💠ఆంజనేయుడు సీతారాముల దాసునిగా, రామ భక్తునిగా, విజయ ప్రదాతగా, రక్షకునిగా హిందూమతములో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలువబడే దేవుడు. అలాగే ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ ఆంజనేయస్వామి ప్రత్యక్షమవుతారని మన విశ్వాసం. ఎక్కడ హనుమ ఉంటారో అక్కడ శ్రీరామచంద్రులవారు తప్పక ఉంటారు. దేశవిదేశాల్లో హనుమంతుని గుడి లేని ఊరు చాలా అరుదు. ఇక కొన్ని బాగా ప్రసిద్ధి చేందిన ఆలయాలు ఉన్నాయి. అందులో కర్మన్‌ఘాట్ ధ్యానాంజనేయస్వామి ఆలయం కూడా ఒకటి.
💠 శ్రీ ఆంజనేయస్వామి భక్తులపాలిట పెన్నిధి. నిత్యం రామ ధ్యానంలో వుండే ఆయనను స్మరిస్తే అన్ని రకాల భూత,ప్రేత,పిశాచ భయాలను పోగొడతాడు.
ధ్యానముద్రలో స్వయంభువుగా వెలిసిన శ్రీ ఆంజనేయస్వామి అవతరించిన క్షేత్రమే హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్ ఆలయం.
💠కర్మన్‌ఘాట్ గ్రామంలో స్వయంభూగా వెలిసిన కర్మన్‌ఘాట్ శ్రీ ధ్యానాంజనేయస్వామి అశ్రిత జన భక్తకోటి కల్పవృక్షంగా వెలుగొందుతున్నాడు.
💠 కాకతీయ ప్రభువులచేత నిర్మించబడిన శ్రీ కర్మన్‌ఘాట్ ధ్యానాంజనేయ స్వామి దేవాలయంలో ఆంజనేయుడు భక్తుల మనోభీష్టాలను నెరవేరుస్తూ... యశోబుద్ధిబలాలను ప్రసాదించే భక్తవరదుడిగా విరాజిల్లుతున్నాడు. కోరిన కోర్కెలనెల్ల తీరుస్తూ తనను సేవించిన వారికి భూతప్రేతపిశాచాల బారి నుండి కాపాడుతూ అభయ హస్తం ఇస్తూ భక్తుల గుండెల్లో కొలువు దీరుతున్నాడు. చారిత్రక ప్రాధాన్యం కలిగిన శ్రీ కర్మన్‌ఘాట్ ధ్యానాంజనేయస్వామి దేవాలయానికి నగర వాసులే కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు.
💠 క్రీస్తుశకం 1143 నాటి గోల్కొండ దుర్గాన్ని పాలించిన రెండవ ప్రతాపరుద్రుని మొదలుకొని ఔరంగజేబు వరకు కర్మన్‌ఘాట్ ధ్యానాంజనేయుని సేవించారని పురాణాలు చెపుతున్నాయి.
💠 గోల్కొండ మహారాజు రెండవ ప్రతాప రుద్రుడు క్రీ.శ.1143లో తన సైన్యంతో ఇప్పుడు హైదరాబాద్గా పిలువబడుతున్న నాటి చల్సింకు బయలుదేరాడు. వేటలో ఆలసిపోయి అడివి ప్రాంతమైన లక్ష్మీగూడెం అనే గ్రామం సమీపంలోని ఉన్న ఇప్పటి కర్మన్ ఘాట్కి వచ్చి ఒక బండ రాయిపై విశ్రమించాడు. అదే సమీపంలో పులి గాండ్రింపు వినిపించింది. దీంతో రాజు ఉలిక్కిపడి గాండ్రింపు వచ్చిన దిశగా పరుగెత్తాడు. అక్కడ ఏమి కనిపించకపోవడంతో తిరిగి బండరాయి వద్దకు చేరుకోగానే మళ్ళీ పులి శబ్దం వినిపించింది.
ఏమీ అర్థంకాని మహారాజు శబ్దం వచ్చిన దిక్కుగా దండం పెట్టుకుని విల్లంబులను కిందపడేసి వెనుదిరిగాడు. రెండడుగులు వేయగానే శ్రీరాం అంటూ మూడుసార్లు మేష గంభీర భీకర స్వరం వినిపించింది. దీంతో మరింత అయోమయానికి గురైన రాజు శబ్దం వచ్చిన దిశగా మరోసారి దండంపెట్టి నాకు కనుపించు తండ్రీ అని వేడుకోగా, "ఓ రాజా నీ అంత్ర నేత్రంతో ధ్యాన దృష్టితో చూడు నేను కనిపిస్తాను "అని అశరీర వాక్కు వినిపించింది. అనంతరం రాజు పద్మాసనంలో ధ్యానేంద్రుడయ్యాడు. కొద్దిసేపటి తర్వాత ఇక లే నాయనా నేను కనిపిస్తాను అనే వాక్కు వినిపించగానే రాజు కన్నులు తెరిచి శబ్దం వినిపించిన చోట ఆకులు, అలములు తొలగించి చూడగా స్వయంభూవుగా వెలసిన ఆంజనేయ స్వామి దివ్యవిగ్రహం కనిపించింది. దీంతో రాజు ఆనందపరవశుడయ్యారు. ఆంజనేయుడిని స్తుతించి కొద్ది సేపటి తర్వాత తిరిగి గోల్కొండకు వెళ్ళాడు. అదే రోజు రాత్రి కలలో మహారాజుకు ఆంజనేయుడు కనిపించి తన విగ్రహం దొరికిన చోటే దేవాలయం నిర్మించాలని ఆ స్థలం కర్మ క్షేత్రమని, రాబోయే రోజుల్లో కర్మన్‌ఘాట్ గా ప్రసిద్ధి పొందుతుందని ఆదేశించారు. స్వామి వారి ఆదేశానుసారం క్రీ.శ. 1143లో హనుమాన్ జయంతి రోజున దేవాలయ నిర్మాణ పనులు ప్రారంభించారు.
💠రెండవ ప్రతాప రుద్రుడు కట్టించిన శ్రీ కర్మన్‌ఘాట్ ధ్యానాంజనేయస్వామి దేవాలయం ఆయన తర్వాత వచ్చిన కాకతీయ రాజులందరూ తమ ఇష్టదైవంగా ప్రతిష్ఠించారు.
💠 17వ శతాబ్దంలో గోల్కొండ సామ్రాజ్యాన్ని మొగల్ పాలకుడు ఔరంగజేబ్ స్వాధీనం చేసుకున్నాడు. అతని సైన్యంలోని కొందరు ధ్యానాంజనేయస్వామి ఆలయం వద్దకు చేరుకొని ఆలయాన్ని ధ్వంసం చేసేందుకు యత్నించారు. అయితే స్వామి దివ్యశక్తితో వారు విజయం సాధించలేకపోయారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఔరంగజేబ్ స్వయంగా దాడికి దిగాడు. ఈ క్రమంలో ఆలయం వద్దకు చేరుకోగా ఆలయం నుంచి పెద్ద స్వరంతో ‘మందిర్ తోడ్‌నా హైతో పహలె తుమ్ కరో మన్‌ఘట్’(ఆలయాన్ని ధ్వంసం చేయాలనుకుంటే మనస్సును గట్టిగా చేసుకో) అని పలికింది. దీంతో ఔరంగజేబ్ తనకు కనపడమని కోరగా తాటిచెట్టు కంటే ఎత్తైన రూపం కనిపించడంతో అతను భీతిల్లి వెనుదిరిగాడు. కరో మన్‌ఘట్ అన్న పేరే కర్మన్‌ఘాట్‌గా మారింది.
💠 ధ్యానముద్రలో ఉన్న అంజనాసుతుని దర్శనాన్ని చేసుకుంటే అన్ని రకాలుగా మంచి ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా సంతానం లేనివారు స్వామిని దర్శించి నిండుమనస్సుతో ప్రార్థిస్తే సంతానం కలుగుతుందని పెద్దలు చెబుతారు. కొత్తగా కొనుగోలు చేసిన మోటార్ వాహనాలకు ఇక్కడ పూజచేయించడం సంప్రదాయం.
💠 హైదరాబాద్ నగరంలోని ఇన్నర్ రింగ్‌రోడ్డు సమీపంలో ఆలయం వుంది.
No comments:
Post a Comment