Adsense

Tuesday, June 14, 2022

శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయం, జూబ్లీహిల్స్, హైదరాబాద్


💠   ప్రసిద్ధ జూబ్లీహిల్స్ పెద్దమ్మ దేవాలయాన్ని సందర్శించకుండా హైదరాబాద్ పర్యటన అసంపూర్తిగా ఉంటుంది .ఈ ప్రసిద్ధ ఆలయం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని రోడ్ నంబర్ 55లో ఉంది.

💠 పెద్దమ్మ దేవి విగ్రహం (అంటే తల్లుల తల్లి) చూడడానికి చాలా అద్భుతంగా , అందంగా ఉంటుంది. 

💠 హైదరాబాద్ నగరంలోని ప్రముఖ ఆలయాలలో శ్రీ పెద్దమ్మ దేవాలయం ఒకటి. ఈ ఆలయం చాలా పురాతనమైనదిగా చెబుతారు. అంతేకాకుండా అతి పెద్ద దేవాలయాలలో ఇది  ఒకటిగా చెబుతారు. మరి ఈ ఆలయ నిర్మాణం ఎప్పుడు జరిగింది ?
 ఆలయంలో అమ్మవారు ఎలా వెలిశారు? 
ఇంకా ఆలయ విశేషాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

💠 జూబ్లీహిల్స్ పెద్ద‌మ్మ త‌ల్లి భ‌క్తుల కొంగు బంగారం. క‌రుణించి వ‌రాలిచ్చే త‌ల్లి.  ఆ పెద్ద‌మ్మ‌ను ఏటా ల‌క్ష‌లాది మంది భ‌క్తులు దర్శించుకుంటారు. ముడుపులు చెల్లించుకుంటారు. కొత్త మొక్కులు మొక్కుతారు. ఎల్ల‌వేళ‌లా కాపాడ‌మ‌ని కోర‌తారు. ఆమె గుడి వెనుక ఒక క‌థ దాగి ఉంది. క‌థ అనేక‌న్నా పురాణ‌గాధ దాగి ఉంది. 

💠 మహిషాసురుడనే రాక్షసుడు ముల్లోకాల్నీ పీడించేవాడు. యజ్ఞయాగాదుల్ని నాశనం చేసేవాడు. రుషి పత్నుల్ని చెరబట్టేవాడు. ఇంద్రాదులను తరిమి కొట్టేవాడు. త్రిమూర్తులు కూడా ఆ ధాటికి తట్టుకోలేకపోయారు. 
పాహిమాం అంటూ శక్తిస్వరూపిణి అయిన అమ్మవారిని ఆశ్రయించారు. మహిషుడేం సామాన్యుడు కాడు. మహా బలవంతుడు. అందులోనూ, వరగర్వంతో విర్రవీగుతున్నాడు. మహాశక్తి ముందు రాక్షసశక్తి చిన్నబోయింది. అంతిమ విజయం అమ్మవారిదే. ఆ సుదీర్ఘ పోరాటంలో అలసి సొలసిన మహాశక్తికి కాస్తంత విశ్రాంతి అవసరమనిపించింది. దుర్గమమైన అడవుల్లో బండరాళ్ల మధ్య కొద్దిరోజులు సేదతీరింది. అదే జూబ్లీహిల్స్‌లో ప్రస్తుతం పెద్దమ్మ దేవస్థానమున్న ప్రాంతమని స్థానిక ఐతిహ్యం. 

💠 ఈ ఆలయ ప్రవేశద్వారం స్వాగతిస్తున్న దేవతామూర్తితో సాక్షాత్కరిస్తుంది. 
ఆలయ రాజగోపురం ప్రవేశ ద్వారంపై ఉన్న పెద్దమ్మ తల్లి మూర్తి చూడగానే ఆకట్టుకుంటుంది. ఎడమచేతి వైపు ఉన్న పెద్దమ్మ తల్లి చిన్న గుడి సుమారు 150 సంవత్సరాల చరిత్ర గల మూల గుడి అంటారు.

💠 ఇక్కడి "అమ్మవారు పూర్వకాలంలో పల్లెవాసాలకు దగ్గరగా వుండి గ్రామదేవతగా పూజలు అందుకుంటూ వుండేదట. 
వేట జీవనంగా బతికే ఆ అమాయకులు తమ కులదేవత పెద్దమ్మ తల్లిని భక్తితో కొలిచేవారు. మంచి జరిగితే, నైవేద్యాలిచ్చి అమ్మ సమక్షంలో సంబరాలు జరుపుకునేవారు. చెడు జరిగితే, జంతు బలులతో తల్లికి శాంతులు జరిపించేవారు. కాలప్రవాహంలో ఆ తెగలు అంతరించిపోయాయి. 

💠 జూబ్లీహిల్స్‌ అత్యంత ఖరీదైన ప్రాంతంగా మారింది. కానీ, అలనాటి అమ్మతల్లి ఆనవాళ్లు మాత్రం మిగిలాయి. రెండున్నర దశాబ్దాల క్రితం దాకా ఇక్కడో చిన్న ఆలయం ఉండేదట. ఎవరైనా వచ్చి వెలిగిస్తే దీపం వెలిగేది, లేదంటే లేదు. ఆ సమయంలో… రాత్రిళ్లు అమ్మ అడుగుల సవ్వడులు వినిపించేవని స్థానికులు చెబుతారు. భక్తులకు కల్లో కనిపించి తనకో ఆలయాన్ని నిర్మించమని ఆదేశించిందట.
ఈ ఆలయంలో ఐదు అంతస్థుల గర్భగుడి, ఏడంతస్తుల రాజగోపురం, కల్యాణమండపం, వసతిగృహములు, శ్రీ గణపతి, లక్ష్మి, సరస్వతి దేవాలయాలు ఉన్నాయి.
 
💠 ఆలయ ప్రాంగణంలో ధ్వజస్థంభం ఉంది. అయితే ధ్వజస్థంభం ముందు ఉన్న పీఠం మధ్యభాగాన రూపాయి బిళ్ళను అంచుమీద పడిపోకుండా నిలబెట్టగలిగితే మనసులో అనుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. 

💠 ధ్వజస్థంభానికి ఇరుపక్కల పోతురాజు విగ్రహ మూర్తులు ఉన్నారు. అమ్మగుడి ప్రాకారాలపై అష్టాదశ హస్తాలతో సత్కారించే దేవతామూర్తి ఉన్నారు. గర్భాలయంలో పెద్దమ్మతల్లి చతుర్భుజాలతో, విశాల నేత్రాలతో, ఎడమవైపు చేతులతో శంఖం, ప్రత్యేక త్రిశూలం, కుంకుమభరిణితోనూ, కుడివైపు చేతులలో చక్రం, ఖడ్గంతో దర్శనమిస్తుంది.

💠  పెద్దమ్మ తల్లికి ప్రతి శుక్రవారం ప్రత్యేక అభిషేకములు, ఆశ్వియుజ శుద్ధ పాడ్యమి మొదలు విజయదశమి వరకు దసరా నవరాత్రులు, ఆషాఢశుద్ధ సప్తమి నుండి నవమి వరకు శంకబారి ఉత్సవములు మరియు మాఘ శుద్ధ పంచమి మొదలు సప్తమి వరకు వార్షిక రథోత్సవములు జరుపబడును. అయితే రథసప్తమి రోజు రథము ఊరేగింపు కన్నుల పండుగగా జరుపుతారు.

💠 ఈ ఆలయంలో ఐదు ప్రధాన ఉత్సవాలను చాలా ఘనంగా నిర్వహిస్తారు. 
ఇవి బ్రహ్మోత్సవాలు, బోనాలు , శాకాంబరి ఉత్సవాలు, దసరా నవరాత్రులు మరియు శరన్నవరాత్రులు.
 ఈ ఉత్సవాల సమయంలో ఆలయం జనాలతో కిటకిటలాడుతూ ఉంటుంది.

💠 ఈ ఆలయం చుట్టూ సినీ పరిశ్రమకు చెందిన పలు నిర్మాణ సంస్థలు, స్టూడియోలు ఉండటం వలన ముహూర్తాలు, సినిమా ప్రారంభోత్సవాలవంటి కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించడం సెంటిమెంటుగా చేస్తుంటారు.

💠 తెలంగాణ రాష్ట్ర  ప్రభుత్వం తరుఫున ప్రతి సంవత్సరం బోనాల పండుగను ఘనంగా చేస్తున్నారు .

No comments: