Adsense

Wednesday, June 15, 2022

శ్రీ రాజరాజేశ్వరీ సమేత ఛాయా సోమేశ్వరాలయం : కోటిపల్లి, (తూర్పుగోదావరి)


👉ద్రాక్షరామానికి దగ్గరగా, పరమ పావనమైన పుణ్యగౌతమీ తీరంలోని 
'కోటిపల్లి క్షేత్రం దర్శించినంత మాత్రం చేతనే కోటి పుణ్యఫలాలు దక్కుతాయి. 

👉శ్రీ రాజరాజేశ్వరీ సమేత ఛాయ సోమేశ్వర స్వామి ఆలయం ఉంది. ఇది అష్ట సోమేశ్వరాలయాలలో దక్షిణ క్షేత్రంగా ప్రతితీ. భీమసభ నందలి 108 శివ లింగాలలో ఒకటిగా పేర్కొనారు. 

👉కోటిపల్లిని కోటితీర్ధమని కూడా అంటారు. ఈ క్షేత్రంలో శివుడు కోటేశ్వరుడుగా, సోమేశ్వరుడుగా కొలువై ఉన్నాడు. ఇక్కడ కోటి శివలింగాలు ఉండటంతో ఈ క్షేత్రానికి కోటిపల్లి అని పేరు వచ్చిందని అంటారు. ఇది ఆంధ్రప్రదేశంలోని పంచారామాల్లో ఒకటైన ద్రాక్షారామం సమీపంలో ఉంది.

🔅 క్షేత్ర పురాణం 🔅

👉 శ్రీ సిద్ది జనార్ధనస్వామి : 
రాక్షసరాజు బలిచక్రవర్తి బారి నుండి రక్షించమని దేవతలు, కశ్యప మహర్షిని వెంటబెట్టుకుని కోటి తీర్థ క్షేత్రంలో తపస్సు చేసుకుంటున్న శ్రీమన్నారాయణ మూర్తిని వేడుకున్నారు. వారిని అనుగ్రహించిన శ్రీమన్నారాయణుడు, కశ్యపుడి భార్య అదితి గర్భమున వామనమూర్తిగా అవతరించాడు. బలి నుండి సమస్త రాజ్యమును దానముగా స్వీకరించి దేవలకు ఇచ్చి తాను తపస్సు చేసుకునేందుకు తిరిగి కోటి తీర్థము చేరాడు. ఇంద్రాది దేవతలు శ్రీమన్నారాయణుడిని భక్తితో కొలిచారు. కశ్యప మహర్షి ఈ క్షేత్రంలో శ్రీ సిద్ది జనార్ధన స్వామిని ప్రతిష్టించాడు.

👉కోటీశ్వర శివలింగం : 
స్వర్గాధిపతి ఇంద్రుడు, గౌతముడి భార్య అయిన అహ్యలను మోహించి, ఒక రోజు అర్థరాత్రి గౌతముడి ఆశ్రమము ముంగిట కోడివలె కూసి, గౌతముడు నిద్రలేచి గౌతమీ నదికి వెళ్ళగానే ఆశ్రమంలోకి ప్రవేశించి అహల్యతో గడిపాడు. బ్రహ్మముహూర్త సమయం ఇంకా కాలేదని గ్రహించిన గౌతముడు తిరిగి ఆశ్రమానికి వచ్చి జరిగిన వాస్తవం గ్రహించాడు. శరీరమంతా సహస్రయోనులు ఏర్పడగలవని ఇంద్రుడిని, శిలగా మారమని అహల్యను, గౌతముడు శపించాడు. క్షమించమని ఇద్దరూ వేడుకొనగా, శ్రీరాముడి పాదస్పర్శచే యధారూపము పొందగలవని అహల్యకు శాపవిమోచన మార్గం చెప్పాడు. కోటితీర్థంలోని గౌతమీనదిలో స్థానం చేసి, ఆ క్షేత్రంలో వున్న సిద్ధ జనార్ధనుని భక్తితో సేవించి, ఆయన సాన్నిధ్యంలో కోటీశ్వర శివలింగాన్ని శాస్త్రయుక్తంగా ప్రతిష్టించి, అర్పించిన శాపవిముక్తి పొందుతావని ఇంద్రుడితో చెప్పాడు. ఇంద్రుడు అట్లే చేయగా సహస్రయోనులు, సహస్ర నేత్రాలుగా మారాయి.

👉శ్రీఛాయా సోమేశ్వరస్వామి :
 పూర్వం చంద్రుడు అజ్ఞానంతో తన గురుపత్ని అయిన తారను మోహవేశంతో పొందాడు. సాక్షాత్తు గురుపత్నిని పొందిన పాపం వలన చంద్రుడు తన సహజ సిద్ధమైన వెన్నెల ఛాయను కోల్పోయి క్షయ వ్యాధిగ్రస్తుడయ్యాడు. మిక్కిలి పశ్చాత్తాపంతో విష్ణుమూర్తికై తపస్సు చేశాడు. “కోటి తీర్ధంలోని గౌతమీ నదిలో స్నానంచేసి శ్రీసిద్ధి జనార్ధన నామముతో ఆ క్షేత్రంలో వేంచేసియున్న నన్ను దర్శించు. ఈ క్షేత్రాన పార్వతీ సహిత శ్రీ సోమేశ్వర లింగం ప్రతిష్టించి కోటి బిల్వ దళాలతో ప్రార్ధించి పాపవిముక్తుడవు కము!" అని అనుగ్రహించాడు. చంద్రుడు అదేవిధంగా చేసి తాను కోల్పోయిన చంద్రకాంతి ఛాయను పొందాడు. అందుకే ఈ క్షేత్రానికి ఛాయా సోమేశ్వర లింగ క్షేత్రం అని పేరు వచ్చింది. దీన్నే సోమతీర్థం అని కూడా అంటారు.

👉కోటి గోవులు, కోటి కన్యాదాతన ఫలాలు, నూరు అశ్వమేథయాగ ఫలాలు, మూడు కోట్ల శివలింగ ప్రతిష్ఠలు ఇచ్చే ఫలం ఈ తీర్థస్నానంతో లభిస్తుంది. కోటిపల్లి తీర్థంలో బ్రహ్మీముహూర్తాన సంకల్ప పూర్వకంగా స్నానమాచరించి, గణపతిని పూజించి, కోటీశ్వరుని, సోమేశ్వరుని, పార్వతిని, సిద్ది జనార్థనలను దర్శించి భక్తులకు మరుజన్మ ఉండదు అని ఒక నమ్మకం.

👉దక్ష యజ్ఞ విధ్వంసం సమీపంలోని ద్రాక్షారామంలోనే జరిగింది. మహాశివరాత్రి నాడు, కార్తీక మాసంలోను కూడా ఇక్కడకు గోదావరి స్నానం చేస్తే ఎంతో పుణ్యమని భక్తుల విశ్వాసం.
దక్షిణ కాశీగా పిలువబడే ద్రాక్షారామ క్షేత్రం నందలి శ్రీ భీమేశ్వర లింగము సూర్య ప్రతిష్ట. ఆ రుద్రమూర్తిని శాంతపరచేందుకు ద్రాక్షారామ క్షేత్రం చుట్టూ ఎనిమిది సోమేశ్వర ఆలయాలను చంద్రుడు ప్రతిష్టించాడు. చంద్రుడిని సోముడు అని పిలుస్తారు. సోముడు ప్రతిష్టించిన శివాలయాలను అష్టసోమేశ్వరాలయాలు అని అంటారు. ఇవి ద్రాక్షారామం పరిసరాల్లోనే ఉంటాయి. ద్రాక్షారామ క్షేత్రం నకు దక్షిణ దిశలో కోటిపల్లి క్షేత్రం ఉంది. ఇచ్చట శ్రీ రాజరాజేశ్వరీ సమేత సోమేశ్వరాలయం దర్శించగలము

👉శ్రీ ఛాయ సోమేశ్వర స్వామికి ప్రతి నిత్యం అర్చనలు, అభిషేకాలు జరుగుతాయి.  వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు శివ-కేశవులకు ఏక కాలములో కళ్యాణ ఉత్సవాలు నిర్వహించుతారు. మహా శివరాత్రి సందర్భముగా విశేష అభిషేకాలు జరుగుతాయి. సాయంత్ర కోటి దీపోత్సవం ఉంటుంది. ఆలయం నందు కార్తీక మాసంలో విశేష పూజలు జరుగుతాయి. శరన్నవరాత్రులు విశేషముగా ఉంటుయి.

No comments: