💠 తిరుపతి అనగానే మనకు గుర్తుకువచ్చేది చిత్తూరు జిల్లాలోని తిరుమల తిరుపతి.
💠 అయితే తూర్పు గోదావరి జిల్లాలోని పెద్దాపురం దగ్గరలో ఇంకో తిరుపతి వుందని అదే తొలి తిరుపతి అని చాలా మందికి తెలియదు.
💠 దేశంలోని నూట ఎనిమిది శ్రీ వైష్ణవ దివ్యదేశాల కంటే మిక్కిలి పురాతనమై , పరమ పవిత్రమైన చిరుమందహాస చిద్విలాస రూపం కల ఆలయం ఇక్కడి...
శ్రీ శృంగార వల్లభ స్వామి ఆలయం.
💠 శోభాయమానంగా స్వయంభువుగా కొలువుదీరిన దేవాలయానికి ద్వాపరయుగం 9000 (తొమ్మిది వేల సంవత్సరాల చరిత్ర వుందని చాలా మందికి తెలియదు.)
💠 తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట నుంచి కిర్లంపూడి వెళ్ళేదారిలో దివిలికి ఒక కిలోమీటరు దూరంలో తొలి తిరుపతి అనే ఊరు ఉంది.
సామర్లకోట నుంచి ఇక్కడికి 12 కిలోమీటర్లు.
గుడికి బయట ఒక ఫ్లెక్సీ బోర్డ్‌మీద తొమ్మిదివేల సంవత్సరాల పురాతనమైన దేవాలయం ఇది అని రాసి ఉంటుంది.
దేవాలయం పురాతనంగానే కనిపిస్తుంది కానీ మరీ అంత పాతది కాదేమో అనే సందేహంకూడా కలుగుతుంది.
కొతమంది అభిప్రాయం ప్రకారం కలియుగం మొదలై సుమారు 5000 సంవత్సరాలు అయ్యిందని.
అంటే ఈ దేవాలయం ద్వాపరయుగం నాటిదన్నమాట!
💠 విష్ణుమూర్తి శిలా రూపంలో మొదట ఇక్కడే వెలసినందుకు ఈ తిరుపతిని తొలి తిరుపతి అని పిలుస్తారు ...
స్వయంభువుగా స్వామి వారు వెలసిన ప్రతి చోటా ఆళ్వారులు వుంటారు అలాగే ఇక్కడ కూడా గర్బాలయం పక్కన ఎడమ వైపు ఆళ్వారుల విగ్రహాలు వున్నాయి.
🔔 స్థలపురాణం
💠 తొలితిరుపతి దేవాలయం యొక్క స్థలపురాణం ప్రకారం ఈ ప్రదేశం ఒకప్పుడు కీకారణ్యంగా ఉండేదని, దృవుడు ఇక్కడ విష్ణుమూర్తికోసం తపస్సుచేశాడని చెపుతారు. ఇక్కడొక చిన్న లింక్ మిస్సయ్యింది.
దృవుడు తపస్సుచేసిన మధూవనం యమునా నది సమీపంలో ఉంటుందని పురాణంలో చెప్పబడి ఉంది.
కానీ ఇక్కడ యమునా నది లేకపోవడమే మిస్సయిన లింకు.
💠దృవుడి కథ విష్ణు పురాణంలో ఉంటుంది.
ఉత్తానపాదుడనే రాజుగారికి సురుచి, సునీతి అనే ఇద్దరు భార్యలు ఉంటారు.
ఆయనకి సునీతి ద్వారా దృవుడు, సురుచి ద్వారా ఉత్తముడు అనే కుమారులు కలుగుతారు.
రాజుగారికి సురుచి అంటే ప్రేమ మెండు. అమెకీ, ఆమె కుమారుడికీ ముద్దుమురిపాలన్నీ దక్కేవి.
💠 ఒకరోజు ఉత్తముడు తండ్రి ఒడిలో కూర్చొని ఉండగా చూసిన దృవుడు తానుకూడా తండ్రి ప్రేమను అదేవిధంగా పొందాలని భావించి ఒడిలోని ఎక్కబోతుండగా అతని సవతి తల్లి సురుచి అతడిని నిందిస్తుంది.
బాధపడుతున్న దృవుడిని చూసి తల్లి సునీతి విష్ణువుని గూర్చి తపస్సు చేసి తండ్రి ప్రేమని పొందే వరంకోరుకోమంటుంది.
💠 అప్పుడు దృవుడు యమునా నది తీరంలో ఉన్న మధూవనం అనే ప్రదేశానికి వెళ్ళి తపస్సుచేసి విష్ణువుని ప్రసన్నం చేసుకొంటాడు.
పిల్లవాడైన దృవుడు దేవుడి తేజస్సుచూసి భయపడ్డాడని, అప్పుడు విష్ణువు దృవుడి అంత పొడవుతో కనిపించి, చిరునవ్వుతో అతని చెంపలు నిమిరాడని, ఆకారణంగానే ఇక్కడిస్వామి చిరునవ్వులు చిందిస్తూ శృంగార వల్లభ స్వామిగా పిలవబడుతున్నారు.
💠 ఆలయ ప్రవేశ ద్వారం వద్ద గచ్చు మీద ఉన్న పుష్పం పై నుంచుని చూసిన వాళ్ళు ఎంత ఎత్తులో వుండి చూస్తే అంత ఎత్తులోనే దర్శనమిస్తాడు (చిన్న వాళ్లకు చిన్నవాడిగా పెద్దవాళ్ళకు పెద్ద వాడిగా)
💠 శృంగార వల్లభ స్వామి అంటే వేంకటేశ్వరుడే.
అన్నిచోట్లా ఆయన కుడిచేతిలో శంఖం, ఎడమచేతిలో చక్రం ఉంటాయి.
కానీ, ఈ దేవాలయంలో అవి అది ఇటు, ఇది అటు మారి ఉంటాయి.
💠 మరొక ప్రత్యేకత ఇది. స్వామివారి దేవేరులైన శ్రీదేవిని నారదమహర్షి, భూదేవిని శ్రీకృష్ణదేవరాయలు ప్రతిష్టించారట. స్వామివారికి వెండితొడుగు విక్టోరియా మహారాణి భహూకరించినదట.
దేవాలయానికి వెనుకవైపు ఉన్న నూతిలో నీటిని తలపై జల్లుకొని, స్వామివారిని కోరుకొంటే, ఆయా కోరికలన్నీ నెరవేరుతాయట. శృంగార వల్లభ స్వామికి పటికబెల్లం అంటే ఇష్టంకాబట్టి కోరికలు నెరవేరిన భక్తులు పటికబెల్లాన్ని స్వామివారికి సమర్పిస్తారు.
💠ఆ అరణ్య ప్రాంతం లో వెలిసిన స్వామి ఎండకు ఎండి వానకు తడవడం చూసి దేవతలే స్వయంగా స్వామికి ఆలయాన్ని నిర్మించారు.
💠ఆ తరువాత శ్రీ లక్ష్మీ దేవి వారిని - నారద మహర్షి ప్రతిష్టించారట. తరువాత శ్రీ కృష్ణ దేవరాయల వారు భూదేవి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించారు (దీనికి శిలా శాసనాలే ఆధారం).
🔅 ఆలయ విశిష్టత :
👉 1) చిద్విలాస వేంకటేశ్వరుడు (నవ్వుతున్నట్టుగా వుండే విగ్రహం )
👉 2) విగ్రహం చిన్న పిల్లలకు చిన్నగానూ పెద్దవారికి పెద్దగానూ (ఎంత ఎత్తులో ఉండేవారికి అంతే ఎత్తులో కన్పిస్తుంది )
👉 3) తిరుమల తిరుపతి వేంకటేశ్వరుని విగ్రహానికి పూర్తి విభిన్నంగా శంఖ – చక్రాల స్థానం మారి వుంటాయి
👉 4) ఆలయ ప్రాంగణం లోనే శివాలయం వైష్ణవాలయం రెండూ వున్నాయి.
👉 5) సంతానం లేని దంపతులు ఆలయం వద్ద నూతిలో స్నానం చేసిన సంతాన ప్రాప్తి లబిస్తుంది.
👉 6) ఏకశిలా కళా ఖండాలు... విగ్రహమూర్తి .. ఉత్సవ మూర్తి ప్రదాన ఆకర్షణ.
No comments:
Post a Comment