రాజా! మాఘమాసస్నాన మహిమను తెలుపు మరియొక కథను వినుమని మరల యిట్లు పలికెను.
పూర్వమొక విద్యాధరుడు సంతానము కావలయునని బ్రహ్మనుద్దేశించి గంగాతీరమున తపము చేయుచుండెను.
నియమవంతుడై భక్తి శ్రద్దలతో చిరకాలము తపమాచరించెను. అతడిట్లు చిరకాలము తపము చేయగా బ్రహ్మ సంతుష్టుడై వానికి ప్రత్యక్షమయ్యెను,
వరములనిత్తును కోరుకొమ్మనెను. పుత్రునిమ్మని విద్యాధరుడు బ్రహ్మను కోరెను.
అప్పుడు బ్రహ్మ "నయనా! నీకు పుత్ర సంతానయోగము లేదు. అయినను నీ తపముంకౌ మెచ్చి పుత్రిక ననుగ్రహించుచున్నానని" యంతర్దానమునందెను.
ఆమె పెరిగి పెద్దదయ్యెను, మిక్కిలి సుందరమై సద్గుణాన్వితయై కన్నవారికిని, తనను చూచినవారికిని, సంతోషమును కలిగించుచుండెను.
విద్యాధరుడును ఆనందమును కలిగించు నీమెను యెవరికోయిచ్చి అత్తవారింటికి పంపజాలను. వివాహము చేసినను అల్లుని కూడ నా యింటనే యుంచుకొందునని నిశ్చయించుకొనెను.
ఒకనాడొక రాక్షసుడామెను చూచెను, ఆ రక్షసుడు దేవీ భక్తుడు ఎన్నియో దివ్యశక్తులను సంపాదించెను, కోరిన రూపము ధరింపగల శక్తిని కూడ సంపాదించెను.
ఆ రక్షసుడు విద్యాధర పుత్రికను చూచినంతనే ఆమెపై మరులుకొనెను. ఆమె నెట్లైన వివాహము చేసికొనవలయునని తలచెను. ఆ రక్షసుడు మిక్కిలి శక్తిమంతుదు, శివును తపముచే మెప్పించి శివుని శూలమును కోరి పొందెను.
శివుడును వానికి శూలమునిచ్చుచు "ఓయీ! ఇది నీ శత్రువునకు అధీనమైనచో నీవు మరణింతువని" చెప్పి యిచ్చెను.
వరగర్వితుడైన రాక్షసుడు నన్ను మించిన శత్రువెవ్వడు నా ఆయుధము శత్రువునెట్లు చేరును అని తలచి వర గర్వితుడై యెవరిని లెక్కచేయక ప్రవర్తించుచుండెను.
అట్టి రాక్షసుడు విద్యాధర పుత్రికను చూచి "సుందరీ! నన్ను వరించుమని యడిగెను, ఆమెయు నా తండ్రినడుగుమని చెప్పెను.
రాక్షసుడును విద్యాధరుని వద్దకు పోయి వాని కుమార్తె నిచ్చి వివాహము చేయమని కోరెను. విద్యాధరుడు వానికి తన కుమార్తె నిచ్చి వివాహము చేయుటకు తిరస్కరించెను.
రాక్షసుడు చేయునది లేక మరల వచ్చెను, విద్యాధరుని పుత్రికను హరించి సురక్షితముగ సముద్రము క్రిందనున్న తన యింట ఉంచెను.
శుభముహూర్తమున ఆమెను వివాహమాడదలచెను, విద్యాధరుడును తన పుత్రికయేమైనదో యని విచారించుచుండెను.
ఆ రాక్షసుడు బ్రహ్మ వద్దకు పోయి తన వివాహమునకు మంచి ముహూర్తమును చెప్పమని యడుగగా బ్రహ్మ యెనిమిది మాసముల తరువాత మంచి ముహూర్తమున్నది అంతవరకు ఆగమని చెప్పెను.
రాక్షసుడు అందుకు అంగీకరించెను. అతడు విద్యాధర పుత్రికతో ఎనిమిది మాసముల తరువాత శుభముహూర్తమున నిన్ను వివాహమాడుదును, ఈ లోపుననిన్నేమియు బాదింపను.
నీవు కోరిన వస్తువులను తెచ్చి యిత్తుననగా నామెయేమియు మాటలాడలేదు, రాక్షసుడు మరల మరల నడుగగా 'నాకిప్పుడేమి అక్కరలేదు,
ప్రతి సోమవారము సాయంకాలమున శివుని దర్శించు వ్రతమున్నది, దర్శించి పూజించుటకు శివలింగమెచటనున్నదో చూపూ మని అడిగెను.
ఆ రాక్షసుడు పాతాళములో వున్న హటకేశ్వరుని చూపెను. విద్యాధర పుత్రికయు రాక్షసుని అనుమతితో శివ సందర్శనమునకై ప్రతి సోమవారము పాతాళమునకు పోయి వచ్చుచుండెను. ఒకనాడామె పాతాళలోకమున నున్న హటకేశ్వర స్వామిని దర్శింప వెళ్లెను. అప్పుడఛటకు త్రిలోకసంచారియగు నారద మహర్షియు హటకేశ్వరుని దర్శింప వచ్చి యామెను జూచెను.
ఆశ్చర్యపడి 'అమ్మాయి! నీవిచటనున్నావేమని అడిగెను. ఆమెయు తన వృత్తాంతమును చెప్పెను.
రాక్షసుడు తనను సముద్రము క్రింద నున్న గృహమున నిర్భంధించెననియు చెప్పెను.
నారదుడామె చెప్పినదంతయును వినెను. అమ్మాయీ! భయపడకుము విష్ణుభక్తుడై నీకు భర్తయగు వానిని నీ వద్దకు పంపుదును.
అతడే నీ భర్త విచారింపకుము. నా మాటను నమ్ముము. నీకొక ఉపాయమును చెప్పెదను వినుము. ఇచట శివునకెదురుగ మానస సరోవరము కలదు.
మాఘమాసమున నీవీ సరస్సు స్నానమాచరింపుము. గంధపుష్పాదులతో శ్రీమన్నారాయణుని పూజించి ప్రదక్షిణ నమస్కారములను చేయుము.
మాఘమాసమంతయు ఇట్లు చేయుము. ఇట్లు చేసిన వారు కోరినది లభించును. శ్రీమన్నారాయణుడు నిన్ను కాపాడును.
మాఘస్నానము పూజాధికము సద్యఫలమునిచ్చును. నా మాటను నమ్ముమని చెప్పి నారదుదు తన దారిన పోయెను.
విద్యాధర పుత్రికయు నారదుని మాటలను మనస్ఫూర్తిగ నమ్మెను. మాగమాసమంతయు హటకేశ్వరపురమందున్న మానస సరోవరము వద్దకు వెళ్లి స్నానము చేసి పూజ మున్నగు వానిని చేయుచుండెను.
నారదుని మాట యధార్థమగుటకై ఎదురు చూచుచుండెను. మాఘమాసమును వ్రతముతో గడపెను. నారదుడును లోకసంచారము చేయుచు సౌరాష్ట్ర దేశమును పాలించుచున్న శ్రీమహావిష్ణు భక్తుడగు హరిద్రధుడను మహారాజును జూచెను.
ఆరాజు సర్వకాల సర్వా వస్థలయందును శ్రీమహావిష్ణువును స్మరించుచుండును. అందరియందును శ్రీమన్నారాయణునే దర్శించును. వారిని హరీయని ఆహ్వానించును.
విష్ణువాయని పిలుచును. గోవిందాయని మాటలాడును. శ్రీకృష్ణాయనుచు వస్తువును స్వీకరించును.
దామోదరాయనుచు భుజించును, కేశవాయనుచు నిద్రించును.
నరసింహాయని స్మరించును, హృషీకేశాయని మేల్కొనును, వామనాయనుచు తిరుగును, ఏపని చేయుచున్నను యెవరితో మాటలాడుచున్నను యేదో ఒక విధముగ శ్రీమన్నారాయణుని తలుచును.
ఇట్లు విష్ణు భావనాతన్మయుడైన హరిద్రధుని వద్దకు నారదమహర్షి వెళ్లెను.
హరిద్రధుడును నారదమహర్షిని జూచి యెదురువచ్చి గౌరవించెను. తగిన ఆసనమున కూర్చుండబెట్టి అనేక ఉపచారములతో పూజించెను.
నారదుడును రాజా విద్యాధర కన్యనొక దానిని వరగర్వితుడైన రాక్షసుడొకడు బలాత్కారముగ నపహరించి సముద్ర గర్భమున దాచియుంచినాడు
ఆ విద్యాధర కన్యక త్రిలోకసుందరి, సద్గుణశీల నీవామెను భార్యగా స్వీకరింపవలెను. ఆ రాక్షసుని వాని శూలముతోనే సంహరింపవలయును.
అని వానికి తగినరీతిలో వివరించి నారదుడచట నుండి లోక సంచారార్థముపోయెను. హరిద్రధుడును సముద్రము వద్దకు పోయెను, నారదుడు చెప్పినట్లుగ సముద్రము వానికి తన లోనికి వచ్చుటకు మార్గము నొసగెను.
హరిద్రధుడును ఆ రాక్షస గృహమును చేరెను. ఆ సమయమున రాక్షసుడింట లేడు. అతదు వివాహ ముహూర్తమునకై బ్రహ్మ వద్దకు పోయెను.
అతదు పోవుచు శూలము ఇంటిలో వుంచి వెళ్లెను. రాజు రాక్షసుని యింట నున్న శివుని శూలమును గ్రహించియుండెను.
రాక్షసుడింటికి వచ్చునప్పటికి తన శూలము పరహస్తగతమగుటను గమనించెను. ఆ రాజును చూచి యిట్టివానితో యుద్ధము చేసి మరణించినను మంచిదేయని తలచి హరిద్రధునితో యుద్ధము చేయసిద్ధపడెను.
రాక్షసుడు హరిద్రధుడు చాలా కాలము యుద్ధము చేసిరి, హరిద్రధుడు శివుని శూలమును ప్రయోగించి రాక్షసుని సంహరించెను. ఆ రాజు రాక్షసుని సంహరించి విద్యాధర పుత్రిక వద్దకు పోయెను.
ఆమెయు నారదుని మాటను స్మృతికి తెచ్చుకొనెను, వానిని భర్తగా వరించెను. హరిద్రధుడును ఆమెను వివాహమాడెను.
ఆ దంపతులును విష్ణుభక్తులై విష్ణుపూజను మాఘమాస స్నానమును మానక చేయుచుండిరి. చిరకాలము సుఖశాంతులతో శుభలాభములతో జీవితమును గడిపి శ్రీహరి సాన్నిధ్యమును చేరిరి, అని వశిష్టుడు మాఘస్నాన మహిమను దిలీపునకు వివరించెను...🙏💐
నేటి మాఘ పురాణం 16,వ రోజు పారాయణం సమాప్తం.
No comments:
Post a Comment