Adsense

Saturday, July 10, 2021

చాతుర్మాస్య_వ్రతం_విశిష్టత

చాతుర్మాస్య_వ్రతం_విశిష్టత

చాతుర్మాస్య వ్రతం హిందువులు ఆచరించే ఒక వ్రతం. ఈ వ్రతంలో భాగంగా వర్షాకాలంలో నాలుగు నెలలపాటు ఒక పూట మాత్రమే భోజనం చేస్తారు. ఆషాఢ శుద్ధ ఏకాదశిని శయనైకాదశి అంటారు. ఆరోజున శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్ళి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి (ఉత్థాన ఏకాదశి) రోజున మేల్కొంటాడు. ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాస్యం అంటారు. ఈ కాలంలో యతులు ఎటువంటి ప్రయాణాలు తలపెట్టక ఒకేచోట ఉండి అనుష్టానం చేస్తారు. చాతుర్మాస్య వ్రతం ప్రాచీన కాలం నుండి హిందూదేశంలో మునీశ్వరులు పాటిస్తూ వస్తున్న వ్రతం. చాతుర్మాస్య వ్రతం అంటే నాలుగు నెలల కాలం అనుష్ఠించవలసిన వ్రతమని అర్ధం. కొందరు రెండు నెలల కాలమే ఈ వ్రతాన్ని పాటించి అర్ధచాతుర్మాస్యం అనే పేరుతో చేస్తారు. ఈ వ్రతాచరణకు స్త్రీ, పురుష భేదం కానీ, జాతి భేదం కానీ లేదు. వితంతువులు, యోగినులు మొదలైనవారెవరైనా చేయవచ్చును. ఇది హిందువులతో పాటు జైన, బౌద్ధ మతస్థులు ఉండే సమాజములోను ఆచరణలో కనిపిస్తుంది. ఈ వ్రతాన్ని ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు గానీ, వీలుకాకపోతే కటక సంక్రాంతి, కాకపొతే ఆషాఢ శుద్ధ పూర్ణిమ నుంచి విధిగా ఆచరించాలని చెప్తారు.

💐చాతుర్మాస్యం:💐

ఈ చాతుర్మాస వ్రతం ఆచరించడమనేది ఇటీవలి కాలంలో వచ్చినది కాదు. యుగ యుగాలుగా ఆచరణలో ఉందని భవిష్య, స్కాంద పురాణాలలోని కథనాల వలన అవగతమవుతుంది. ఒకప్పుడు ఇప్పటిలాగా కాక నాలుగు నెలలుపాటు కొనసాగే ఋతువులు మూడే ఉండేవట. అనంతర కాలంలో రెండేసి నెలల పాటు ఉండే ఆరు ఋతువులుగా అవి మారాయి . తొలినాళ్ళలో వర్ష, హేమంత, వసంత - అనే మూడు ఋతువులు మాత్రమే ఉండేవి. వర్ష ఋతువుతోనే సంవత్సరము ఆరంభామవుతూ ఉండేది . ఈ కారణం వల్ల సంవత్సరానికి " వర్షం" అనే పేరు వచ్చింది. సంవత్సరానికి మూడు ఋతువులున్న ఆ కాలములో ఒక్క ఋతువు ప్రారంభంలో ఒక్కో యజ్ఞం చేస్తుండేవారు. ఆషాఢ పూర్ణిమ నుండి వరుణ ప్రఘాస యజ్ఞం, కార్తీక పూర్ణిమ నుండి సాకమేద యజ్ఞం, ఫాల్గుణ పూర్ణిమ నుండి వైశ్వ దేవయజ్ఞము చేస్తూ ఉండేవారు. ఆ నాటి ఆషాఢంలో చేసే యజ్ఞమే అనంతర కాలం నాటికి చాతుర్మాస్య వ్రతము గా మారి ఆచరణలోకి వచ్చిందని పెద్దలు చెబుతున్నారు. చాతుర్మాస వ్రతము పాటించేవారు. ఆహార నియమాలలో భాగంగా శ్రావణ మాసంలో ఆకుకూరలను, భాద్రపద మాసంలో పెరుగును ఆశ్వయుజ మాసంలో పాలను కార్తీక మాసంలో పప్పు పదార్థాలను విధిగా వదిలి పెట్టాలి. వాటిని ఆహారముగా ఏ మాత్రము స్వీకరించ కూడదు. పాత ఉసిరి కాయ పచ్చడి మాత్రం వాడవచ్చును. ఈ ఆహార నియమాలన్నీ వాత, పిత్త, శ్లేష్మ సంబంధ రోగాల నుంచి కాపాడు కోవటానికి బాగా ఉపకరిస్తాయి. ఇలా ఎటు చూసినా చాతుర్మాస్య వ్రతదీక్ష అనేది - మానవాళి ఆరోగ్య పరిరక్షణకు ఉపకరించే ఉత్తమ వ్రత దీక్ష అని పురాణ వాఙ్మయం వివరిస్తోంది .

ఏకభుక్త మధశ్శయ్యా బ్రహ్మచర్య మహింసనమ్
వ్రతచర్యా తపశ్చర్యా కృచ్చచాంద్రాయణాదికమ్
దేవపూజా మంత్రజపో దశైతే నియమాః స్మృతాః

వ్రత నియమాలు సవరించు
చాతుర్మాస్యాన్ని అన్ని ఆశ్రమాల (బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస) వారు పాటించవచ్చు. కుల, వర్గ నియమాలు కానీ, లింగ వివక్ష కానీ లేదు. చాతుర్మాస్య వ్రతం ప్రధానంగా ఆరోగ్యానికి సంబంధించినది. చాతుర్మాస్య వ్రతం పాటించే విధానం ఆషాడ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకూ మొదటి నెలలో కూరలు, రెండవ నెలలో పెరుగు, మూడవ నెలలో పాలు, నాల్గవ మాసం లో పప్పు దినుసులూ తినకూడదు. భాగవతం వంటి గాథలు వింటూ ఆథ్యాత్మిక చింతనతో ఈ నాలుగు నెలలూ గడపాలి. వైరాగ్యాన్ని అలవరుచుకునేందుకు ఎక్కువగా సన్యాసులు, వృద్ధులు ఈ వ్రతం ఆచరిస్తారు.

ఈ నాలుగు మాసాలు తాను నివసించే గ్రామం యొక్క ఎల్లలు దాటరాదు.
ఈ కాలంలో అరుణోదయవేళ స్నానం చేయడం అవసరం.
వ్రతకాలంలో బ్రహ్మచర్యం, ఒంటిపూట భోజనం, నేలపై నిద్రించడం, అహింస పాటించాలి.
ఇష్టదేవతలకు చెందిన దివ్యమంత్రాన్ని అక్షరలక్షలుగా జపించాలి.
ఏదైనా ఒక ఉపనిషత్తును పఠించాలి.
భగవద్గీతలోని కొన్ని అధ్యాయాలను కంఠస్థం చేయాలి.
యోగసాధన చేయడం శ్రేయస్కరం.
దానధర్మాది కార్యాలు విశేష ఫలాన్నిస్తాయి.
వ్రత వృత్తాంతము సవరించు
చతుర్మాసాలు అంటే, ఆషాఢ శుక్ల ఏకాదశి నుంచి కార్తీక శుక్ల ఏకాదశి వరకు గల సమయం నాలుగు నెలలు. ఆషాఢ, శ్రావణ, బాధ్రపద, ఆశ్వయుజ మాసాల్లోని ఏకాదశులు ఎంతో పవిత్రమైనవి. ఇందులో మొదటిది దేవశయన ఏకాదశి. చివరిది దేవ ఉత్థాన ఏకాదశి. క్షీరసాగరంలో శ్రీ మహావిష్ణువు ఈ నాలుగు నెలలు శయనిస్తాడు. విష్ణువు శయనించే కాలంలో సాధకులు భూశయనం చేయటం, ఆకుకూరలు, వెల్లుల్లి, సొరకాయ, టమాట, ఆవనూనెల సేవనం మానివేయటం, నిరంతర జప, తప, హోమ, పురాణ కథా శ్రవణాల్లో కాలం గడపటం, రోజూ ఒకే పూట భోజనం చేయటం, ఏకాదశులలో పూర్తిగా ఉపవాస దీక్ష చేయటం వంటి దీక్షా ధర్మాలను పాటిస్తారు. పీఠాధిపతులు, దీక్షితులు ఒకే స్థానంలో నివసించటం, క్షురకర్మలు నిషేధించడం వంటి నియమాలు పాటిస్తారు. శ్రావణ, బాధ్రపద మాసాలు గృహస్థుల నియమాలకు సరైనవని పద్మపురాణం తెలుపుతోంది. బాధ్రపద కృష్ణ ఏకాదశిని అజా ఏకాదశి అంటారు. ఇది సమస్త పాపాలను తొలగిస్తుందంటారు

No comments: