విద్యుత్ పునరుద్ధరణ పనులకు అవసరమైన సామగ్రి మరియు మానవశక్తిని అందిస్తామని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్ప‌టికే హామీ ఇచ్చాయి.
 Release Id :-1720598