తొలి విడత మందు రక్షణ మంత్రి చేతుల మీదుగా ఆవిష్కరణ
కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్థన్.కు అప్పగింత
కోవిడ్.పై పోరులో 2-డి.జి. ఔషధం
కొత్త ఆశాకిరణమన్న రాజనాథ్
దేశ వైజ్ఞానిక ప్రతిభా పాటవాలకు, స్వావలంబన కృషికి
ఇది అద్భుత నిదర్శమని వ్యాఖ్య
కరోనా వైరస్ ను కట్టడి చేసే లక్ష్యంతో రక్షణ పరిశోధనా అభివృద్ధి సంస్థ (డి.ఆర్.డి.ఒ.) రూపొందించిన 2-డీ యాక్సీ డి-గ్లూకోజ్(2 డి.జి.) అనే కోవిడ్ 19 ఔషధం తొలి విడత మందును రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ ఈ రోజు న్యూఢిల్లీలో ఆవిష్కరించారు. పొడి రూపంలో ఉండే ఈ మందును కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమం, విజ్ఞాన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, భూగోళ శాస్త్రాల శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ కు రక్షణ మంది అందజేశారు. 2-డి.జి. పొడి మందు సాచెట్లు కలిగిన ఒక్కొక్కటి చొప్పున పెట్టెలను అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియాకు, సాయుధ బలగాల వైద్య సేవల (ఎ.ఎఫ్.ఎం.ఎస్.) లెఫ్టినెంట్ జనరల్ సునీల్ కాంత్ కు కూడా అందజేశారు. కోవిడ్ రోగుల చికిత్సలో అత్యవసర వినియోగం కోసం దేశంలోని వివిధ ఆసుపత్రులకు కూడా మరిన్ని బాక్సులతో కూడిన ఈ మందును త్వరలో పంపిణీ చేయనున్నారు. కోవిడ్ వైరస్ కు విరుగుడుగా పనిచేసే ఈ 2 డి.జి. మందుతో కూడిన ఒక్కొక్క బాక్సును డి.ఆర్.డి.ఒ. పరిశోధన శాలకు చెందిన న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అల్లైడ్ మెడిసిన్ ఇన్.స్టిట్యూట్(ఇన్మాస్), హైదరాబాద్ కు చెందిన డాక్టర్ రెడ్డీస్ లేబరేటరీస్ (డి.ఆర్.ఎల్.) సంస్థ కలసి రూపొందించాయి.
ఈ సందర్భంగా డి.ఆర్.డి.ఒ., డి.ఆర్.ఎల్.లను రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ అభినందించారు. కోవిడ్ రోగులకు ఆక్సిజన్ అందించాల్సిన అత్యవసర పరిస్థితిని నివారించి, వారు సత్వరం కోలుకునేందుకు దోహదపడే ఔషధాన్ని తయారు చేయడం చాలా అభినందనీయమని ఆయన అన్నారు. దేశం సాధించిన వైజ్ఞానిక ప్రతిభా పాటవాలకు, ఈ మందు గట్టి ఉదాహరణ అని, స్వావలంబన సాధనా కృషిలో ఇది ఓ మైలురాయి వంటిదని కేంద్రమంత్రి రాజనాథ్ సింగ్ అన్నారు.
“కోవిడ్ సంక్షోభంతో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్న ఈ సమయంలో 2-డి.జి. ఔషధం ఓ కొత్త ఆశాకిరణం” అని ఆయన అన్నారు. కోవిడ్-19 వైరస్ పై పోరాటంలో ఈ ఔషధం కీలక పాత్ర పోషించగలదన్న ఆత్మవిశ్వాసం కలుగుతోందన్నారు. కష్టకాలంలో జాతికి అండగా నిలిచేందుకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు భాగస్వామ్యంతో ముందుకు సాగుతాయనేందుకు ఈ ఔషధం రూపకల్పన, తయారీ ఒక అద్భుతమైన నిదర్శనమని రాజనాథ్ సింగ్ చెప్పారు. ఈ ఔషధం రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన శాస్త్రవేత్తలను స్వయంగా సత్కరించాలన్నది తన సంకల్పమని, దేశంలో పరిస్థితులు చక్కబడిన తర్వాత వారిని సత్కరించాలని భావిస్తున్నానని అన్నారు. ఈ ఔషధాన్ని సాధించిన ఘనత వారికే దక్కుతుందన్నారు.
కోవిడ్ రోగులకు అందించే చికిత్సలో భాగంగా ఆక్సిజన్, మందులు సరఫరా, దేశవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రుల్లో ఐ.సి.యు. పడకల ఏర్పాటు తదితర అంశాలన్నింటినీ ప్రభుత్వం క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తూ వస్తోందని, సంబంధిత మంత్రిత్వ శాఖలు, విభాగాల సమష్టి కృషితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన అన్నారు. దేశంలో ఈ నెల మొదట్లో 4,700మెట్రిక్ టన్నుల మేరకు ఉన్న ఆక్సిజన్ సరఫరా, గణనీయంగా మెరుగుపడిందని, ఇపుడు 9,500మెట్రిక్ టన్నుల స్థాయికి చేరిందని రక్షణ మంత్రి చెప్పారు.
పి.ఎం. కేర్స్ నిధి కింద, దేశంలోని వివిధ ఆసుపత్రుల్లో మెడికల్ ఆక్సిజన్ ఉత్పాదనా ప్లాంట్లను ఏర్పాటు చేసిన డి.ఆర్.డి.ఒ.ను ఆయన అభినందించారు. అంతేకాక, ఢిల్లీ, అహ్మదాబాద్, లక్నో, వారణాసి, గాంధీనగర్ ప్రాంతాల్లో ఐ.సి.యు., ఆక్సిజన్, వెంటిలేటర్ల సదుపాయంతో కూడిన కోవిడ్ ఆసుపత్రులను కూడా డి.ఆర్.డి.ఒ. నిర్మించిందని అన్నారు. హరిద్వార్, రిషీకేశ్, జమ్ము, శ్రీనగర్ ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఆసుపత్రుల నిర్మాణం వేగంగా కొనసాగుతోందన్నారు. సంక్షోభ సమయంలో వైద్యసేవలందించాలన్న పిలుపునకు స్పందించి వెంటనే వైద్య చికిత్సలో పాలుపంచుకుంటున్న సాయుధ బలగాల వైద్యసేవలకు చెందిన మాజీ డాక్టర్లను రక్షణ మంత్రి అభినందించారు.
ప్రస్తుత సంక్షోభ సమయంలో పరిస్థితిని ఎదుర్కొనడంలో పౌర పరిపాలనా యంత్రాగానికి సహాయం హస్తం అందించిన సాయుధ బలగాలు ఎంతో ప్రముఖ పాత్రపోషిస్తున్నాయని ఆయన అన్నారు. ఆక్సిజన్ ట్యాంకర్లు కంటెయినర్లు, కాన్సంట్రేటర్లు, ఇంకా కీలకమైన ఇతర వైద్య సామగ్రిని, పరికరాలను విదేశాలనుంచి రప్పించడంలో, దేశంలోని వివిధ ప్రాంతాలకు చేరవేయడంలో భారతీయ వైమానిక దళం, భారతీయ నావికాదళం నిర్విరామంగా కృషి చేస్తున్నాయని ఆయన అన్నారు. సైనిక ఆసుపత్రులలో చికిత్సా సదుపాయాలను విస్తరింపజేసి, అక్కడ సామాన్య పౌరులకు కూడా చికిత్స అందేలా చర్యలు తీసుకోవడం అభినందనీయమని అన్నారు.
దేశంలోని పౌరులందరికీ వైద్య రక్షణ కల్పించాలన్నది ప్రభుత్వ దృఢ సంకల్పమని రక్షణ మంత్రి పునరుద్ఘాటించారు. దేశంలో ఇంటింటికీ వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించాలని, ఆశా వర్కర్లు, అంగన్ వాడీ కార్యకర్తలకు ఇందుకు అసరమైన పరికరాలన్నింటినీ అందించాలని, దేశంలోని మారు మూల ప్రాంతాలకు కూడా పరీక్షా సదుపాయాలు కల్పించాలని ప్రధానమంత్రి అధికారులను ఆదేశించినట్టు రక్షణ మంత్రి చెప్పారు. దేశంలో వైరస్ మహమ్మారితో ప్రస్తుతం జరిగే పోరాటంలో భాగస్వామ్య వర్గాలన్నీ భుజం భుజం కలిపి ముందుకు నడవాలని అన్నారు. కంటికి కనిపించని శత్రువుపై దేశం తప్పకుండా విజయం సాధించగలదన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. “మేం విశ్రమించం. మేం అలసి పోయేది లేదు. కోవిడ్-19పై పోరాటం కొనసాగించి, విజయం సాధించి తీరుతాం” అని ఆయన స్పష్టం చేశారు. కోవిడ్-19తో పోరాటంలో పౌర పరిపాలనా యంత్రాగానికి సాయుధ బలగాలు మద్దతు అందిస్తూనే ఉన్నాయని రాజనాథ్ సింగ్ అన్నారు.
కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ మాట్లాడుతూ, డి.ఆర్.డి.ఒ., హైదరాబాద్ డి.ఆర్.ఎల్. సంస్థ రూపొందించడం చాలా ముఖ్యమైన పరిణామని, ఈ మందు వినియోగంతో కోవిడ్ రోగులు ఆక్సిజన్ పై ఆధారపడాల్సిన పరిస్థితి తప్పుతుందని, రోగులు కోలుకునే వ్యవధి కూడా తగ్గుతుందని చెప్పారు. భారతదేశంలోనే కాక, ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ వైరస్ ను జయించడంలో ఈ ఔషధం కీలకపాత్ర పోషిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. కోవిడ్-19 వైరస్ పై పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించిన డి.ఆర్.డి.ఒ.ను, ఆ సంస్థ శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు.
రక్షణ శాఖ పరిశోధన, అభివృద్ధి శాఖ కార్యదర్శి, డి.ఆర్.డి.ఒ. చైర్మన్ డాక్టర్ జి. సతీశ్ రెడ్డి మాట్లాడుతూ, వైరస్ నుంచి రోగులు కోలుకునేందుకు ఈ ఔషధం దోహదపడగలదన్న ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేశారు. హైదరాబాద్ కు చెందిన డి.ఆర్.ఎల్. త్వరలోనే ఈ మందును రోగులకు అందుబాటులోకి తేగలదని తాను ఆశిస్తున్నట్టు చెప్పారు. తమకు క్రమం తప్పకుండా మార్గదర్శకత్వం, మద్దతు అందించిన రక్షణమంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో వర్చువల్ పద్ధతిలో ఆన్ లైన్ ద్వారా పాలుపంచుకున్న రెడ్డీస్ లేబరేటరీస్ చైర్మన్ కల్లామ్ సతీశ్ రెడ్డి మాట్లాడుతూ, 2-డి.జి. ఔషధం రూపకల్పనలో డి.ఆర్.డి.ఒ., ఇన్మాస్ సంస్థలతో కలసి పనిచేయడం తమకు ఎంతో సంతోషం కలిగిస్తోందని అన్నారు. ఈ ఔషధం ఉత్పత్తి సామర్థ్యాన్ని తమ సంస్థ పెంచగలదని, జూన్ తొలి వారానికల్లా అన్ని ఆసుపత్రుల్లో ఈ మందు అందుబాటులో ఉండగలదని భావిస్తున్నామని ఆయన చెప్పారు.
కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్, ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్ డాక్టర్ సునీల్ కుమార్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర సెల్యులార్ మాలిక్యులర్ బయాలజీ పరిశోధనా కేంద్రం (సి.సి.ఎం.బి.) డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రాతోపాటుగా, దేశవ్యాప్తంగా ఉన్న వైద్యులు, ఆసుపత్రుల, లేబరేటరీల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో వర్చువల్ పద్ధతిలో పాలుపంచుకున్నారు.
No comments:
Post a Comment