అంతర్జాతీయ సహాయాన్ని అత్యంత వేగంగా రాష్ట్రాలకు అందిస్తున్న కేంద్రం

ఇప్పటిదాకా 10000 కు పైగా ఆక్సిజెన్ కాన్సంట్రేటర్లు; 12000 పైగా ఆక్సిజెన్ సిలిండర్లు; 19 ఆక్సిజెన్ తయారీ ప్లాంట్లు; 6400 వెంటిలేటర్లు; దాదాపు 4.2 లక్షల రెమిడిసెవిర్ ఇంజెక్షన్ల పంపిణీ

Posted Date:- May 14, 2021

దేశంలో పెరుగుతున్న కోవిడ్ కేసుల దృష్ట్యా నివారణ దిశలో భారత్ చేస్తున్న కృషికి తోడుగా ప్రపంచం నలుమూలల నుంచి వివిధ దేశాలు, సంస్థలు పంపుతున్న విరాళాలు, సహాయ సామగ్రిని భారత ప్రభుత్వం  ఏప్రిల్ 27 నుంచి అందుకుంటోంది. సంపూర్ణ పాలన లక్ష్యంగా అందరికీ ఈ సహాయం ఒక క్రమ పద్ధతిలో అందేలా ప్రభుత్వం కృషి చేస్తోంది.  భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు ఈ సహాయాన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు వెనువెంటనే వేగంగా పంపటంలో సమన్వయంతో పనిచేస్తున్నాయి.

ఏప్రిల్ 27 నుంచి మే 13 దాకా మొత్తం 10,796  ఆక్సిజెన్ కాన్సంట్రేటర్లు; 12,269   ఆక్సిజెన్ సిలిండర్లు; 19 ఆక్సిజెన్ తయారీ ప్లాంట్లు; 6,497  వెంటిలేటర్లు; దాదాపు  4.22 లక్షల రెమిడిసెవిర్ ఇంజెక్షన్లు రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపిణీ జరిగాయి. రోడ్డు, వాయు మార్గాల ద్వారా ఈ పంపిణీ కొనసాగుతోంది.

ఇండొనేసియా, లగ్జెంబర్గ్, ఒమన్, దక్షిణకొరియా, యుకె, యుఎస్ ఐ ఎస్ పి ఎఫ్, ఫిన్లాండ్, గ్రీస్  దేశాలనుంచి మే 12, 13  తేదీలలో  అందిన ప్రధాన సహాయ సామగ్రి ఇలా ఉంది:

ఆక్సిజెన్ కాన్సంట్రేటర్లు: 1,506

- ఆక్సిజెన్ సిలిండర్లు : 434

- వెంటిలేటర్లు: 58

 తక్షణమే సమర్థవంతంగా రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేటాయించటం, పంపిణీ చేయటం అన్నవి అవిచ్ఛిన్నంగా సాగే ప్రక్రియ.  కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సమగ్రంగా ఈ కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంది.  మంత్రిత్వశాఖ ఇందుకోసం ప్రత్యేకంగా ఒక సమన్వయ విభాగాన్ని ఏర్పాటు చేసింది. విదేశీ సహాయాన్ని అందుకోవటం, దాన్ని పంపిణీ చేయటం లాంటివి పర్యవేక్షిస్తుంది. ఏప్రిల్ 26 నుంచి ఈ విభాగం పనిచేయటం ప్రారంభమైంది. మే 2వ తేదీ నుంచి ప్రామాణిక ఆచరణావిధానాలు రూపొందించి అమలు చేస్తోంది. 

 

ఫొటో 1. యునైటెడ్ కింగ్ డమ్  లో ఉన్న బ్రిటిష్ ఆక్సిజెన్ కంపెనీ నుంచి అందుకున్న 150 ఆక్సిజెన్ సిలిండర్లు ఉదయం భారత వైమానిక దళం విమానం పాట్నా విమానాశ్రయం చేరుకున్న దృశ్యం 

ఫొటో 2:. యు ఎస్ ఎ నుంచి వచ్చిన 29,514 రెమిడిసివిర్ ఇంజెక్షన్లు ముంబయ్ చేరుకోగా వాటిని అన్ని రాష్ట్రాలకు పంపే ఏర్పాట్లు చేస్తున్న దృశ్యం