Adsense

Tuesday, June 14, 2022

శ్రీ త్రిలింగరామేశ్వర దేవాలయం, తాండూరు, కామారెడ్డి జిల్లా (హైదరాబాద్ సమీపం)


💠 శివుడు తాండవమాడిన ( తాండూరు) గ్రామంలోనే రాముడు లింగ ప్రతిష్ఠాపన చేసిన పుణ్యక్షేత్రమే త్రిలింగరామేశ్వర దేవాలయం .

💠 త్రిలింగరామేశ్వర దేవాలయం తెలంగాణ రాష్ట్రం, కామారెడ్డి జిల్లా, నాగిరెడ్డిపేట మండలం, తాండూరు గ్రామంలో ఉన్న దేవాలయం. 
రామేశ్వర, భీమేశ్వర, సోమేశ్వర అనే మూడు లింగాల కలయికతో ఒకే చోట లింగాకృతిలో ఉన్న ఈ దేవాలయం 12వ శతాబ్దంలో నిర్మించబడింది.

💠 సాక్షాత్తూ పరమశివుడు తాండవం ఆడిన గ్రామం తాండవపురి(తాండూర్‌)కి త్రేతాయుగంలో శ్రీరాముడు వనవాసం వచ్చిన సమయంలో శివరాత్రి రోజున శివుడిని పూజించడానికి శివలింగం లేకపోయింది. మంజీర నది ఒడ్డున రాముడు, లక్ష్మణుడు, సీత వేర్వేరుగా రామేశ్వర, భీమేశ్వర, సోమేశ్వర లింగాలను ప్రతిష్ఠించి పూజలు చేశారని పూర్వీకులు చెబుతారు. 
వాళ్ళు పూజలు ముగించడంతోనే ఈ ప్రాంతంలో మూడు లింగాల ఆలయాన్ని నిర్మించారని, రాముడు స్నానం చేసిన ప్రాంతాన్ని రామపాదాలు అని, రాముడు తీర్థం సేవించిన ప్రాంతాన్ని రామతీర్థంగా అని పిలుస్తున్నారని ఇక్కడి గ్రామస్తుల కథనం.

💠 ఒకే ఆలయంలో మూడు లింగాలు ప్రతిష్ఠితమై ఉండడం ఈ ఆలయ ప్రత్యేకత. లింగాకారంలో కనిపించే ఈ ఆలయంలో ఒకే రాతితో నిర్మించిన ముఖద్వారం, ప్రధాన ద్వారం, స్వాగత తోరణాలు ఉన్నాయి.  నాట్యంతో స్వాగతం పలుకుతున్నట్టుగా ద్వారాలకు రెండు ప్రక్కల శిల్పాలు చెక్కబడ్డాయి.

💠 ఈ ఆలయంలో లేపాక్షి నందిని పోలిన ఒక నంది విగ్రహం ఉంది. ఈ ఆలయాన్ని ఒకే కాలు, ఒకే చేయి ఉన్న శిల్పి రూపకల్పన చేశాడని, ఈ ఆలయాన్ని నిర్మించి ఇదే ఆలయంలో తను సజీవ సమాధి అయ్యాడని చరిత్ర ఆధారంగా తెలుస్తోంది.

💠 ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా ఉత్సవాల్లో భాగంగా శివరాత్రి రోజు ఉపవాస దీక్షలు, రెండవ రోజు ఆలయం చుట్టూ ఎడ్లబండ్ల ప్రదర్శన, మూడవరోజు పద్మవ్యూహం, భజనలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు, నాలుగవరోజు రథోత్సవం, ఐదవరోజు పూర్ణాహుతి కార్యక్రమాలు ఐదు రోజులపాటు జరుగుతాయి. 
ఈ ఉత్సవాలకు ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా వస్తారు. 
శ్రావణ మాసంలో ప్రతిరోజూ అభిషేకాలు, అర్చనలు జరుగుతాయి

💠 ఈ ఆలయానికి ఎదురుగా ప్రవహించే మంజీరా నది ఉంది, ఇది పైనుండి గమనించినప్పుడు శివలింగంగా కనిపిస్తుంది.
ఆలయం లోపల నల్ల రాతితో చేసిన శివ, పార్వతి విగ్రహాన్ని కూడా చూడవచ్చు. 
ఈ ఆలయంలో  ప్రత్యేక పూజలు లక్ష బిల్వర్చన మరియు మహాశివరాత్రి మరియు కార్తీక పౌర్ణమి రోజులలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

💠 ఆలయంలోని గర్భగుడిలో సుమారు 80 అడుగుల దూరంలో ఉన్న రామేశ్వర శివలింగంపై సూర్యభగవానుని కాంతికిరణాలు నేరుగా పడతాయి.
 ఉదయం పడిన కిరణాలు సూర్యాస్తమం అయ్యే వరకు లింగంపై ఉండడం ప్రత్యేకత. ఇలాంటి దృశ్యం వరంగల్‌ రామప్ప దేవాలయంలో తప్ప మరెక్కడా లేదు.

💠 ఇక్కడ లింగాకారంలో మంజీర నది : నాగిరెడ్డిపేట మండలంలో ప్రవహించే మంజీర నది ఈ ఆలయం సమీపంలో లింగ ఆకారంలో ప్రవహిస్తుండటంతో సాక్షాత్తు శివుడు తాండవమాడిన ప్రాంతంగా చెబుతుంటారు. నాసా విడుదల చేసిన చిత్రాల్లో మంజీరనది నాగిరెడ్డిపేట మండలంలో లింగాకారంలో ప్రవహిస్తున్నట్లు సృష్టంగా కనబడుతుంది. ఎదురుగానే శివాలయం నిర్మించడం వెనుక ఏదో అద్భుతమైన కారణం ఉండవచ్చునని చరిత్రకారుల అభిప్రాయం.

💠 సాక్షాత్తు పరమశివుడు తాండవమాడిన గ్రామం తాండవపురిలో ఎన్నో అద్భుతాలు బయటకు వస్తున్నాయి. త్రిలింగ రామేశ్వర ఆలయంలో 80 అడుగుల లోపల ఉన్న రామేశ్వర లింగంపై సూర్య కిరణాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు పడి ఉండడం శివ మాయకు నిదర్శనం. 
పురావస్తు శాఖ అధికారులు తవ్వకాలు జరిపితే మరింత చరిత్ర వెలుగులోకి వస్తుంది.

No comments: