అయ్యప్ప జయంతి శుభాకాంక్షలు..
ఈరోజు అయ్యప్ప స్వామి ఉత్తరా నక్షత్ర పూజ...
శ్రీ హరిహర సుతుడైన శ్రీ అయ్యప్ప స్వామి వారి జన్మదినం ఏటేట ఫాల్గుణ మాసం , పౌర్ణమి తిధి , ఉత్తరా నక్షత్రం (పంగుణి ఉత్తరం) నాడు వస్తుంది.
ఈ దినం శబరిమలలో అష్టాదశ సోపానాలపై విరాజమానమై ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి వారికి ఏకాదశ రుద్రాభిషేకం , మరియు విశేషపూజారాధనలు వైభవంగా జరుపుతారు.
దీనిని *'కళ్యాణ వ్రతం'* అని కూడా అంటారు.
మీనాక్షీ సుందరేశ్వరుల కళ్యాణం , గోదా (ఆండాళ్) కళ్యాణం , వల్లీ , సుబ్రహ్మణ్యుల కళ్యాణం , అర్జునుని జన్మదినం , పరమేశ్వరుడు మన్మథునికి పునర్జన్మనిచ్చిన దినం ఇవన్నీ ఉత్తరానక్షత్రం
నాటి విశేషాలేనని పురాణాలు పేర్కొంటున్నాయి.
భక్తులు శ్రీ రామనవమి పర్వదినాన శ్రీమద్రామయణం లోని శ్రీ రామ జనన ఘట్టాన్ని
పారాయణం చేసేలా , గోకులాష్టమి పర్వదినాన శ్రీ మద్భాగవతం లోని శ్రీ కృష్ణ పరమాత్మ
అవతార ఘట్టాన్ని పారాయణం చేసేలా శ్రీ శాస్తావారి అవతారదినమైన ఉత్తరా నక్షత్రదినాన ,
స్కాంధపురాణంలోని శ్రీ హరిహరపుత్ర అవతార ఘట్టాన్ని పారాయణ చేయవచ్చుననీ ,
ఈశ్లోకాలు పారాయణం చేసేవారికి , సకాలంలో వివాహం , పుత్ర సంతాన ప్రాప్తి , జీవిత సుఖశాంతులు మున్నగు శుభ ఫలితాలను ఆ అయ్యప్ప స్వామి వారు ప్రసాదిస్తారనీ పలుమార్లు శబరిమల యాత్ర చేసిన తమిళనాడు తిరునల్వేలికి చెందిన బ్రహ్మశ్రీ ఆండి వాద్యార్ గురుస్వామి గారు చక్కగా తమ అభిప్రాయాన్ని సెలవిచ్చియున్నారు.
ఏకాదశి , శనివారాలు , కృత్తికా నక్షత్ర దినాలలో ఉపవాస వ్రతమున్నట్టే తమిళనాడులో పలుప్రాంతాలలో భక్తులనేకులు అనాదిగా ,
ప్రతి మాసం ఉత్తరానక్షత్ర వ్రతాలు , పూజలు , భజనలు చేసే ఆచారమున్నది.
మన రాష్ట్రంలో కూడ పలు ప్రాంతాలలోను కొన్నిదేవాలయాలలోను ఉత్తరా నక్షత్ర మాస పూజలు నిర్వహిస్తున్నారని తెలుస్తున్నది.
ఈ ఉత్తరా నక్షత్ర ఉపవాసవ్రతం , ఆచరించడానికి మాలధారణ చేయనవసరం లేదు.
ఈ వ్రతాన్ని ఏ వయసులోనున్న స్త్రీలైనా చేయవచ్చును. ఆ శబరిగిరి నాథుని పై సంపూర్ణ విశ్వాసముంచి వ్రతం చేయడమే ముఖ్యం.
సంతానం లేనివారికి సత్సంతానం ,
అవివాహితులకు వివాహం , నిరుద్యోగులకు ఉద్యోగం , అనారోగ్యుల కారోగ్యం , వారి వారి
కోరికలను కోరినంతగా ఆ స్వామి అనుగ్రహం పొందవచ్చును.
దేశవ్యాప్తంగా ఈ వ్రతాన్ని
అనుష్ఠించిన భక్తులనేకులు , సత్ఫలితాలనేకం పొందిన గాథలు ఉన్నాయి. ప్రత్యేకంగా , రాష్ట్ర
వ్యాపిత అయ్యప్ప దేవాలయ నిర్వాహకులు శ్రీ స్వామి వారి జన్మ నక్షత్ర పూజావ్రతం *(ఉత్తరా నక్షత్ర వ్రతం)* లోని పరమార్ధ తత్వాన్ని , తమదేవాలయానికి వచ్చే భక్తులకు తెలిపి ,
వారిని ఉత్సాహ పరచి ఉత్తరా నక్షత్ర దినం నాడు అయ్యప్ప ఆలయాలలో వారిచే పారాయణ ,
విశేషపూజలు నిర్వహిస్తే దీనికి మరింత ప్రచారం లభించి మరింత భక్తులు ధన్యులౌతారు.
ఇది కేవలం భక్తులకు మాత్రమే కాక ఆయా దేవాలయాల్లో కొలువై వున్న మూర్తి మంతానికి
కూడా చైతన్యాభి వృద్ధి కలుగచేస్తుందనటం అతిశయోక్తికాదు..
No comments:
Post a Comment