Adsense

Tuesday, June 14, 2022

శ్రీ చిత్రగుప్తుడు ఆలయం, కందికల్ గేట్, హైదరాబాద్


💠 మనుష్యుల పాప పుణ్యాలను అనుసరించి  శిక్ష విధించడం యమధర్మరాజు విధి అని మన పురాణాల్లో చెప్పబడిన విషయం తెలిసిందే. ఆ యముడికి భారత దేశంలో అక్కడక్కడా దేవాలయాలు ఉన్నాయి. వీటిని వేళ్లమీద లెక్కపెట్టవచ్చు.
ఎందుకంటే యమధర్మరాజు ప్రాణాలు తీసే వాడని ప్రజలు నమ్ముతారు. ఆయన నుంచి ఎంత దూరం ఉంటే అంత మంచిదని భావిస్తుండటం వల్ల యమధర్మరాజుకు ఆలయాలు చెప్పుకోదగ్గ సంఖ్యలో లేవు. ఇదిలా ఉండగా ఈ విశ్వంలో కోట్లాది జీవుల పాపపుణ్యాలను యమధర్మరాజు ఒక్కడే లెక్కగట్టలేడు కదా. ఆయనకు ఈ విషయంలో సహకారం అందించడానికి ఉన్న వ్యక్తి చిత్రగుప్తుడు.

💠 మనుషులు తెల్లవారి లేచిన దగ్గర్నుంచి పడుకునే వరకు పాపాలు చేస్తుంటాడు. ఈ పాపాలు ఎవరూ చూడరు అనుకుంటారు, కానీ ఇదంతా భ్రమ. మనలోనే ఓ ప్రాణి దాగి ఉంది. ఆ ప్రాణిని సృష్టించింది సృష్టికర్త బ్రహ్మ. మనం చేసే ప్రతి పాపపు పనికీ లెక్క కట్టి చిట్టా తయారు చేస్తుంది. ఆ ప్రాణి పేరే చిత్రగుప్త అని గరుడ పురాణం చెబుతుంది. 

💠 పురాణపరిచయం పెద్దగా లేని ఈ యువతరంలో కూడా చలనచిత్రాల పుణ్యమా అని బాగా తెలిసిన పౌరాణిక పాత్ర చిత్రగుప్తుడు. యముడికి ధర్మనిర్వహణలో సహాయకుడిగా, భూలోకవాసుల మరణానంతరం వారి పాప పుణ్యాలకు పద్దులు రాసే వ్యక్తిగా చిత్రగుప్తుడు అందరికీ తెలుసు. 

💠 ఈ నేపథ్యంలో గరుడ పురాణంలోని చిత్రగుప్తుడి జననంతో పాటు ఆయన ఆలయాల గురించి కథనం మీ కోసం

💠 ఈ విశ్వం ప్రారంభం తర్వాత భూలోకంలోని జీవులు చనిపోయినప్పుడు వారి ఆత్మలు స్వర్గానికి లేదా నరకానికి వెళ్లేవి. ఇలా వెళ్లిన ఆత్మల పాపాలను నిర్ణయించడంలో యమధర్మరాజు కొంత గందరగోళానికి గురయ్యేవాడు. ఎందుకంటే ఎవరు ఎంత పాపం చేసింది సరిగా నిర్ణయించలేకపోయేవాడు. దీంతో తన ఇబ్బందిని యమధర్మరాజు సృష్టికర్త అయిన అయిన బ్రహ్మకు విన్నవించాడు. దీంతో సమస్య పరిష్కారం కోసం కొద్దికాలం బ్రహ్మ యోగనిద్రలోకి వెళ్లాడు.

💠 కళ్లుతెరిచిన తర్వాత ఆయనకు ఎదురుగా ఓ ఆజానుబాహుడు కనిపించాడు. చేతిలో పుస్తకం, ఘటం (పెన్ను), నడుముకు కత్తి ఉంటాయి. తర్వాత తన దివ్యద`ష్టితో జరిగిన విషయం తెలుసుకొంటాడు. ఆ వ్యక్తి తన చిత్తం (శరీరం)లో గుప్తంగా (గుప్తంగా) నివాసమున్నవాడని అర్థమవుతుంది.

💠 అతనికి చిత్రగుప్తుడని పేరుపెడతాడు. అటు పై నీవు ఈ విశ్వంలోని ప్రతి జీవిలో రహస్యంగా ఉంటూ వారి మంచి చెడులను గూర్చి తెలుసుకొంటూ ఉంటావు. 
ఈ విషయాలన్నీ యమధర్మరాజుకు చెబుతూ పాపాత్ములకు శిక్షలు పడేవిధంగా సహాయపడుతావని చెబుతాడు.
అంతేకాకుండా ఏక కాలంలో కొన్ని కోట్ల రూపాలను ధరించే శక్తి కూడా నీకు ఉంటుందని బ్రహ్మ చిత్రగుప్తుడికి వరమిస్తాడు. అంతేకాకుండా చిత్రగుప్తుడికి ఈ విషయంలో సహాయపడటానికి కొంతమంది సహాయకులుగా కూడా ఉంటారు.

💠 వారిలో  బ్రహ్మమానసపుత్రులైన శ్రవణులు. శ్రవణులు ఈ భూలోకం పైనే కాకుండా పాతాళ, మత్స్య, స్వర్గ లోకాల్లో కూడా వివహరిస్తూ జీవుల పాప పుణ్యాలను ఎప్పటికప్పుడు చిత్రగుప్తుడికి తెలియజేస్తూ ఉంటారు.
అందువల్లే ఈ విశ్వంలోని జీవుల పాపపుణ్యాలను చిత్రగుప్తుడు ఖచ్చితంగా నిర్ణయించగలుగుతున్నాడని గరుడ పురాణం చెబుతోంది.

💠 చిత్రగుప్తుడి కి కూడా గుడులు  ఉన్నాయంటే ఆశ్చర్యమే. మన దేశంలో ఉత్తరప్రదేశ్, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు కంచిలో  చిత్రగుప్తుడికి గుడులు ఉన్నాయి

💠 తెలంగాణలో కూడా చిత్రగుప్తుడి దేవాలయం కేవలం ఒకే ఒకటి ఉంది.  ఇంత అరుదైన దేవాలయం హైదరాబాద్ పాతబస్తీ కందికల్ గేట్ ప్రాంతంలో ఉంది.

💠 చిత్రగుప్తుని సంస్కృతంలో కాయస్త్ అంటారు.చిత్రగుప్తుడు హిందువులలోని కాయస్త్ కులానికి చెందినవాడిగా అందరూ భావిస్తుంటారు. కాయస్తుల కులదైవం కూడా చిత్రగుప్తుడే.

💠 చిత్రగుప్తుడి పూజలో ఉపయోగించే వస్తువులు విచిత్రంగా ఉంటాయి. 
అవి పెన్ను, పేపరు, ఇంక్, తేనె, వక్కపొడి, అగ్గిపెట్టె, చెక్కెర, గంధం, చెక్క ఆవాలు, నువ్వులు, తమల పాకులు. 
న్యాయం, శాంతి, అక్షరాస్యత, విజ్ఞానం ఈ నాలుగు గుణాలు పొందడానికి చిత్రగుప్తుడిని పూజిస్తారు.

💠 ఈ ఆలయంలో దీపావళి రెండో రోజు మాత్రమే ఘనంగా జరిగే ఉత్సవం తప్పించి మామూలు రోజుల్లో కూడా పెద్దగా పూజలు జరగవు అని తెలుస్తుంది. దీపావళి రెండో రోజు యమద్వితీయ సందర్భంగా, ఆ రోజు చిత్రగుప్తుడి పుట్టినరోజు నిర్వహించే ఆచారం కొనసాగుతుంది. ఆయనకు విశేషపూజలను చేస్తారు. దీన్నే భాయ్ దూజ్ అంటారు.

💠 చిత్రగుప్తుడికి ఇష్టమైన రోజు బుధవారం అని దేవాలయ పూజారులు చెప్తున్నారు. ఇచ్చట అభిషేకం, ప్రత్యేక పూజలు జరుపుతున్నారు. అకాల మృత్యువును జయించడానికి మాత్రమే కాదు ఆరోగ్యం, చదువు, పెళ్ళి, సంతానం ఇలా అనేక సమస్యలకు పరిష్కారం కోసం భక్తులు ఈ దేవాలయాన్ని దర్శించుకుంటున్నారు.
 కేతుగ్రహ దోష నివారణకు కూడా ఈ దేవాలయంలో పూజలు జరుగుతుంటాయని ఇచ్చటగల మరో పూజారీ తెలిపారు. ఈ దేవాలయానికి భక్తులు సంఖ్య అంతంత మాత్రమేనని తెలుస్తుంది.

No comments: