Adsense

Sunday, July 25, 2021

🕉 కలలు...వాటి ఫలితాలు 🕉

🕉 కలలు...వాటి ఫలితాలు 🕉
🛎నిద్ర‌లో క‌లలు క‌న‌డం మాన‌వ స‌హ‌జం. కేవలం మ‌నుషులే మాత్రమే కాదు... ప్రతి పక్షి, ప్రతి జంతువూ, ప్రతి ప్రాణి కలలు గనడం అతిసాధార‌ణ‌మే. సింహ స్వప్నం అనే మాట ఆలా పుట్టినదే. ఏనుగు కలలో కూడా సింహానికి భయపడుతుంద‌ని అంటారు. జంతులు మాత్రమే కలలకు భయపడతాయా..? కాదు.. కలల పట్ల భయం అనేది మానవులకూ అనాదిగా ఉంది. అందుకు కారణం.. అన్ని కలలు శుభ ఫలితాలనే కలుగజేయవు.  

👉కలల ఫ‌లితాల గురించి అగ్నిపురాణంలో కొంత వివరణ ఉంది. మంచి క‌ల‌ల గురించి చెప్పటమేకాక అశుభ స్వప్నాలు వస్తే.. వాటివల్ల కలిగే దుష్పరిణామాల నివారణోపాయాలను ఈ కథా సందర్భంలో వివ‌ర‌ణ‌ కనిపిస్తుంది. 

👉కలలో బొడ్డు తప్ప ఇతర శరీరావయవాలలో గడ్డి, చెట్లు మొలవటం, నెత్తి మీద పెట్టుకున్న కంచుపాత్రలు పగిలిపోవటం, క్షవరం చేయించుకొన్నట్టు కనిపించటం, ఒంటికున్న వస్త్రాలు పోయినట్టుగా కనిపించటం, మలిన వస్త్రాలు ధరించటం, నూనె, బురద పూసుకోవటం, పైనుంచి కింద పడటం లాంటివి మంచిదికాదు. 

👉అంతేకాదు సర్పాలను చంపటం, ఎర్రటి పూలతో నిండిన వృక్షాలను, సూకరం, కుక్క, గాడిద, ఒంటె కనిపించటం, ఆ జంతువులపై ఎక్కినట్టుగా ఉండటం శుభప్రదం కాదు. పక్షి మాంసాన్ని తినటం, తైలాన్ని తాగటం, మాతృ గర్భంలో ప్రవేశించటం, చితిపైకి ఎక్కటం, ఇంద్రధనస్సు విరిగినట్టుగా కనిపించటం అశుభాన్ని సూచిస్తుంది. 

👉ఆకాశం నుంచి సూర్యచంద్రులు పడిపోవటం, అంతరిక్షంలోనూ, భూమండలంలోనూ ఉత్పాతాలు జరిగినట్లు కనిపించటం, దేవతా బ్రాహ్మణ రాజగురువులకు కోపం వచ్చినట్టు కల రావటం నష్టహేతువు. 

👉కలలో సముద్రం కనిపిస్తే కష్టాలను ఎదుర్కోవలసి వస్తుందనే సూచనగా భావించాలని శాస్త్రం చెబుతోంది. నాట్యం చేస్తున్నట్టు, నవ్వినట్టు, గీతాలను పాడినట్టు, వీణ తప్ప మిగిలిన వాద్యాలను తాను వాయించినట్టు కల రావటం మంచిది కాదు. నదిలో మునిగి కిందికి పోవటం, బురద, సిరా కలిసిన నీళ్ళతో స్నానం చేయటం శుభ శకునాలు కాదు. స్వలింగ సంపర్కం, దక్షిణ దిక్కు వైపునకు వెళ్ళటం, రోగ పీడితుడిగా ఉండటం, ఇళ్ళను పడదోసినట్టు కలలో కనిపించటం శుభప్రదాలు కాదని అగ్నిపురాణం చెబుతోంది. 
పురాణంలో చెప్పిన స్వప్న శాస్త్రాల ప్రకారం ఇలాంటి చెడ్డ కలలను ఇతరులకు చెప్పకుండా ఉండటమే మంచిది. 

👉రాత్రి మొదటి జాములో కల వస్తే ఒక ఏడాది కాలం లోపల అది జ‌రుగుతుందని... రెండో జాములో కల వస్తే 6 నెల‌ల లోపున, మూడో జాములో వస్తే 3 నెల‌ల లోపున, నాలుగో జాములో కల వస్తే 15 రోజుల లోపున ఆ కలలకు సంబంధించిన ఫలితాలు వచ్చే అవ‌కాశం ఉంద‌ని శాస్త్రం చెబుతోంది . సూర్యోదయ సమయంలో కల వస్తే అది 10 రోజులలోపే జరుగుతుందని అంటారు. ఒకే రాత్రి మంచి కల, పీడ కల రెండూ వస్తే రెండోసారి వచ్చిన కలే ఫలవంతమవుతుందని... రెండోసారి వచ్చింది పీడకల అయితే మెలకువ రాగానే మళ్ళీ వెంటనే పడుకోవాలంటారు. అదే శుభస్వప్నమైతే నిద్రపోవటం మంచిది కాదు.

👉ఆకాశంలో మెరుపు మెరిసినట్లు, ఉరుములు ఉరిమినట్లు, పిడుగు పడినట్లు, తల దువ్వుకుంటున్నట్లు, ఇంట్లో నక్షత్రం ప్రకాశిస్తున్నట్లు, కట్లు ఉన్న కాళ్లతో నడిచినట్లు, కాలు విరిగినట్లు కలలు రావడం మంచిది కాదు. ఇక జంతువులు క‌ల‌లో వ‌స్తే... కుక్క తమను చూసి మొరిగినట్లు, నక్క, కోతి కనిపించినా, పక్షి గుడ్లను పగులగొట్టినట్లు, తడిసి ఉన్న గోడపై నడిచినట్లు, పిల్లిని చంపినట్టు, జంతువులు కరిచినట్లు, తేనెటీగలు కుట్టినట్లు, ఎగురుతున్నట్లు, గాడిద పైకి ఎక్కినట్లు, మృతులను చూసినట్లు, గుడ్లగూబలు అరిచినట్లు కలలు వచ్చినా నిజజీవితంలో మంచి జరగదు.

👉ఇలా మంచి క‌ల‌ల‌ గురించి, వాటి ఫలితాల నివారణ కోసం తిల హోమంలాంటి వాటి గురించి అగ్నిపురాణం చెబుతోంది. మంచి క‌ల‌ల వరుసను కూడా ఈ సందర్భంలోనే తెలిపింది. పీడకల వచ్చినప్పుడు మాత్రమే వెంబడే నిద్రించాలని, అదే శుభశకునం వస్తే మెలకువతో ఉండటమే మంచిద‌ని పరశురాముడికి పుష్కరుడు ఇలా స్వప్నాల గురించి వివరించి చెప్పాడు. మనిషి మనుగడకు సంబంధించిన అన్ని విషయాలను, శాస్త్రాలను పురాణాలు స్పృశించాయనటానికి ఇదొక ఉదాహరణ.

👉నిజానికి మనసు బాగా లేనప్పుడు వచ్చే కలలు ఆందోళన కలిగించేవిగా ఉంటాయి. ఇక మనసు సంతోషంగా వునప్పుడు వచ్చే కలలు ఆహ్లాదకరంగా వుంటాయి. అంటే మనసును ఎక్కువగా ప్రభావితం చేసే విషయాలే దృశ్యరూపాన్ని సంతరించుకుని కలలుగా వస్తుంటాయని మనోవైజ్ఞానిక నిపుణులు చెబుతుంటారు. అయితే అలాంటి స్వ‌ప్నాలు ఎలాంటి ఫలితాలను ఇవ్వవట‌. మనసు సాధారణమైన స్థితిలో ఉన్నప్పుడు.. తెల్లవారుజామున వచ్చే కొన్నికలలు మాత్రమే ఫలితాన్ని చూపు అవకాశం కలదు.

No comments: