ఆషాఢ మాసంలో శుభకార్యాలను ఎందుకు ఆపేస్తారో తెలుసా...
ఆషాఢ మాసాన్ని శూన్య మాసం అని కూడా పిలుస్తారు. తెలుగు క్యాలెండర్ ప్రకారం ఇది నాలుగో నెల. హిందువులకు ఈ మాసం ఎంతో పవిత్రమైనది.
ఈ ఆషాడంలో ఎన్నో ప్రత్యేక పూజలు కూడా చేస్తారు. కానీ శుభకార్యాలు మాత్రం వాయిదా వేస్తారు. ముఖ్యంగా పెళ్లిళ్లు, కొత్త ఇంట్లోకి అడుగు పెట్టడం వంటివి మంచిది కాదని భావిస్తారు. అంతేకాదు ఈ కాలంలో అత్తా కోడలు, భార్య భర్తలు, అత్తా అల్లుళ్లను దూరంగా ఉండాలంటారు.
మరికొందరు ఆషాఢ మాసాన్ని అపవిత్ర మాసంగా భావిస్తారు. ఈ సందర్భంగా ఆషాఢ మాసంలో ఎందుకని శుభకార్యాలు, పెళ్లిళ్లను నిషేధించారు.. వాటి వెనుక ఉన్న కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...
పవిత్రమైన మాసం..
ఆషాఢ మాసంలో మన దేశంలోని చాలా రాష్ట్రాల్లో దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తెలంగాణలో బోనాలు ఘనంగా నిర్వహిస్తారు. ఒడిశాలో జగన్నాథ రథయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఇతరచోట్ల కూడా రథయాత్రలు, పల్లకి సేవలకు ఈ మాసాన్ని శుభప్రదంగా భావిస్తారు. అందుకే ఈ నెలలో దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతాయి.
తీరిక లేని పూజారులు..
ఈ మాసంలో పండితులు, పూజాలు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో నిమగ్నమైపోతారు. దీంతో వారికి తీరిక అనేది ఉండదు. ఈ కారణంగా వారికి వివాహ తంతు నిర్వహించడానికి సమయం దొరకదు. ఈ కారణం వల్ల కూడా ఆషాఢ మాసంలో పెళ్లిళ్లను నిర్వహించరు.
విష్ణువు నిద్రలోకి..
ఉత్తరాయణ, దక్షిణాయన కథల ప్రకారం.. ఆషాఢ మాసంలో శ్రీ మహా విష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడని, దీని వల్ల ఈ సమయంలో పెళ్లి చేసుకున్న కొత్త దంపతులకు ఆ దేవుని ఆశీర్వాదం లభించందని నమ్ముతారు.
వర్ష రుతువు..
ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఆషాఢ మాసం ప్రతి సంవత్సరం జూన్, జులై మధ్యలో వస్తుంది. ఈ సమయంలోనే వర్ష రుతువు ప్రారంభమవుతుంది. రుతుపవనాలు చురుగ్గా కదలడం వల్ల ఈ కాలంలో ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. ఈదురుగాలులు కూడా ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ సమయంలో పెళ్లిళ్లు పెట్టుకుంటే షామియానాలు ఆ గాలికి ఎగిరిపోతాయని, విద్యుత్ తీగలు తెగిపడొచ్చని, పెళ్లికొచ్చిన వారు ఇబ్బంది పడతారనే కారణంతో ఈ సమయంలో శుభకార్యాలు, శంకుస్థాపన వంటి వాటిని వాయిదా వేస్తారు.
ఆదాయం తక్కువ..
మన దక్షిణ భారతదేశంలో ఆషాఢ మాసం సమయంలో ఎలాంటి పంట చేతికి రావడం అనేది జరగదు. అందుకే ఈ టైమ్ లో పెళ్లి చేయడానికి సరైన ఆదాయం ఉండదని.. అందుకే సంప్రదాయం పేరిట ఈ సమయంలో పెళ్లిళ్లు చేయకూడదనే నిబంధనలు తీసుకొచ్చారని పెద్దలు చెబుతుంటారు.
గోరింటాకు ప్రత్యేకత..
ఆషాఢ మాసంలో మరో ప్రత్యేకత ఏంటంటే.. గోరింటాకు పెట్టుకోవడం.. ఈ సమయంలో గోరింటాకు పెట్టుకోవడం అనేది ఆనాది కాలం నుండి ఆనవాయితీగా వస్తుంది. ఎందుకంటే ఆషాఢ మాసంలో వాతావరణం మారుతూ ఉంటుంది. ఈ సమయంలో మీకు ఆరోగ్య సమస్యలు రాకుండా గోరింటాకు సహాయపడుతుందని చాలా మంది నమ్ముతారు.
No comments:
Post a Comment