Adsense

Thursday, November 18, 2021

కోటి పుణ్యాల కార్తీక పున్నమి...



 ప్రతిరోజూ పర్వదినమే అయితే ఈ మాసం నెలరోజులు చేసే పూజలన్నింటి కంటే కార్తీక పౌర్ణమి నాటి  పూజకు ఫలితం అధికంమంటారు.

 అగ్నితత్త్వ మాసమైన కార్తీకంలో వచ్చే పౌర్ణమికి చంద్రుని విశేషంగా ఆరాధించాలని మన పూర్వులు చెబుతారు. 

చంద్రుని కొలవడంలో మానసిక చైతన్యం, కుటుంబ శ్రేయస్సు, భార్యాభర్తల మధ్య సఖ్యత, సంతాన సౌభాగ్యం కలిగి ప్రశాంతత ఏర్పడుతుంది. అటువంటి కార్తీక పౌర్ణమి విశేషాలను తెలుసుకుందాం.


కారీక్త పౌర్ణమి రోజున సంప్రదాయం ప్రకారం ఉదయమే పుణ్యస్త్రీలు మంగళ స్నానం ఆచరించి  శుచియైన వస్త్రం ధరించి ఇంటి ముంగిట రంగవల్లులు దిద్ది, పార్వతీపరమేశ్వరులకు ఆహ్వానం పలుకుతూ ఇల్లంతా అలంకరించాలి.

 సూర్యోదయానికి పూర్వమే తులసికోట వద్ద 365 వత్తులను ఆవునేతితోగాని, కొబ్బరినూనెతోగాని, నువ్వులనూనెతో గాని తడిపి దీపాలను వెలిగించాలి.

 అలాగే బియ్యపిండితో చేసిన దీపాలను, ఉసిరికాయ దీపాలను కూడా సమర్పించాలి. పిమ్మట శివాలయానికి వెళ్ళి గుమ్మడి, కంద దుంప, తాంబూలాదులతో బ్రాహ్మణులకు దానమిచ్చి, నమస్కరించి వారి ఆశీర్వాదాన్ని పొందాలి.

 అరటి దొన్నెలో దీపాలను వెలిగించి పవిత్ర నదులలో, కాలువలో వదలాలి. ఈవేళ చాలా ప్రాంతాలలో నదీమతల్లికి పసుపు కుంకుమను సమర్పిస్తారు. 

ఈ దృశ్యం అత్యంత మనోహరంగా, కనులకింపుగా వుంటుంది. దీనివల్ల నదీమతల్లి సంతసించి సకల సంపదలు ప్రసాదిస్తుందని, సంపూర్ణ సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుందని నమ్మకం. 

ఈ దినమంతా ఉపవసించి, సంధ్యాసమయంలో యధావిధిగా తిరిగి స్నానాదులు గావించి, కుటుంబ సౌఖ్యం, సౌభాగ్యం, ఐశ్వర్యం కోరుకుంటూ చంద్రునికి భక్తితో దీపాలు సమర్పించి వేడుకోవాలి...

No comments: