"అత్తా నీకేం కావాలో కోరుకో! నేను అనుగ్రహిస్తాను అన్నాడు శ్రీకృష్ణుడు.
దానికి కుంతీదేవి, "నేను కోరిన కోరికను నీవు తీర్చలేవులే కృష్ణా!" అన్నది. అదేమిటత్తా! అలా అంటావు? నీవు నిస్సందేహంగా కోరుకో, తీరుస్తాను అన్నాడు కృష్ణుడు.
అప్పుడు కుంతీదేవి, "కృష్ణా! అయితే నాకెప్పుడూ కష్టాలు, దుఃఖాలు ఉండేటట్లుగా అనుగ్రహించు" అన్నది.
ఆశ్చర్యపోయాడు కృష్ణుడు. అత్తా ఏమిటి నీ విపరీతమైన కోరిక? అన్నాడు. దానికి కుంతీదేవి, "నాయనా! మేము కష్టాలలో ఉన్నప్పుడే గదా! నీవు పరుగులు తీసుకుంటూ మావద్దకు వచ్చిందిఆనాడు ఏకచక్రపురంలో భిక్షాటన చేస్తున్నప్పుడు వచ్చావు.
ఖాండవప్రస్థంలో దిక్కులేకుండా ఉన్నప్పుడు వచ్చావు. ద్రౌపదీ వస్త్రాపహరణమనే అత్యంత దుర్భర కష్టస్థితిలో ద్రౌపది మానసంరక్షణ గావించావు.
అరణ్యాలలో క్లేశాలు అనుభవిస్తుంటే ధైర్యం చెప్పటానికి వచ్చావు. దుర్వాసుని బారినుండి కాపాడటానికి పిలవకుండానే వచ్చావు.
మహాయుద్ధంలో వెన్నంటి ఉండి నా పుత్రులను రక్షించావు. ఇప్పుడు సకల సంపదలతో, రాజ్యభోగాలతో సుఖసంతోషాలతో ఉన్నప్పుడు ఒక్కసారైనా వచ్చావా?
అందుకే నీ దర్శనాన్ని కలిగించే కష్టాలే కావాలి అన్నదట. అదీ భక్తుల ఆలోచన.
ఈ ప్రపంచానికి ఆత్మజ్ఞానాన్ని అందించే భగవద్గీత కూడా విషాదయోగంతోనే ప్రారంభమైంది.
దుఃఖాన్ని యోగంగా మార్చుకున్నాడు అర్జునుడు పరమాత్మ సాయంతో. దుఃఖం ముక్తికి సోపానం అని ఋజువుచేశాడు.
👉దుఃఖంతో గొప్ప వాడయ్యాడు అర్జునుడు.
కనుక దుఃఖం భగవంతుని సన్నిహితుని చేస్తుంది. సుఖం భగవంతునికి దూరం చేస్తుంది - అని భావించగలిగితే రెండింటి పట్ల సమభావం ఉంటుంది...జై శ్రీకృష్ణ.
No comments:
Post a Comment