Adsense

Tuesday, June 14, 2022

శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం : కేతవరం, గుంటూరు జిల్లా


💠 తెలుగునాట కృష్ణా పరీవాహక ప్రాంతంలో నెలకొన్న ఐదు నరసింహ స్వామి ఆలయాల్లో కేతవరం కూడా ఒకటి.  వీటినే పంచ నరసింహ క్షేత్రాలు అంటారు.  అవి కృష్ణా జిల్లాలోని వేదాద్రి, గుంటూరు జిల్లాలోని మంగళగిరి, కేతవరం, నల్గొండ జిల్లాలోని వాడపల్లి, మట్టపల్లి .

💠 ఇప్పుడు  వీటిలో  కేతవరం గురించి తెలుసుకుందాము. సాధారణంగా నరసింహస్వామి ఎక్కడ వెలిసినా స్వయంభూగా, కొండ గుహలలో వెలుస్తాడు.  ఆయన దర్శనం చేసుకోవాలంటే భక్తులు కొంచెం కష్టపడక తప్పదు.  

💠 గుంటూరు జిల్లా, బెల్లంకొండ మండలం కృష్ణానది ఒడ్డున కేతవరం అనుగ్రామం కలదు. గ్రామమునకు తూర్పుదిశగా కొండమీద శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూమూర్తిగా వెలసిల్లినాడు. ఇది పంచనారసింహ క్షేత్రాలలో ఒకటిగా ప్రతీతి. కేతవరంనందు మూడు నరసింహాలయాలను దర్శించ గలము.

💠 ఇక్కడ కొండపైన వున్న స్వామి దర్శనానికి 600 మెట్లు ఎక్కాలి.  మెట్లు ఎక్కేముందే పూజారిగారు పైన వున్నారో లేదో కింద గుళ్ళల్లో కనుక్కుని బయల్దేరండి.  
కొండమీద ఆలయాన్ని దర్శించాలంటే ఉదయం 9 గం. లోపే అక్కడికి చేరుకోవాలి.  అర్చకులు ఉదయం కొండపై గుడికి వెళ్ళి, స్వామి ఆరాధన పూర్తి చేసుకొస్తారు. 

💠ఇక్కడ స్వామి ఉత్తరాభి ముఖంగా కొలువై ఉంటాడు. దీనికి మరికొంత ఎగువభాగాన చెంచులక్ష్మీ అమ్మవారి మందిరం ఉంది. కొండ దిగువ భాగాన మరో నరసింహాలయం కలదు. 
ఇక్కడ శ్రీ లక్ష్మీనరసింహస్వామి పశ్చిమాభిముఖంగా ఉంటాడు. 
చైత్రశుద్ధ చతుర్ధశినాడు స్వామివారి కళ్యాణోత్సవాలు ఇక్కడ జరుగుతాయి.
 కొండ దిగువ ఆలయంనకు పశ్చిమదిశగా, సుమారు 3 కిమీ దూరాన, కృష్ణానదీతీరాన మరో శ్రీ లక్ష్మీనరసింహాలయం ఉంది. 
ఆలయ ప్రాంగణము నందు రథమండపం, ఇతర మండపాలు కలవు. ఆలయంనకు దిగువన గల కృష్ణానదీ స్నానఘట్టంనందు భక్తులు స్నాన మాచరించి, స్వామివారికి తమ మొక్కుబడులును తీర్చుకుంటారు.

💠 శ్రీ లక్ష్మీనరసింహాలయంకు కుడివైపున ఆంజనేయస్వామికి మండపం కలదు. ఇక్కడ ఆంజనేయస్వామి తూర్పు అభిముఖంగా ఉంటాడు.

💠 కేతవరంలోని దేవాలయం వరకు తూర్పు దిశగా ప్రవహించిన కృష్ణమ్మ ఇక్కడనుండి ఉత్తర దిశగా సాగుతుంది. 
 
💠 క్రీ.శ. 11వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని కేతవర్మ అనే రాజు పరిపాలించాడు.  ఆయన పేరుమీదే ఈ ఊరుకి కేతవరం అనే పేరు వచ్చింది.  వాడుక భాషలో కేతారం అని కూడా అంటారు.  ఇక్కడ స్వామి ఆవిర్భావానికి సంబంధించి ప్రచారంలో వున్న కధ .. కేతవర్మ ఈ ప్రాంతాన్ని పాలించే కాలంలో ఒక గొఱ్ఱెల కాపరి ఈ కొండమీదకి గొఱ్ఱెలను కాచుకోవటానికి వెళ్ళాడుట.  మధ్యలో కొంచెంసేపు విశ్రాంతి తీసుకున్నాడు.  ఆ సమయంలో స్వామి గొఱ్ఱెలకాపరి కలలో కనబడి తాను అక్కడ వెలసి వున్నానని, అప్పటిదాకా దేవతలకే దర్శనమిస్తున్న తాను ఇక ముందు మనుష్యులకు కూడా దర్శనమివ్వదలచానని, రాజుకి తెలిపి ఆలయం నిర్మించమని చెప్పాడు.  గొఱ్ఱెల కాపరి  ఆ విషయాన్ని మహారాజైన కేతవర్మకి తెలియజేశాడు.  కేతవర్మ కొండమీదంతా గాలించి శ్రీ స్వామి, అమ్మవార్ల స్వయంభూ మూర్తులను చూసి, వెంటనే కొండపై స్వామికి దేవాలయం కట్టించారు.

💠 దేవాలయ నిర్మాణం సమయంలో నీటి కోసం కొండ కింద ఇప్పటి ఆలయం ముందు కోనేరు తవ్వారు. అప్పుడు ఇక్కడ నీరు పడిందిటగానీ, నిర్మాణం పూర్తికాగానే ఈ కోనేరులో నీరు ఎండిపోయిందట. ఆ కోనేరు తవ్వే సమయంలో రెండు అద్భుతాలు జరిగాయి. అక్కడ తవ్వేటప్పుడు, పనిచేసే కూలీలలో ఒకరి కాలికి రాయి గుచ్చుకొని రక్తస్రావం జరిగింది.  ఆ గాయాన్ని నీటితో శుభ్రపరిచేటప్పుడు గుచ్చుకున్న రాయిని వజ్రంగా గుర్తించారు.  అక్కడ ఇంకా వజ్రాలు దొరుకుతాయేమోనని ఇంకా త్రవ్వగా స్వామివారి ఉత్సవ విగ్రహాలు బయటపడ్డాయి. ఇప్పటికీ వర్షాకాలంలో అప్పుడప్పుడూ ఇక్కడ వజ్రాలు దొరుకుతాయిట.   
ఇది వజ్రాలు దొరికే ప్రదేశం గనుక, స్వామి వజ్రంతో దొరికాడుగనుక, ఈ స్వామిని వజ్రాలయ్య అని కూడా అంటారు. 

💠 ప్రతి సంవత్సరం చైత్ర శుధ్ధ త్రయోదశినుంచి పౌర్ణమి వరకు స్వామివారు కళ్యాణోత్సవాలు ఈ ఆలయంలో వైఖానస ఆగమం ప్రకారం జరుగుతాయి.  చైత్ర శుధ్ధ చతుర్దశికి స్వామివారి కళ్యాణం కొండ కింది దేవాలయంలోనే జరుగుతుంది. చైత్ర శుధ్ధపౌర్ణమి రోజు స్వామివారికి రధోత్సవము అత్యంత వైభవంగా జరుగుతుంది.  
పూర్వం స్వామివారికి కంచు రధం వుండేదట.

💠 ఒకసారి కోనేరులో దొరికిన ఉత్సవ విగ్రహాలను కంచు రధంలో ఊరేగిస్తుండగా భక్తుల పట్టుదప్పి ఆ రధం విగ్రహాలతో సహా పల్లంలో వున్న కృష్ణానదిలో పడిపోయిందనీ, ఇప్పటికీ ఆ రధం అక్కడ కృష్ణానదిలో వుందని చెప్పుకుంటారు. కంచు రధం కృష్ణానదిలో పడిన తర్వాత శ్రీ పింగళ రామిరెడ్డి అనే భక్తుడు స్వామివారికి ఇంకో రధం చేయించారు.  అప్పటినుంచీ స్వామివారి రధయాత్రలో ఈ రధాన్ని ఉపయోగిస్తున్నారు.

💠 కృష్ణా పరీవాహక ప్రాంతంలో వెలిసిన పంచ నారసింహ క్షేత్రాలలో ఒకటైన కేతవరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అవకాశం వున్నవారు తప్పక దర్శించవలసిన క్షేత్రము.

No comments: