🌀 విశ్వదాభిరామ వినురవేమ...
ఆయన పద్యాలు చదువుకోని తెలుగు విద్యార్థి ఉండరు. అప్పట్లో చదువురాని వారికి కూడా అలవోకగా ఆయన పద్యాలు కంఠస్తం.
ఎన్నో జీవనసత్యాలను పద్యాలుగా మనకందించిన యోగి "వేమన".
వందల ఏళ్ల నాడే అన్నిమతాల డాంబికాచారాలనూ, మూఢనమ్మకాలనూ కడిగిపారేసిన యోగులు కలకలాం పూజ్యనీయులే.
అలాంటి యోగికి గుడికట్టి ఆరాధిస్తున్న ఊరి గురించి తెలుసుకుందాం.
👉వేమజ్యోతి, వేమనారాయణరెడ్డి, వేమా ప్రసాద్ రెడ్డి, వేమారెడ్డి వేమావతి, వేమశ్రీ, వేమన్న, వేమనారాయణమ్మ, వేమయ్య... వేమన వారికి దైవం. వేమన తత్వం వారికి ప్రాణం. అందుకే ఆయనకు గుడికట్టారు. గుండెల్లో పెట్టి పూజించుకుంటున్నారు.
👉వేమన తమ ఊరిలో జీవసమాధి పొందడం ఇక్కడి వారు గౌరవంగా భావిస్తుంటారు. అందుకే కటారుపల్లిలో దాదాపుగా ప్రతీ ఇంటిలో ఒక్కరికైనా వేమన పేరు పెట్టుకొని అభిమానాన్ని చాటుకుంటారు. ఆలయ ప్రాంగణంలోని భవన ప్రాకారాలపై 150కు పైగా వేమన పద్యాలు చెక్కారు. వాటిలో మనకు తెలియని చాలా పద్యాలూ ఉంటాయి.
👉ఆయన ప్రజల కవి. పండితుల అంచనాల ప్రకారం మన వేమనతో పోల్చదగ్గ తమిళ కవి తిరువళ్లువర్.
ఆయనకక్కడ అడుగడుగునా కోవెలలు కట్టి గౌరవిస్తున్నారు తమిళసోదరులు.
మరి మనమూ ?
👉ఆ ప్రశ్నకు సమాధానమే... అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలం కటారుపల్లి వాసులు కట్టిన 'వేమన గుడి.
👉1789 ప్రాంతంలో ఆయన తమ ఊరిలోనే జీవ సమాధి అయ్యారన్నది అక్కడివారి విశ్వాసం. అయితే, దీనిపై చాలా అభ్యంతరాలున్నాయి. ఏదేమైనా ఆ ఊరి జనం మాత్రం వేమనకు గుడి కట్టి ఆరాధిస్తున్నారు.
👉ఈ ఆలయానికి నిత్యం అనంతపురం, కర్నూలు, కడప, నెల్లూరు, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, కృష్ణా జిల్లాల నుంచే కాకుండా కర్ణాటక నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఆదివారం, మంగళవారం వీరి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ప్రతి యేడాది శ్రీరామనవమి సమయంలో మూడు రోజుల పాటు వేమన తిరునాళ్లు వైభవంగా సాగుతాయి. ఉట్ల ఉత్సవానికి పెద్దసంఖ్యలో ప్రజలు హాజరవుతారు.
👉వేమన గుడికి సమీపాన ఉన్న ప్రపంచ ప్రసిద్ధి తిమ్మమ్మ మర్రిమానును చూడ్డానికి, కదిరి శ్రీ లక్ష్మీనరసింహుని దర్శించుకోవడానికి, పుట్టపర్తికి వచ్చే భక్తులూ పర్యాటకులు ఇక్కడికి వస్తున్నారు. ఆ సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో రాష్ట్ర పర్యాటక అఖ కూడా ఈ ఊరి పై దృష్టి సారించింది.
రూ. 2కోట్లతో కటారుపల్లిలో భవనాలు నిర్మించింది. దాదాపు మూడు ఎకరాల విస్తీర్ణంలో కాటేజీలు, రెస్టారెంట్, పార్క్, చిన్న పిల్లలకు ఆటస్థలం ఏర్పాటు చేసింది. ఆ పేరే...
👉ఆలయ ప్రాంగణంలోని భవన ప్రాకారాలపై వేమన పద్యాలు చూడచక్కగా చెక్కారు. దాదాపుగా 150 వరకూ పద్యాలను ఇక్కడ ఇలా ఉంచారు. వాటిలో మనం ఎప్పుడూ వినే పద్యాలతో పాటు చాలామంది వినని పద్యాలూ ఉంటాయి.
👉ఇక్కడిలాగే కదిరికి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న మండల కేంద్రం నల్లచెరువులో కూడా వేమనకు ఒక ఆలయం ఉంది. కటారుపల్లిలో సజీవ సమాధి అయిన తరువాత లేచి ఆయన అక్కడికి వెళ్లినట్లు నమ్మకం. అందుకే అక్కడ గుడి కట్టినట్లు చెబుతారు.
🌀 ఆశ్రమం 🌀
👉వేమన తత్వం... ఆయన భావాలు ప్రజలకు మరింత దగ్గర చేయటానికి బెంగళూరుకు చెందిన నారాయణ రెడ్డి విశేషంగా కృషి చేస్తున్నారు. ఈయన ఇప్పటికే బెంగుళూరులో ఒక ఆశ్రమం ఏర్పాటు చేశారు. అలాగే కటారుపల్లి గ్రామంలో కూడా 'యోగివేమన ఆశ్రమం' నిర్మించారు. దీనికి 'విశ్వవేమన కొండ' అని నామకరణం చేశారు. వేమన జీవిత చరిత్ర పుస్తకాలు, పద్యాల సీడీలను ఇక్కడి లైబ్రరీలో అందుబాటులో ఉంచారు. ఆరడుగుల వేమన విగ్రహం ఏర్పాటుకు చర్యలు చేపట్టారు.
👉ఇక్కడికి వచ్చే సామాన్య భక్తులు తమ మొక్కుబడులు తీర్చుకొని వెళ్లిపోవాల్సి వస్తోంది. ఆలయం వద్ద ఉండాలంటే ప్రత్యేకంగా ఏర్పాట్లు లేవు. తలనీలాలు సమర్పించేందుకు, ఒక్కరోజైనా ఉండేందుకు వీలుగా విశ్రాంతి భవనాలు నిర్మిస్తే సౌకర్యవంతంగా ఉంటుందంటున్నారు పర్యాటకులు. త్వరలో ఆ సౌకర్యాలు కూడా ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఇలా చేరుకోవచ్చు
👉అనంతపురం జిల్లా కదిరి పట్టణానికి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో కటారుపల్లి గ్రామం ఉంది. కదిరి నుంచి ఉదయం, సాయత్రం సరాసరి బస్సు సౌకర్యం ఉంది. అలాకాకుండా, కడప జిల్లా రాయచోటి వైపు వెళ్లే బస్సుల్లో కటారుపల్లి క్రాస్ వద్ద దిగి నడిచి కూడా వెళ్లవచ్చు. ఇక, కదిరి నుంచి బోలెడన్ని ప్రైవేటు వాహనాలూ అందుబాటులో ఉంటాయి.
No comments:
Post a Comment