Adsense

Tuesday, October 5, 2021

వామనావతార ఘట్టంలో మహావిష్ణువు..

🕉 ప్ర:  వామనావతార ఘట్టంలో మహావిష్ణువు ఒక అడుగుతో భూమిని, రెండవ అడుగుతో ఆకాశాన్ని కొలిచాడు కదా ! 
మొదటి అడుగు కిందే బలి పడిపోలేదా? ఆయన ఉండడానికి స్థలం ఎక్కడిది? మూడో అడుగు అడగడానికి గానీ, తన నెత్తిపై పెట్టమనడానికి గానీ చోటు మిగిలి ఉందా? 
👉జ: భూమిని కొలవడం అంటే మన కాలితో తొక్కడం కాదు. భూమియంతా ఆయన పాదానికి సరిపోయిందని తెలియజేస్తూ, తాకకుండానే కొలవవచ్చు. అలాగే దివినంతా. 'మూడడుగుల మేరయే కదా' అని అహంకరించిన బలికి బుద్ధి చెబుతూ “నీకు ఉన్న లోకాలన్నీ రెండడుగులతోనే సరిపోయాయి. 
ఇంక మూడో అడుగు మాటేమిటి?” అని ప్రశ్నించాడు త్రివిక్రముడు (వామనుడు). 

👉అప్పుడు తన తలపై పాదం పెట్టమన్నాడు బలి. దీని అర్థం - తనవి అయిన లోకాల నిచ్చాడు. ఇంక ఏమీ మిగలలేదు. మిగిలినది తానే. తనను తానే మూడో అడుగుకి సమర్పించుకున్నాడు అంతే. రెండడుగులతో “నావి" అనే మమకారాన్ని, ఒక్క అడుగుతో "నేను" అనే అహంకారాన్ని విష్ణువునకు సమర్పించడమే ఈ కథలోని ఆంతర్యం. 

👉ఇక్కడో విషయాన్ని గమనించాలి - బలి తన తలపై పాదం పెట్టమనడంతో విష్ణువు నెత్తిమీద పాదం పెట్టి తొక్కలేదు. 
ఇంక బలికి స్వతంత్రత లేదనీ, విష్ణు ఆజ్ఞకు బద్ధుడని... ఆ సమర్పణలోని భావం. 

👉భూమిని కొలవడంతో బలిని కూడా కొలిచినట్లు కాదు. మన నేలను కొన్నవాడు మనల్ని కొన్నట్లు కాదు కదా!

No comments: