💠 హిందువుల ఆరాధ్య దైవమైన పరమేశ్వరుడికి సంబంధించిన ఎన్నో ప్రముఖ శైవ క్షేత్రాలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఉన్నాయి.
వీటిని సందర్శించేందుకు అనేక ప్రాంతాల నుంచి భక్తులు ప్రతి నిత్యం వస్తుంటారు.
ముఖ్యంగా శివుడికి ఎంతో ప్రీతి పాత్రమైన కార్తీక మాసం, శివరాత్రి పర్వదినాల్లో భక్తులు వీటి సందర్శనకు అధిక ప్రాధాన్యత ఇస్తారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే కొన్ని ప్రత్యేక శైవ క్షేత్రాలు ఉన్నాయి.
వాటినే పంచారామాలు అని అంటారు.
💠పరమేశ్వరుడి ఆత్మలింగం కలిగిన క్షేత్రాలుగా వీటికి ప్రాముఖ్యత ఉంది.
ఈ పంచారామాల్లో ఒక ఆత్మలింగాన్ని కుమారస్వామి స్వయంగా ప్రతిష్టించినట్లు చెబుతారు.
తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోటలో ఉన్న ఆ పంచారామ క్షేత్రమే " కుమారరామ శ్రీ భీమేశ్వరస్వామి ఆలయం "
💠ఈ క్షేత్రం తూర్పుగోదావరి జిల్లా 'సామర్లకోట'లో ఉంది. ఇక్కడ స్వామి భీమేశ్వరుడు, అమ్మవారు బాలా త్రిపుర సుందరి.
ఈ కుమారారామ క్షేత్రంలో వామదేవ ముఖంతో, సత్యసుందర స్వరూపంతో కుమార స్వామి ప్రతిష్ఠించిన నీలకంఠుడు దర్శనమిస్తాడు.
💠సామర్లకోటకు సమీపంలోని భీమవరంలో ఈ క్షేత్రం కొలువుతీరింది. దీనికి ‘స్కంధారామమని’ మరొక పేరుంది. సామర్లకోటే ‘శ్యామల కోట’గా నాడు ప్రసిద్ధి పొందింది.
బొబ్బిలి యుద్ధంలో సామర్లకోట ప్రధాన పాత్ర పోషించిందని స్థానికులు చెబుతారు. శ్యామలాదేవి విగ్రహం ఇప్పుడు ఈ కుమారారామ భీమేశ్వరాలయంలో ప్రాకార దేవతగా కొలువై ఉంది.
💠 తారకాసుర సంహారం అనంతరం ఈ ప్రదేశంలో పడిన ఈ లింగాన్ని కుమార స్వామి ప్రతిష్టించాడు.
ఆయన ప్రతిష్టించిన కారణంగా ఈ ప్రాంతం కుమారేశ్వరంగా మారింది.
🌀 స్థల పురాణం :
💠 శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తారకాసురుడిని వధించిన అనంతరం రాక్షసుని కంఠంలోని ఆత్మ లింగం ఐదు ప్రదేశాలలో పడగా అవే పంచారామ క్షేత్రాలుగా విరాజిల్లుతున్నాయి.
💠 అమరావతిలోని అమరేశ్వరాలయం, ద్రాక్షారామంలోని శివక్షేత్రం, భీమవరంలోని సోమేశ్వరస్వామి, పాలకొల్లులోని క్షీరారామం, సామర్లకోటలోని ఈ కుమారారామం.
💠 సామర్లకోటలోని భీమేశ్వరాలయాన్ని చాళుక్య రాజయిన భీముడు నిర్మించాడని క్షేత్ర కథనంలో వివరించబడింది.
అందుకే ఇక్కడి క్షేత్రాన్ని " కుమారారామ భీమేశ్వర ఆలయం " అని పిలుస్తారు అని ఒక నమ్మకం.
ఈయనే ద్రాక్షరామ దేవాలయాన్ని కూడా నిర్మించాడు. అందువలనే ఈ రెండు గుళ్లు ఒకే రీతిలో ఉంటాయి. వినియోగించిన రాయి కూడా ఏక రీతిలో ఉంటుంది. నిర్మాణ శైలి కూడా అదే విధంగా ఉంటుంది. ఆలయం నిర్మాణం చాలా చక్కని శిల్ప కళ కలిగి ఇప్పటికీ పగుళ్ళు లేకుండా ఉంది.
💠 ఈ ఆవరణంలోని భీమగుండంలో స్నానం చేస్తే పాపహరణమే కాకుండా, అభీష్ట సిద్ధులు కూడా కలుగుతాయని భక్తుల విశ్వాసం.
💠 ఇక్కడి శివలింగం తెల్లని రంగులో ఉంది. సున్నపు రాయిచే నిర్మితమై శివలింగ ఆధారం క్రింది గదిలో వుండగా, లింగ అగ్రభాగం పై కప్పును చీల్చుకొని మొదటి అంతస్తు వరకుండును.
💠 దేవాలయం లోపలి ప్రాకారంలో వినాయకుడు, కాలభైరవుడు, వీరభద్రుడు, మహాకాళి, శనేశ్వరుడు, నవగ్రహాలు కొలువుతీరి కనిపిస్తాయి.
💠 గర్భగుడిలో రెండో అంతస్తు వరకూ పెరిగిన 14 అడుగుల భీమేశ్వరుడి శివలింగం కనువిందు చేస్తుంది.
నిర్మాణ సమయంలోనే ఈ శివలింగం అంతకంతకు పెరిగిపోతుండటం గమనించి శిల్పులు శివలింగం పైభాగాన చీల కొట్టారనే కథ స్థానికంగా వినిపిస్తూ ఉంటుంది.
💠 మిగతా పంచారామ క్షేత్రాలలో లాగా ఇక్కడ వివాహాది శుభకార్యాలుండవు.
స్వామివారి యోగనిద్రకు భంగం కలగకుండా ఉండటానికే ఈ ఏర్పాటని భక్తుల విశ్వాసం.
💠 స్వామివారికి ఎదురుగా 6 అడుగుల ఎత్తులో నందీశ్వరుడు ఆశీనుడై ఉన్నాడు.
ఇది ఏకశిల.
💠 ఇక్కడి ఏకశిలా నంది విగ్రహం,ఊయల మండపం, నాటి శిల్ప కళానైపుణ్యానికి తార్కాణాలు.
ఊయల మండపాన్ని కాస్తంత ఊపితే కాస్తంత కదులుతున్నట్టు ప్రకంపనలు వస్తాయి.
ఇక్కడి నందీశ్వరుడి వైభవాన్ని చూడాల్సిందే. మొడలో గంటతో, శివలింగమంత మూపురంతో రాజసంగా ఉంటుందీ విగ్రహం.
💠 ఆలయ నిర్మాణ సమయంలో శ్రమజీవులకు మజ్జిగ పోసిన గ్లానును మరచిపోకుండా సుమారు యాభై అడుగు ఎత్తున్న గొల్ల స్థంభానికి ఏకశిలలో నిర్మించారు.
💠 శివుడు వెలసిన ఈ పంచారామ క్షేత్రాలను దర్శించి, తరించండి.
ఈ క్షేత్రాలు దర్శిస్తే సర్వ పాపాలు నశిస్తాయని, అఖండ ఫలితంతో పాటు, కాశీ క్షేత్ర దర్శనం వలన కలిగే పుణ్యం కూడా లభిస్తుందని పెద్దలంటారు. ..
🙏 ఓం నమః శివాయ 🙏
No comments:
Post a Comment