🔅 ఆధ్యాత్మికతకు నెలవైన శ్రీ కాశీ విశ్వేశ్వరాలయం
💠 సుమారు వంద సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన 'శ్రీశైవ మహాపీఠం' ఆధ్వర్యంలో అతి స్వల్ప వ్యవధిలో భాగ్యనగర్ లోని నాగోలు జైపురి కాలనీ సమీపంలోని 'శివపురి'లో అత్యంత శోభాయమానంగా శ్రీ కాశీ విశ్వేశ్వరాలయ నిర్మాణం జరగడం విశేషంగా చెప్పుకోవాలి.
💠 ఆధ్యాత్మికత, భారతీయ సంస్కృతి, సనాతనధర్మ పరాయణతను హృదయమంతా నింపుకుని అనుక్షణం విశ్వమానవశాంతికి పరితపిస్తున్న మహానీయులు
శ్రీ శైవ మహా పీఠాధిపతులు సద్గురు శివానందమూర్తి చేతుల మీదుగా 2006 ఆగస్టులో శ్రీ కాశీ విశ్వేశ్వరాలయం
లో శ్రీ కాశి విశాలాక్షీ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర విగ్రహస్థిర ప్రతిష్ఠ, ధ్వజ స్తంభ ప్రతిష్ఠ వైభవంగా జరిగాయి.
💠 భారతదేశంలోనే అరుదయిన అత్యంత మహిమాన్విత స్ఫటిక లింగ క్షేత్రాలలో ఇది ఒకటి.
🔅 “సామ్రాజ్యం స్ఫటి కందద్యాత్” 🔅
💠 స్ఫటికలింగ దర్శన మాత్రంచేత సకల ఐశ్వర్యాలు, పాలనా దక్షత కలుగుతుంది అని శివగీత చెబుతోంది.
💠 కోటికాంతి కిరణాలతో భాసిల్లే స్ఫటికలింగమూర్తి, కాశీ విశాలాక్షి, విఘ్నేశ్వర, సుబ్రహ్మణ్యేశ్వర, వీరాంజనేయ, చండికేశ్వర, కాలభైరవ రాహు, కేతు నవగ్రహ ఆలయాలు ఒకే ప్రాంగణంలో ఇక్కడ మనకు దర్శన మిస్తాయి.
💠 స్పటికలింగమూర్తి:
శ్వేత కాంతు లీనుతూ, పరమపవిత్ర కాంతి పుంజాలు వెదజల్లుతూ కాశీ విశ్వేశ్వరుని రూపంలో ఉన్న స్ఫటిక లింగమూర్తి దర్శనమిస్తాడు.
💠 విశ్వేశ్వరస్వామి వారికి హారతి ఇచ్చిన తరువాత ఆ హారతి పెట్టిన ప్రతికార్యాన్ని విజయ పధంవైపు నడిపించడానికి తరలి వచ్చిన విజయ గణపతి సుందర సుమనోహర విగ్రహం కాంచగానే విజయోత్సాహంతో మనసంతానిండి పోతుంది.
💠 సుబ్రహ్మణ్య స్వామి ఆలయం: సర్వశుభంకరుడు, సంతాన ప్రదాత సుబ్రహ్మణ్యస్వామి.
సంతాన లేమితో బాధపడుతున్నవారు సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ప్రత్యేక పూజలు చేయించుకుని సత్ఫలితాలు పొందుతున్నారు.
💠 వీరభద్రుడు, భద్రకాళి మందిరం:
దుష్టజన శిక్షణకు, దురంహంకారులకు, దుర్మదాంధుల సంహారణకు సకలాయుధ ధారి అయి అరి వీర భయంకర రూపంలో ఉన్న వీరభద్రస్వామి, భర్తకు తోడుగా నిలిచిన భద్రకాళి కనిపిస్తారు.
💠 రాహుకేతువులకు ప్రత్యేకంగా ఆలయం నిర్మించి, ప్రత్యేక పూజలు నిర్వహించడం ఇక్కడి విశేషం.
💠 నవగ్రహాలకు గుడి:
భక్తుల సౌకర్యార్ధం ప్రత్యేకంగా నెలకొల్పిన నవగ్రహ దేవతామూర్తుల విగ్రహాల సందర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి గ్రహదోష నివారణకు ప్రత్యేక పూజలు చేయించుకుంటున్నారు.
💠 ఇవికాక చండికేశ్వర విగ్రహం, కాల భైరవ విగ్రహం, నందీశ్వరుడు, మూషికవాహనం, సింహ వాహనం ఆలయ ప్రాంగణానికి మరింత నిండు తనాన్ని సంతరింపచేస్తున్నాయి.
💠 భక్తకోటితో నిత్యం కళకళలాడుతూ శోభాయమానంగా కనిపించే ఈ ఆలయ సముదాయాన్ని ప్రతి ఒక్కరూ తప్పక దర్శించి తీరాలి.
No comments:
Post a Comment