Posted Date:- May 19, 2021

కొవిడ్ సెకండ్ వేవ్ వల్ల ఆక్సిజన్ , ఆక్సిజన్ సిలిండర్లకు విపరీతమైన డిమాండు పెరిగింది. క్రయోజెనిక్ ట్యాంకులలో ఆక్సిజన్ ద్రవ రూపంలో రవాణా అవుతుంది. దీనిని  ఆక్సిజన్ వాయువుగా మార్చి, రోగుల బెడ్ వద్దకు సరఫరా చేయడం చాలా పెద్ద సమస్య.   కొవిడ్ రోగులకు చికిత్స ఇస్తున్న  అన్ని ఆస్పత్రులు ఎదుర్కొంటున్న క్లిష్టమైన సవాలు ఇది. ఈ సమస్య పరిష్కారం కోసం మేజర్ జనరల్ సంజయ్ రిహానీ నేతృత్వంలోని భారత ఆర్మీ ఇంజనీర్స్ బృందం చొరవ తీసుకుంది. గ్యాస్ సిలిండర్లను ఉపయోగించకుండా ఆక్సిజన్ లభ్యమయ్యేలా చూడటానికి ఒక ఆవిష్కరణను కనిపెట్టేందుకు ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటైంది. ఈ కొత్త విధానం వల్ల తరచూ ఆక్సిజన్ సిలిండర్లను రీఫిల్ చేయవలసిన అవసరం ఉండదు.

  ఆర్మీ ఇంజనీర్ల బృందం సిఎస్ఐఆర్ & డిఆర్డిఓ అధికారులతో ప్రత్యక్ష సంప్రదింపుల ద్వారా వేపరైజర్లు, పిఆర్విలు , లిక్విడ్ ఆక్సిజన్ సిలిండర్లను ఉపయోగించి వారం రోజుల్లోనే  పరిష్కారాన్ని కనిపెట్టింది. కొవిడ్ బెడ్ వద్ద అవసరమైన పీడనం , ఉష్ణోగ్రత వద్ద ద్రవ ఆక్సిజన్‌ను నిరంతరం ఆక్సిజన్ వాయువుగా మార్చడానికి, ఈ బృందం చిన్న స్వల్ప పీడన ద్రవ ఆక్సిజన్ సిలిండర్‌ను (250 లీటర్లు) ఉపయోగించింది. ప్రత్యేకంగా రూపొందించిన వేపొరైజర్ ద్వారా , నేరుగా ఉపయోగించగల అవుట్‌లెట్ ప్రెజర్ (4 బార్) లీక్ ప్రూఫ్ పైప్‌లైన్ , ప్రెజర్ వాల్వుల ద్వారా ఆక్సిజన్ గ్యాస్ను అందించారు. ఢిల్లీ కంటోన్మెంట్లోని బేస్ హాస్పిటల్‌లో రెండు మూడు రోజుల పాటు 40 పడకలకు ఆక్సిజన్ వాయువును  రెండు లిక్విడ్ సిలిండర్లతో అందించారు. ఆసుపత్రులలో సాధారణ బదిలీ అవసరాలను తీర్చడానికి ఈ బృందం మొబైల్ వెర్షన్‌ను కూడా పరీక్షించింది. ఈ వ్యవస్థ ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. పైప్‌లైన్ లేదా సిలిండర్లలో అధిక వాయువు పీడనాన్ని తొలగిస్తుంది.ఇందుకు విద్యుత్ సరఫరా అవసరం లేదు కాబట్టి ఇది సురక్షితం. సంక్లిష్ట సమస్యలకు సరళమైన , ఆచరణాత్మక పరిష్కారాలను తీసుకురావడంలో ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో భారత సైన్యం  నిబద్ధతకు ఈ ఆవిష్కరణ మరొక ఉదాహరణ. కోవిడ్ –9 తో పోరాడటానికి భారత సైన్యం ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటుంది.

 

  

  


Release Id :-1720118