Adsense

Thursday, March 17, 2022

హోలీ గురించి తెలుసుకుందాం

హోలీ

తెలుగు మాసాలలో చివరిదైన 'ఫాల్గుణ మాసం' అంటే శ్రీమహావిష్ణువుకు ఎంతో ఇష్టమని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఎందుకంటే స్వామివారికి అత్యంత ప్రీతి పాత్రమైన లక్ష్మీదేవి ఉద్భవించినది ఈ మాసంలోనే. ఈ కారణంగానే లక్ష్మీ నారాయణులను ఆరాధించడానికి ఈ మాసం అన్ని విధాల అనుకూలమైనదని అంటారు. ఇంతటి విశిష్టతను కలిగిన ఈ మాసంలోనే 'హోలీ' పండుగ వస్తుంది.

రెండు రోజులపాటు జరుపుకునే ఈ పండుగ, సఖ్యతకు ... సామరస్యానికి అద్దం పడుతూ వీధులను రంగుల మాయం చేస్తుంది. జీవితం రంగులమయం కానుందనే ఆశను రేకెత్తిస్తుంది. ఫాల్గుణ శుద్ధ చతుర్దశి రోజున 'కామదహనం' ... ఫాల్గుణ పౌర్ణమి రోజున హోళికా పూర్ణిమ (కాముని పున్నమి) పేరుతో ఉత్సాహంగా సంబరాలు జరుగుతుంటాయి. లోక కల్యాణానికి గాను పార్వతీ పరమేశ్వరుల కల్యాణం జరిపించాలని దేవతలు నిర్ణయించుకుంటారు. పార్వతీ దేవి పట్ల పరమశివుడి దృష్టి నిలిచేలా చేయమని అంతా మన్మధుడిని కోరతారు.

అలవాటు ప్రకారం శివుడి పైకి మన్మథుడు బాణాన్ని ప్రయోగించి, ఆయనకి తపోభంగాన్ని కలిగిస్తాడు. ఆగ్రహావేశాలకి లోనైన శివుడు ... తనలో కోరికలు కలిగించడానికి ప్రయత్నించిన మన్మథుడిని తన మూడవ కన్నుతో భస్మం చేస్తాడు. కోరికలు దహింపజేసిన రోజు కావడం వలన ఈ రోజు 'కామదహనం' అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. 

ఈ సంఘటనను పురస్కరించుకుని కొన్ని ప్రాంతాలలో గడ్డితో చేసిన మన్మథుడి బొమ్మను తగులబెట్టడాన్ని సామూహిక ఉత్సవంగా నిర్వహిస్తుంటారు. ఇక మరునాడైన పౌర్ణమి రోజునే, హోళికా అనే రాక్షసి సంహరించబడటం కారణంగా ఈ రోజుకి హోళికా పూర్ణిమ అనే పేరు వచ్చిందని అంటారు. ఇక హోళిక అంతం చేయబడటం వల్లనే కాదు, తన కారణంగా భస్మమైపోయిన మన్మథుడుకి శివుడు అదృశ్య రూపాన్ని ఇచ్చినది కూడా ఇదే రోజునని అంటారు.

ఈ కారణంగా కూడా ఈ రోజున సంతోషంతో అంతా కలిసి రంగులు చల్లుకుంటూ ఉంటారు. కష్టాలను తట్టుకుని నిలబడితే ఆనందాలు వస్తాయనే ఆశావహ దృక్పథాన్ని ఈ పర్వదినం ఆవిష్కరిస్తూ ఉంటుంది. ఇక ఈ రోజున ఉదయం వేళలో లక్ష్మీదేవిని ఆరాధించి, రాత్రివేళలో శ్రీ కృష్ణుడికి 'పవళింపు సేవ' ను నిర్వహించడం వలన సకల శుభాలు చేకూరతాయని చెప్పబడుతోంది.

అలానే హోలీ పండుగ వెనుక ఘన చరిత్ర ఉంది. రాక్షసుల రాజైన హిరణ్యకశ్యపుడు ఎంతో భక్తితో తపస్సు చేసి బ్రహ్మ వరం పొందాడు. ఎవరికీ సాధ్యం కానీ వరం ఈ రాక్షసుల రాజైన హిరణ్యకశ్యుపుడు పొందాడు. ఏ సమయమైనా, పక్షిచేత కానీ, పశువు చేత కానీ, మనిషి చేత కానీ ఇంకా ఎలా అయినా కానీ ఇతనికి చావు లేదు. అయితే ఈ కారణం వాళ్ళ ఇతనికి దురహంకారం బాగా పెరిగిపోయింది. చావు లేదు అన్న కారణంతో  దురహంకారంతో రెచ్చిపోయాడు ఈ  రాక్షస రాజు. తానే దేవుడు అని వేరే దేవుడు లేడు అని చెప్పి ఎంతో విర్రవీగేవాడు. ప్రజలు ఎవరు కూడా దేవుడిని ప్రార్ధించకూడదు అని చెప్పాడు. కేవలం తననే పూజించాలని చెప్పాడు ఆ రాక్షసుడు. 

తన కుమారుడు ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు. హిరణ్య కశ్యపుడు తన కుమారుడిని విష్ణువుని పూజించవద్దు అని  ఎన్నో సార్లు హెచ్చరించాడు. కానీ ప్రహ్లాదుడు తన తండ్రి మాట వినలేదు. నిత్యం విష్ణువు భక్తిలో ద్యాస పెట్టేవాడు. ఒకసారి హిరణ్య కశ్యపుడు తన కుమారుడికి  విషం పోసాడు కానీ అది అమృతం అయ్యిపోయింది. ఏనుగులు చేత తొక్కించాడు కానీ ప్రహ్లాదుడికి ఏమి కాలేదు. విష సర్పాల మధ్యలో కూడా జీవించగలిగాడు ప్రహ్లాదుడు. చివరికి ప్రహ్లాదుడిని హోళికా అనే రాక్షసి  ఒడిలో చితి పెట్టి కూర్చోవాలని ఆజ్ఞాపించాడు. చితి నుంచి  రక్షించగలిగే శాలువని హోలికకి వేసి ఉంచాడు. ప్రహ్లాదుడు తన తండ్రి ఆదేశం మేరకు అందరి ముందు వెళ్లి చితిలో  కూర్చున్నాడు. ప్రహ్లాదుడు భక్తి కి విష్ణుమూర్తి మెచ్చి ఆపద నుండి కాపాడాడు. అందరు చూస్తుండగానే ఆ శాలువ వచ్చి ప్రహ్లాదుడు మీద పడడం తో ప్రాణాపాయం నుండి బయట పడ్డాడు. కానీ హోలిక మరణించింది.

హోలీని రంగుల పండుగ అని అంటారు. కొన్ని చోట్ల ఈ పండుగని కేవలం ఒక్క రోజే చేసుకుంటారు. కానీ కొన్ని ప్రదేశాలలో మూడు నుండి పదహారు రోజులు ఈ పండుగని జరుపుకుంటారు. ఎక్కువగా పండుగ జరిపే చోట భారీ ఎత్తున జనం చూడడానికి వస్తారు. ఈ ఉత్సవాలని అనేక ప్రాంతాల నుండి వచ్చి సందర్శకులు వీక్షిస్తారు. ఈ ఉత్సవం వసంతం ముందు వస్తుంది కనుక బసంతి ఉత్సబ్ అని అంటారు. దీనిని దోల్ యాత్ర అని కూడా అంటారు. కృష్ణుడుకి సంబందించిన కొన్ని ప్రదేశాలలో హోలీ పండుగని బాగా జరుపుకుంటారు. వాటిలో మథుర, బృందావనం, నందగావ్, బర్సానాల మొదలైన ప్రదేశాలలో ఈ పండుగ అంగరంగ వైభవంగా జరుపుతారు. అక్కడికి జనం ఎంతో  మంది  వెళ్తారు. ఎంతో రద్దీగా ఉంటుంది అక్కడ హోలీ పండుగ రోజుల్లో. 

దక్షిణ భారతదేశంతో పోల్చుకుంటే ఉత్తర భారతదేశంలో హోలీ పండుగని బాగా జరుపుకుంటారు. అయితే దక్షిణ భారతదేశంలో హోలీ ఒక్క రోజు మాత్రమే జరుపుకుంటారు. వివిధ చోట్ల ఈ పండుగని  3 నుండి 16  రోజులు జరుపుకుంటారు. ఇక్కడ మాత్రం ఒక్క రోజే చేసుకుంటారు. పిల్లలు, యువకులు రంగులని జల్లుకుని ఆనందంగా నవ్వుకుంటారు. చక్కగా రంగులతో ఆడుకుంటారు. కొన్ని చోట్ల భోగి మంటల సంప్రదాయం ఉంది.

No comments: