Posted Date:- May 17, 2021

శతాబ్దానికి ఒక సారి వచ్చే కోవిడ్ లాంటి విపత్తును మానవాళి ఉమ్మడి ప్రయోజనాల దృష్ట్యా రాజకీయాలకు అతీతంగా అందరూ సమైక్యంగా ఎదుర్కోవాలని ఈశాన్య ప్రాంత అభివృద్ధి, ప్రధానమంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజాఫిర్యాదులు, పెన్షన్లు, అణు ఇంధనం అంతరిక్ష శాఖల కేంద్ర సహాయమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పిలుపునిచ్చారు..

ఈరోజు ఆయన ఇచ్చిన మీడియా ఇంటర్వ్యూలో అనేక విషయాలను ప్రస్తావిస్తూ, మోదీ ప్రభుత్వం మీద వస్తున్న ఆరోపణలను ఖండించారు. చాలామంది ప్రతిపక్ష నేతలు, మేధావులుగా చెలామణి అయ్యేవారు కరోనా సంక్షోభ నియంత్రణలో విఫలమైనట్టు మోదీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ప్రకటనలు చేయటంలోను, ట్వీట్లు చేయటంలోను నిమగ్నమయ్యారన్నారు.. అందుకోసం వెచ్చిస్తున్న శ్రమను వాళ్ళంతా ఈ సవాలును ఎదుర్కోవటం మీద వెచ్చిస్తే కరోనామీద భారత్ జరిపే పోరు మరింత సులభమవుతుందన్నారు.

 

 

ఇటీవలి కాలంలో కొంతమంది ప్రతిపక్ష నాయకులు, కొంతమంది మీడియా ప్రతినిధులు అదే పనిగ అప్రభుత్వాన్ని దుయ్యబట్టే పనిలో నిమగ్నమయ్యారని డాక్టర్ జితేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు.  అలాంటి విమర్శకులంతా ముందుకు వచ్చి  వాళ్ళకు ఎక్కద నిజమైన సమస్యలు కనిపిస్తున్నాయో అక్కడ తమవంతు కృషి చేస్తే వాళ్ల నిజాయితీ బైటపడుతుందన్నారు. కరోనా రెండో కెరటం తీవ్రతను అంచనా వేయటంలో భారత్ విఫలమైందని ప్రపంచదేశాలకు చాటిచెప్పాలన్నదే వాళ్ళ ధ్యేయమన్నారు.   

నిజానికి ప్రపంచవ్యాప్తంగా  శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు సైతం ఫిబ్రవరిలో కూడా దీన్ని అంచనా వేయలేకపోయిన విషయం రికార్డులు పరిశీలిస్తే వెల్లడవుతుందన్నారు. ఉన్నా దాని  తీవ్రత అంతంతమాత్రమేనని అంచనాకట్టిన విషయం గుర్తు చేశారు.అయితే ఇప్పుడు చాలామంది కరోనా బాధితుల పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని గుర్తు చేశారు. అలాంటప్పుడు మోదీ ప్రభుత్వాన్ని తప్పుబట్టటం అర్థరహితమన్నారు.   ఇలాంటి కష్టకాలంలో సందర్భశుద్ధిలేని రాజకీయ విమర్శలు తగవన్నారు. సామాన్య ప్రజల్లో విశ్వాసం నింపి  కరోనా మీద సమర్థంగా పోరాడేలా, యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్న పోరును బలోపేతం చేయాలని సూచించారు. బహిరంగ ప్రకటనలతో ప్రజల్లో భయోత్పాతం పెంచే ముందు నిజానిజాలు తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు.  

Release Id :-1719423