💠 సుబ్రమణ్యం అంటే జ్ఞానానికి ప్రతీకగా భావిస్తారు. అంతేకాదు సర్వసైన్యాధక్షుడు ఆయన. శివపుత్రుడు. మహాబల శాలి. ఆయన్ను ఆరాధిస్తే సకల కోరికలు నెరవేరుతాయి. ముఖ్యంగా వివాహం కానివారు, పిల్లలు లేనివారు, గ్రహదోషాలు ఉన్నవారు. శీఘ్రంగా కోరికలు నెరవేర్చే దేవుడిగా కుమారస్వామికి పేరు.
💠 మార్గశిరమాసం, శుక్లపక్షం, ఆరో తిథి... శివపార్వతుల ద్వితీయ పుత్రుడైన కుమారస్వామి జన్మించిన సుదినం.
అదే సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి.
ఆ రోజుని ఎంతో పవిత్రమైనదిగా భావించి భక్తిశ్రద్ధలతో స్వామిని అర్చిస్తారు.
దేవగణాలకు సేనాధిపతి అయిన కుమారస్వామిని షష్ఠినాడు దర్శించుకుని, అభిషేకించి, తమ శక్తికొద్దీ పేదలకు అన్న, వస్త్ర, వస్తు దానాలు చేస్తే బ్రహ్మహత్యా పాతకంతో సహా అన్ని పాపాలనుంచి విముక్తి కలుగుతుందని హిందూ పురాణాలు
💠 "నమో దేవాయ మహా దేవాయ సిద్దాయ సంతాయ నమో నమః శుభాయ దేవసేనాయ షష్ఠి దేవాయ నమో నమః' " అంటూ ఆ సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి నిండుమనసుతో ఆరాధించే తెలుగు రాష్ట్రాల భక్తులు లెక్కకు మిక్కిలిగానే ఉన్నా ఆయన కొలువుదీరిన ఆలయాలు మాత్రం 2 తెలుగు రాష్ట్రాల్లో అత్యంత అరుదుగా కనిపిస్తాయి.
అలాంటి వాటిల్లో ఒకటి సికింద్రాబాదు చెందిన స్కందగిరి.
💠 అత్యంత మహిమాన్వితమై, కంచి పీఠం ఆధ్వర్యంలో కచ్చితమైన వేద సంప్రదాయంలో నిత్యం పూజలు జరిగే క్షేత్రం స్కందగిరి.
ఆ క్షేత్రం మహిమ, పూజలు, ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం…
💠 షష్ఠి, స్కంద షష్ఠి.... ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. అందులో భాగంగానే సికింద్రాబాద్ లోని పద్మారావునగర్ లో ఉన్న స్కందగిరి ఆలయంలో జరిపే పర్వదినాన్ని స్కంద షష్ఠిగా చెబుతారు. ఆగమశాస్త్ర పద్దతిలో పూజలు నిర్వహించడం ఈ ఆలయ ప్రత్యేకత. నిష్టతో ఆరాధిస్తే కోరిన కోరికలన్నీ తీరతాయన్న నమ్మకంతో నిత్యం ఈ ఆలయాన్ని అనేకమంది భక్తులు సందర్శిస్తారు. షష్ఠి పర్వదినం నాడయితే వేలకొద్దీ భక్తులు తరలి వచ్చి పూజలు చేయిస్తారు. !
💠 వినాయక చవితి,సంకట చతుర్ధి, ,సుబ్రమణ్య షష్టి, మహస్కంద షష్ఠి, ప్రదోష పూజలు లాంటి కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తారు .
కుటుంబ కలహాలు ,రాహు-కేతు దోషాలు ఉన్నవారు స్వామి వారి సన్న్డిదికి వచ్చి మొక్కుకొని వెళ్తుంటారు . అవి తీరగానే మల్లి వచ్చి ముడుపులు చెల్లిస్తారు .
💠 స్థానికంగా ఉండే ఓ భక్తుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కలలోకి కనబడి గుడిని కట్టాలని ఆదేశించారు. ఆయన సికింద్రాబాద్ లోని పద్మారావునగర్ లో ఆంజనేయుడి విగ్రహం ఉన్న ఎత్తైన కొండమీద స్కందుడి ఆలయానికి దాతల సహాయంతో శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత దీన్ని కంచి పీఠానికి అప్పగించగా, నాటి కంచి పీఠాధిపతి చంద్రశేఖరస్వామి శంకరమఠం పేరుతో ఆ ఆలయాన్ని ప్రారంభించి 'స్కందగిరి’గా నామకరణం చేసి అప్పటి నుండీ ఈ ఆలయం మఠం నిర్వహాణలోనే కొనసాగుతోంది.
💠 సుబ్రహ్మణ్యేశ్వరస్వామి అష్టోత్తర పూజలో వచ్చే ఓం స్కందాయేనమ:'అన్న మంత్రంలోని ‘స్కంద'అన్న పదానికి , కొండమీద ఆలయాన్ని నిర్మించిన కారణంతో‘గిరి 'అన్న పదాన్నీ చేర్చి ‘స్కందగిరి'గా నామకరణం చేశారు.
💠 ఈ ఆలయంలో ప్రధాన మూలవిరాట్టు సుబ్రహ్మణ్యస్వామియే అయినప్పటికీ భక్తుల దర్శనార్థం అనేక ఉప ఆలయాలను కూడా నిర్మించారు.
సుందరగణపతి, ప్రసన్నాంజనేయుడు, శివుడు, మీనాక్షి, దక్షిణామూర్తి లింగోద్భవ, బ్రహ్మ, చండికేశ్వరుడు, గోవిందరాజులు, శ్రీదేవి, భూదేవి దుర్గామాత నటరాజ ఆలయం , బయట రాగి చెట్టుకు క్రింద నాగదేవతలు, షణ్ముక, నవగ్రహాలు, రాహుకేతువులు, కదంబ దేవతల ఆలయాలతో పాటు ఆదిశంకరాచార్యుల పాదుకులను ఏర్పాటు చేశారు. ఆలయంలోని అన్ని దేవతామూర్తులకు నిత్య పూజలు జరుగుతాయి.
💠 సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రతి మంగళవారం అభిషేకం చేయించి, ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు తీరుతాయనేది భక్తుల నమ్మకం. ఈ ఆలయంలో స్కంద షష్ఠిని ఘనంగా నిర్వహించడంతో పాటు, సంవత్సరంలో రెండు సార్లు స్వామివారికి కళ్యాణోత్సవాన్ని, కావడి పూజలనీ నిర్వహిస్తుంటారు.
💠 51 లేదా 101 ప్రదక్షిణలు చేస్తే గ్రహదోషం పోతుందనీ, సంతానంలేని వారికి సంతానం కలుగుతుందనీ, రుణవిమోచన కలుగుతుందనీ ఈ దేవాలయాన్ని సందర్శించే భక్తులు విశ్వసిస్తుంటారు.
💠 ప్రతి మంగళవారం మహిళలు మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగున్నర వరకు నిమ్మకాయలను కోసి, వాటిని వెనక్కి తిప్పి అందులో నూనె పోసి దీపాలు వెలిగిస్తారు.
అలా చేయడంవల్ల కుటుంబ బంధాలు మెరుగుపడతాయనీ, పెళ్లిళ్లు కుదురుతాయనీ భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారనీ విశ్వసిస్తారు.
💠 శివధ్యానంలో ఉన్న చండికేశ్వరుడి విగ్రహం వద్ద భక్తులు చప్పట్లు కొట్టి తమ కోరికలను విన్నవించుకుంటే అవి నెరవేరతాయని ప్రతీతి.
💠 స్కందగిరి శ్రీ సుబ్రహ్మణ్యస్వామి దేవాలయం నిజంగా షణ్మతస్థాపన అంటే గణపత్యం, శైవం, కౌమారం, సక్తం, వైష్ణవం మరియు సౌమారాన్ని సూచిస్తుంది.
No comments:
Post a Comment