Adsense

Wednesday, June 15, 2022

శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవాలయం : అయినవిల్లి (తూర్పుగోదావరి)


💠 స్వయంభూ గణపతి క్షేత్రాలలో 'అయినవిల్లి' ఒకటి.
కృతయుగం నుండే నెలకొని ఉన్నట్లుగా చెప్పబడుతున్న ఈ స్వయంభూ గణపతి అత్యంత మహిమాన్వితుడు. పవిత్రకోనసీమలో అయినవిల్లి గ్రామంలో స్వయంభువుగా నెలకొనియున్నది శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవాలయం. 
దక్షప్రజాపతి దక్షయజ్ఞం నిర్వర్తించేముందు విఘ్న వినాయకుడైన ఈ వినాయకుని పూజించి, పునీతుడైనట్లు క్షేత్రపురాణం తెలుపుతోంది. 
వ్యాసమహర్షి దక్షిణ దేశయాత్ర ప్రారంభంలో పార్వతీ తనయుణ్ణి ప్రతిష్టించాడని మరొక కథ వ్యాప్తిలో ఉంది. 

💠 అమలాపురానికి 12 కి.మీ దూరంలో ఉన్న అయినవిల్లి గ్రామంలో వెలపి ఉన్న సిద్ధివినాయకస్వామి గురించి ఆంధ్రప్రదేశ్‌లో తెలియని వారుండరు. 

💠 ఈ సిద్ధివినాయకుని భక్తిగా తలచుకుని ఏ కార్యం తలపెట్టినా జయప్రదంగా నెరవేరుతుందని భక్తుల నమ్మకం. 
ఈ అయినవిల్లి గణపతికి గరిక పూజలన్నా, కొబ్బరికాయ మొక్కులన్నా ఎంతో ఇష్టం. అందుకే ఈ క్షేత్రం గరిక పూజలకు, కొబ్బరికాయ మొక్కులకు పెట్టిన పేరయింది. 
ఏటా ఇక్కడకొచ్చే భక్తులు తమ మొక్కుల రూపంలో స్వామికి సమర్పించే కొబ్బరికాయల సంఖ్య దాదాపు ఇరవై లక్షలు దాటే ఉంటుందంటే నమ్మబుద్ధి కాదు.
 కానీ ఇది నిజం అని ఈ సిద్ధివినాయకుడు తన కృపాకటాక్షాలతో భక్తుల కోరికలు తీరుస్తూ ప్రతి సంవత్సరం నిరూపిస్తూనే ఉన్నాడు. 

💠 దక్షిణాంధ్రలో 'కాణిపాకం' ప్రసిద్ధి చెందినట్లు ఉత్తరాంధ్రలో అయినవిల్లి ప్రసిద్ధి చెందింది. 
కృతయుగం నుండే నెలకొని ఉన్నట్లుగా చెప్పబడుతున్న ఈ స్వయంభూ గణపతి అత్యంత మహిమాన్వితుడు. 
అయినవిల్లిలోని సిద్ధివినాయకుడు స్వయంభువుడు. 
ఈయన కాణిపాకం వినాయకుడి కంటే ముందే ఇక్కడ కొలువై ఉన్నాడని చెబుతారు. 
అసలు కాణిపాకం  పుణ్యక్షేత్రం కావడానికి ఈ అయినవిల్లి సిద్ధివినాయకుడే కారణమని స్థలపురాణం చెబుతుంది.

💠 ఇక్కడ నిత్యం లక్ష్మీగణపతి హోమం చాలా ఏళ్లుగా జరుగుతూ ఉంది. 
అదే విధంగా ప్రతి ఏడాది లక్షల సంఖ్యలో స్వామివారికి పెన్నులతో అభిషేకం చేయించి వాటిని విద్యార్థులకు అందజేస్తారు. 
ఇంతటి విశిష్టమైన అయినవిల్లి సిద్ధివినాయకుడికి సంబంధించిన కథనం మీ కోసం.

💠 పూర్వం ఈ ప్రాంతంలో మల్లాది బాపన్నావధులు అనే గొప్ప పండితుడు ఉండేవాడు. ఆయన స్వర్ణగణపతి మహాయాగం నిర్వహించాలనుకొన్నాడు.
యాగం చివరిలో అనుకొన్న ప్రకారమే యాగం నిర్విఘ్నంగా పూర్తవుతూ వస్తోంది. అయితే యాగం చివరి రోజున సమర్పించే పూర్ణాహుతి ద్రవ్యాన్ని స్వర్ణమయ కాంతులతో వెలిగే గణపతి తన తొండంతో అందుకోవాలని ఆమల్లాది బాపన్నావధులు వినాయకుడి వేడుకొన్నాడు. 

💠 పరమ భక్తుడైన మల్లాది బాపన్నావధుల కోరికను తీర్చడానికి యాగం చివరి రోజున వినాయకుడి ఇక్కడ వారికి దర్శనమిచ్చాడు.
 అయితే ఆ సమయంలో ఆయాగంలో పాల్గొన్న ముగ్గురు వినాయకుడి రూపాన్ని చూసి నవ్వడమే కాకుండా అవహేలనగా మాట్లాడారు.
దీంతో వచ్చే జన్మలో వారు గుడ్డి, చెవిటి, మూగవాళ్లుగా పుడతారని ఆ వినాయకుడు శాపం పెట్టాడు. దీంతో భయపడిన వారు తమ తప్పును మన్నించాల్సిందిగా వేడుకొన్నారు. కరుణామయుడైన వినాయకుడు మీ వల్ల నా స్వయంభు విగ్రహం భక్తులకు దర్శనమిస్తుందని అప్పుడు మీరు శాపం నుంచి విముక్తులవుతారని చెప్పాడు.

💠 అక్కడి పండితుల విన్నపం మేరకు స్వామి వారు అయినవిల్లిలో సిద్ధి వినాయకుడిగా కొలువై ఉండిపోయాడు. 
ఆ ముగ్గురే తరువాతి జన్మలో కాణిపాకం వద్ద గుడ్డి, చెవిటి, మూగవారిగా జన్మించారని చెబుతారు. 
ఇలా అయినవిల్లి సిద్ధి వినాయకుడు కానిపాకం వినాయకుడి కంటే ఎన్నో ఏళ్ల ముందు నుంచి ప్రజల చేత నీరాజనాలు అందుకొంటున్నట్లు స్థానిక పురాణ కథనం.
 ఇదిలా ఉండగా దక్షప్రజాపతి తాను యాగం ప్రారంభించే ముందు ఇక్కడి వినాయకుడినే ప్రార్థించినట్లు కూడా చెబుతారు.

💠 భాద్రపద శుద్ధ చవితినుండి తొమ్మిది రోజులపాటు ఉత్సవాలను నిర్వహిస్తారు. మహాశివరాత్రినాడు విశ్వేశ్వరునికి లింగోద్భవకాల రుద్రాభిషేకం, జ్యోతిర్లింగార్చన చేయబడతాయి.

💠 వినాయకచవితి రోజున రకరకాల పండ్లరసాలతో స్వామివారికి ప్రత్యేక అభిషేకం నిర్వహిస్తారు.
 ప్రతి సంవత్సరం మాఘశుద్ధ సప్తమి పర్వదినాన దేశంలోని సప్త జీవనదుల(గంగ, యమున, గోదావరి, సరస్వతి, నర్మద, సింధు, కావేరి) జలాలతో సప్తనదీ జలాభిషేకం చేస్తారు. 

💠 ముఖ్యమైనది ఏమిటంటే.. ప్రతియేటా విద్యార్థుల కోసం జరిగే వార్షిక పరీక్షల ముందు ఫిబ్రవరి 2,3 వారాలలో దాదాపు లక్ష పెన్నులతో శ్రీ స్వామివారికి అభిషేకం చేసి, వాటిని విద్యార్థులకు ప్రసాదంగా బహూకరించడం ఈ ఆలయం ప్రత్యేకత. 
ఈ పెన్నులతో పరీక్ష రాస్తే తప్పకుండా మంచి మార్కులతో పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తామని విద్యార్థుల విశ్వాసం.

No comments: