Adsense

Friday, February 4, 2022

దశావతారాలలో అత్యంత సుందర స్వరూపం ఎవరిది ...



🌷నరసింహ పురాణం లోని కథ విందము...🌷

అవంతీ నగరమున సుశర్మ అను వేదవేదాంగ పారాయణుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు. 

అతని భార్య సుశీల మంచి ఉత్తమురాలు. వారికి ఐదుగురు కుమారులు కలుగగా వారిలో చిన్నవాడైన వాసుదేవుడు వేశ్యాలోలుడై , చేయరాని పనులు చేసేవాడు.

 ఇలా ఉండగా ఒకనాడు వాసుదేవునకు , వేశ్యకు కలహము సంభవించి. దాని మూలంగా వాసుదేవుడు ఆ రాత్రి భోజనం చేయలేదు. ఆనాడు నృసింహ జయంతి.  వేశ్యలేనందు వలన ఆ రాత్రి వాసుదేవుడు జాగరణ కూడా చేసాడు.

 వేశ్య కూడా ఉపవాసము , జాగరణ చేసింది. అజ్ఞాతముగా ఇలా వ్రత ఆచరించుడం వలన వీరు ఇద్దరూ ముక్తులై ఉత్తమగతులు పొందారని నృసింహ పురాణం చెబుతున్నది.

సృష్టి , స్థితి , లయ కారకులలో స్థితి కారకుడైన శ్రీమహావిష్ణువు ఈ లోకాలను ఉధ్ధరించడానికి శిష్టులను రక్షించడానికి అనేక అవతారాలు ఎత్తాడు. బాహ్య రూపంలో కాకుండా , భావ రూపంలో  ఈ అవతారాలన్నింటిలో అందమైన అవతారమేదో తెలుసుకోవాలనే జిజ్ఞాస కలిగింది మహా వైష్ణవ భక్తుడైన తిరుమళిశైఆళ్వారుల వారికి. 
వీరు శ్రీ వైష్ణవ ఆళ్వారులలో నాలగవ వారు.   

తొమ్మిది అవతార పురుషుల మధ్య పోటీ పెట్టి అందులో అత్యంత సుందరావతారాన్ని ఎన్నుకొని తద్వారా తనలోని జిజ్ఞాసను తీర్చుకోవాలని సంకల్పించారు.  ప్రాధమిక ‌పోటీకి మత్స్య ,  కూర్మ , వరాహ  అవతారాలు. ఇవేవీ మానవరూపంలో లేనందున పోటీ నుండి తొలగించారు. రెండవ వరస పోటీ నరసింహుడి నుండి శ్రీకృష్ణ అవతారాల మధ్య.
ఇందులో వామనుడు తొలుత బాలుడిగా వచ్చి కేవలం మూడు అడుగుల నేల కోరి చూస్తూండగానే నభోంతరాళాలకు ఎదిగిపోయి బలిని అధఃపాతాళానికి అణగదొక్కడం ద్వారా  తిరుమళిసై  వారిచే పోటీ నుండి తిరస్కరింపబడ్డాడు.

గండ్రగొడ్డలి చేత ధరించి ఇరవై ఒక్కసార్లు క్షత్రియ సంహారం చేసిన ఉగ్రరూపి పరశురాముడు సుందరుడు కానేరడని ఆ వైష్ణవ భక్తుడు భావించి పరశురాముడిని అందాల పోటీనుండి తొలగించాడు. ఒకే కుటుంబానికి చెందిన వారనే కారణంగా బలరామ , కృష్ణులలో బలరాముడు పోటీ చేసే  అర్హత కోల్పొయాడు.  

తిరుమళిశై ఊహాత్మకంగా పెట్టిన సౌందర్య పోటీలలో ఆఖరి వరసలో నిలబడినవారు నరసింహస్వామి , శ్రీ రాముడు , శ్రీ కృష్ణుడు. శ్రీరాముడు సకలగుణాభిరాముడే , ధర్మవర్తనుడే కానీ ప్రత్యేకించి సుందరాకారుడని కీర్తింపబడలేదు. అలాగే , శ్రీకృష్ణుడు చతురుడు , గోపికా మానస చోరుడు. గొప్ప రాజకీయవేత్త. అందువలన , వీరిని అందగాళ్ళు గా భావించలేదు తిరుమళిశై ఆళ్వార్. 

చివరకు మిగిలినది నరసింహస్వామి. ఆపదలలో ఉన్నవారిని పిలువగనే వచ్చి రక్షించినవాడే అందగాడు.  హిరణ్యకశిపుడిని నిర్జించి ప్రహ్లాదుడిని రక్షించిన నృసింహుడే అంతర్ముఖ సుందరుడని నిర్ణయించుకుంటాడు తిరుమళిశై ఆళ్వార్.

ఇందుకు మరొక కారణం కూడా వ్యాసుడు , పోతన గారు చెప్పిన భావాన్నే చెపుతాడాయన. భక్తుడైన బాల ప్రహ్లాదుడిని ఆపద నుండి రక్షించడం కోసం మాత్రమే కాక , తన మీద నమ్మకంతో  *"ఇందుగలడందు లేడని సందేహము వలదు  ఛక్రి సర్వోపగతుండు , ఎందెందు వెతకి చూచిన అందందే కలడని "* ప్రగాఢ విశ్వాసం తో కొలచినందుకు అతని మాటను వమ్ము చేయకుండా రాతి స్థంభాన్ని చీల్చుకొని  వచ్చిన నృసింహు డే సుందరుడని తిరుమళిశై విశ్వసించాడు.

కృష్ణ సందేశం..

No comments: