Adsense

Tuesday, June 15, 2021

🕉మంగళవారం శ్రీవారి సేవ : : అష్టదళ పాదపద్మారాధన 🕉


"" శ్రీవారి ‘అష్టదళ పాదపద్మారాధన’ అంటే ఏమిటి ? 
ఆ సేవకు రిజిష్టర్ ఎలా చేసుకోవాలి ?

# శ్రీ వారి సేవలలో ఎన్నో అపూర్వమైనవి, విశేషమైనవి, ఆనందదాయకమైనవి, అఖండ పుణ్య ప్రదాయమైనవి, సకల పాప హరణమైనవి. వాటిల్లో విశిష్టమైనది మంగళవారం స్వామి వారికి చేసే అష్టదళ పాదపద్మారాధనము.

# మన మనస్సునే పద్మముగా చేసి, స్వామి వారి పాదపద్మాలకు సమర్పణ చేస్తున్నామా అనేటువంటి భక్తి భావం, భక్తులను పరవశింపు చేస్తుంది. గర్భాలయం లో జరిగేటువంటి ఈ అష్టదళ పాదపద్మారాధన ప్రముఖమైనదిగా అఘమ శాస్త్రం ద్వారా తెలుస్తుంది.

# అష్టదళ పాదపద్మారాధన లో భక్తులందరూ తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే..మీ మనస్సుని స్వామి వారి పాదాలకు సమర్పించటం. స్వామి వారి పాదాలు పద్మాలు, చేతులు పద్మాలు, స్వామి వారి ముఖము పద్మము, స్వామి వారి యొక్క నేత్రాలు పద్మదళాయ నేత్రాలు, పద్మం లో ఉండేట్టు వంటి లక్ష్మి అమ్మవారు ఈ విధము గా సమస్తము పద్మ మయమే…కాబట్టి మన మనస్సులలో ఆ పద్మ తత్త్వం వెంకటేశ్వర స్వామి వారి దివ్య భావన మనలో అంతర్లీనంగా ఉండి మనల్ని ధర్మ మార్గము వైపు నడిపించేటు వంటి అద్భుతమైన శ్రీవారి సేవ ఈ ‘అష్టదళ పాదపద్మారాధన’.

# ప్రతిరోజు స్వామి వారికి ఏకాంతంగా పరమ పవిత్రమైన, పుణ్యప్రదమైన తులసీదళాలతో స్వామి వారి పాదాలకు ఏకాంతంగా అర్చన జరుగుతుంది. అంటే ఎవరు చూసేట్టు వంటి అవకాశం ఉండదు. కానీ మంగళవారం నాడు మాత్రం ప్రత్యేకించి భక్తుల సౌలభ్యం కోసం భక్తులకు పుణ్యం ప్రసాదింప చేయటం కోసం ఆ ఒక్క రోజు మాత్రం అష్టదళ పాదపద్మారాధనగా ఈ సేవ కార్యక్రమాన్ని నిర్వహించటం జరుగుతుంది.

# శ్రీ స్వామి వారి అష్టోత్తర శతనామాలను ఉచ్చరిస్తూ స్వామి వారి పాదాలకు అర్చన ప్రారంభిస్తారు. ఒక్కో నామానికి ఒక్కో పద్మాన్ని శ్రీవారి పవిత్ర పాదాలకు సమర్పిస్తారు. మూల విరాట్టుకు అర్చన పూర్తయిన తరువాత అమ్మవార్లు లక్ష్మి దేవి, పద్మావతి దేవి కి అర్చన చేస్తారు.

# తిరుమలో శ్రీవారికీ ప్రతి మంగళవారం జరిగే ఆరాధన అష్టదళపద పద్మారాధన ఇది రెండోవ అర్చన.
108 సువర్ణ పద్మాలతో శ్రీవారిని అర్చించడం ఈ సేవలోని విశేషం.భక్తులు దీనిని ఆర్జిత సేవగా జరుపుకోవచ్చు.

# సహస్రనామార్చనలో 1008 నామాలకు ప్రాదాన్యం.అష్టోత్తరంలో 108 నామాలకు ప్రాదాన్యం.

# 108 బంగారు పద్మాలతో అర్చకులు స్వామివారి పాదాల చుట్టూ ఉన్న పీఠంపై శ్రీ వెంకటేశ్వర అష్టోత్తరం చదువుతూ సమర్పిస్తారు. 

# ఈ అష్టోత్తరం మామూలుగా మనకు లభించే శ్రీ వెంకటేశ్వర అష్టోత్తరం కాదు ఇది బ్రహ్మాండపురాణం అంతర్గతంగా స్వామివారికి బ్రహ్మదేవునిచే చెప్పబడినది మామూలు అష్టోత్తరము నకు దీనికి తేడా కలదు గమనించగలరు.

# ఈ సేవను  తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వర్ణోత్సవం సందర్భంగా ప్రవేశపెట్టారు.గుంటూరు కు చెందిన మొహమ్మదీయ భక్తుడు దీనికి అవసరమైన 108 బంగారు పద్మాలను శ్రీవారికి కానుకగా సమర్పించాడు. ఆ పువ్వులనే ఈనాటికీ అష్ట దళ పాదపద్మారాధన సేవకు వినియోగిస్తున్నారు ... తరువాత ఇది ఆర్జిత సేవగా రూపుదిద్దుకుంది.
(TTD EO గా ఒక్కప్పుడు పనిచేసిన మహానుభావుడు శ్రీ పి వి ఆర్ కే ప్రసాద్ రావు గారికి ఆ ముస్లిం భక్తుడు సమర్పించారు గమనించగలరు).

# సేవ రిపోర్టింగ్ టైమ్ : ఉదయం 5am.
# రిపోర్టింగ్ ప్లేస్ : VQC-1 (వైకుంఠం క్యూ కాంప్లెక్స్ – 1 )

# మగవారు ధోతీ తప్పనిసరిగా ధరించాలి. ఆడవారైతే చీర.
ఈ సేవ ను లక్కీ డిప్ గా మాత్రమే బుక్ చేసుకోవచ్చును.
ఒకవేళ మీరు సెలెక్ట్ అయినట్లయితే మీకు ఎస్ఎంఎస్ మరియు ఇమెయిల్ వస్తుంది. మూడు రోజులలో ఆ సైట్ లోనికి లాగిన్ అయ్యి రుసుము చెల్లించాలి.


🙏ఓం నమో వెంకటేశాయ🙏

No comments: