Adsense

Wednesday, June 15, 2022

దక్షిణ కాశి! శ్రీ భీమేశ్వర ఆలయం : ద్రాక్షారామం (తూర్పుగోదావరి)


🔅దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన పవిత్ర ప్రదేశం కనుక ఈ క్షేత్రానికి దక్షారామం అని పేరు వచ్చిందని ప్రతీతి. 
దక్షారామం కాలగమనంలో ‘దాక్షారామం’, ‘ద్రాక్షారామం’ అని పేర్లను సంతరించుకొంది.

👉 ద్రాక్షారామం గోదావరి ఒడ్డున వుంది. దీనిని దక్షిణకాశి అంటారు. 
ద్రాక్షారామంలో గల శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వర స్వామి వార్ల దేవాలయం అతి ప్రాచీన సుప్రసిద్ధ శైవ క్షేత్రం.
ఇది పంచారామాలలో వొకటి. 
ఇక్కడ భీమేశ్వరస్వామి లింగాకారంలో వున్నాడు. లింగం సగభాగం నల్లగా, సగభాగం తెల్లగా వుంటుంది. అర్ధనారీశ్వరుడు అనటానికి ఇది నిదర్శనం అంటారు. 
ఇక్కడ లింగం కూడా 15 అడుగుల ఎత్తు ఉంటుంది. పై అంతస్థులోకి వెళ్లి పూజలు జరపాలి.

👉పూర్వము తారకాసురుడు అను రాక్షసుడు శివుని గురించి ఘోరమైన తపస్సు చేయగా, శివుడు సాక్షాత్కరించెను. ఆ రాక్షసుడు శివుని యొక్క ఆత్మలింగాన్ని వరంగా కోరగా శివుడు ఆత్మలింగాన్ని ప్రసాదించెను.
తారాకాసురుని కంఠంలో అమృత లింగం వుండగా అతన్ని జయించలేరని దానిని ఛిన్నం చేయడానికి దేవతలు  విష్ణుమూర్తిని ని ప్రార్థన చేస్తే....ఈశ్వరుడి అంశతో జన్మించిన వానితో తప్ప మరెవ్వరి వలనా తనకు మరణం లేకుండ వరం పొంది ఉన్నాడని చెప్పగా, మన్మధ ప్రేరేపణచేత పార్వతీ కల్యాణం, అనంతరం 'కుమార సంభవం' జరుగగా ఆ కుమారస్వామి రుద్ర గణములకు నాయకత్వం వహించి తారకాసురుడితో యుద్ధం చేయగా, కుమార స్వామి విసిరిన బాణం ఆ ఆత్మలింగానికి తగిలి అయిదు ముక్కలై భూమిమీద అయిదు చోట్ల పడెను. అవే పంచారామ క్షేత్రాలుగా అవతరించెను. 

👉ఇలా భూమి మీద పడిన ఆత్మలింగాలు కైలాసాన్ని చేరుకోవాలని ఎదగడం ప్రారంభించెను. అలా ఎదిగి పోతూ ఉంతే కలియుగం వచ్చేసరికి మానవులకు అభిషేకాలకు గాని, దర్శనానికి గాని అందకుండ పోతాయని ఒక్కోచోట పడిన ఆత్మలింగానికి ఒక్కొ దేముడు అవి ఎదిగిపోకుండా ప్రతిష్ట చేసి అభిషేకార్చనలు చేసెను. 
👉అవి:: అమరావతి: ఇక్కడ ఇంద్రుడు ప్రతిష్టించాడు కాబట్టి 'అమరేశ్వరస్వామి ' గా వెలిసెను. 
👉భీమవరం::ఇక్కడ చంద్రుడు ప్రతిష్టించాడు కాబట్టి 'సోమేశ్వరస్వామి ' గా వెలిసెను. 
👉పాలకొల్లు::ఇక్కడ శ్రీ రామచంద్రమూర్థి ప్రతిష్టించాడు కాబట్టి క్షీరారామలింగేశ్వరస్వామి ' గా వెలిసెను. 👉సామర్లకోట::ఆత్మలింగాన్ని చేధించిన దోషం తనకు రాకూడదని కుమారస్వామే స్వయంగా ఇక్కడ లింగాన్ని ప్రతిష్టించెను కాబట్టి 'కుమారారామ భీమేశ్వరస్వామి 'గా వెలిసెను. 
 
👉ఈ ఆలయాన్ని, సామర్లకోటలోని భీమేశ్వరాలయాన్ని చాళుక్య రాజయిన భీముడు నిర్మించాడని చెబుతారు. అందుకే ఈ రెండు గుళ్లు ఒకే రీతిగా వుండటమేగాక, రెంటి నిర్మాణానికి ఉపయోగించిన రాయికూడ ఒకటే రకంగా వుంటుంది.
 ఇవి భీముడు నిర్మించినవనీ, అందుచేత ఈ స్వామి భీమేశ్వరస్వామి అని పేరు సార్ధకమయిందని మరో కథ.

👉సతీదేవి ఖండితాంగాలలో ఎడమ చెంప పడినట్టు చెప్పే ప్రదేశం ద్రాక్షారామం.
శ్రీ మాణిక్యంబా అమ్మవారు యావత్భారత దేశంలోనే ప్రసిద్ధి చెందిన అష్టాదశ శక్తి పీఠాలలో 12 వ శక్తిపీఠంగా వెలసియున్నది. మన రాష్ట్రానికి త్రిలింగ దేశమని పేరు రావడానికి కారణమైన క్షేత్ర త్రయంలో ద్రాక్షారామం ఒకటి. మిగిలిన రెండు క్షేత్రాలలో ఒకటి కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరము కాగా, మరొకటి శ్రీశైలము. త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా, అష్టాదశ శక్తిపీఠాలలో ద్వాదశ పీఠంగా, దక్షిణ కాశీగా, వ్యాస కాశీగా ద్రాక్షారామానికి ప్రశస్తి ఉంది.

🔅హరిహర మైత్రీ క్షేతం ద్రాక్షారామం :
ద్రాక్షారామ భీమేశ్వరాలయానికి లక్ష్మీనారాయణుడు క్షేత్ర పాలకుడు కావడం విశేషం. 
హరిహరులిద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేరనీ, ఇరువురికీ పూజాదికాలు సరిసమానంగా అర్పించాలనీ ద్రాక్షారామంలోని కల్యాణోత్సవాలు చెప్పక చెబుతాయి. 
అర్ధ శరీరాన్ని సతికి అనుగ్రహించిన మాణిక్యాంబా సమేత భీమేశ్వరుడికీ, హృదయేశ్వరిని వక్షస్థలం మీద ధరించిన లక్ష్మీనారాయణుడికీ ఏటా మాఘశుద్ధ ఏకాదశి రోజున వేదికపై కల్యాణాలు నిర్వహించే దృశ్యాన్ని ద్రాక్షారామంలో మాత్రమే దర్శించగలం. శైవులకూ, వైష్ణవులకూ ఇవి నేత్రపర్వం చేస్తాయి.

👉 ఆలయ ప్రాకారం చుట్టూ కాలభైరవుడు, ఢుండి గణపతి, విరూపాక్షుడు, నటరాజు, సప్తమాతృకలు, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, చతుర్మఖ బ్రహ్మ, లక్ష్మీ గణపతి, అష్టదిక్పాలకులు, నవగ్రహాలు, వీరభద్రుడు, సురేశ్వర చండీశ్వరాది దేవీ దేవతామూర్తులూ కొలువుదీరి ఉంటారు.
 
🔅అష్టోత్తర శతలింగాలు : 
ద్రాక్షారామంలోని స్వయంభూలింగాన్ని భక్తులు సందర్శించేందుకు వీలైన రీతిలో- రుద్రమూర్తిని శాంతపరచేందుకు ఈ క్షేత్రం చుట్టూ ఎనిమిది సోమేశ్వర ఆలయాలను చంద్రుడు నిర్మించాడని అంటారు. ద్రాక్షారామం పరిసరాల్లోని కోలంక, వెంటూరు, కోటిపల్లి, వెల్ల, దంగేరు, కోరుమిల్లి, సోమేశ్వరం, పెనుమళ్ల గ్రామాల్లో ఈ ఆలయాలు ఉన్నాయి.
 
👉దక్షరామమును జననాథపురం, భీమనాథపురం, దక్షిణపోవన మరియు దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు.

No comments: