Adsense

Wednesday, June 15, 2022

శ్రీ ఉమాకొప్పేశ్వర స్వామి ఆలయం : పలివెల (తూర్పుగోదావరి)


🔅 మనకు తెలిసినంత వరకు ఏ శివుడి గుడిలో అయినా స్వామి వారి విగ్రహం ఎక్కువగా కనిపించదు.
లింగ రూపంలోనే  పరమశివుడు మనకు దర్శనమిస్తాడు.
అంతే కాకుండా శివలింగం ఒక గుడిలో ఉంటే మరో గుడిలో పార్వతీ దేవి కొలువై ఉండడాన్ని చూస్తుంటాం...
కానీ ఆంధ్ర ప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట మండలంలోని పలివెలలో మాత్రం శివలింగం పక్కనే పార్వతీ దేవి వారి పక్కన వినాయక, కుమార స్వామి విగ్రహాలు ఉన్నాయి.

👉పురాణములలోని ఒకప్పటి పల్వల పురమే నేటి పలివెల.

👉కోనసీమలోని అతి ప్రాచీనమైన ఆలయాల్లో ఒకటి పలివెలలోని కొప్పు లింగేశ్వరస్వామి ఆలయం. 
తూర్పు గోదావరి జిల్లా, కొత్తపేట మండలం పలివెల గ్రామంలో ఉన్న శ్రీ ఉమాకొప్పులింగేశ్వర స్వామివారి క్షేత్రం బహు పురాతనమైనది. ఈ గ్రామం రావులపాలెం నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.

👉ఈ దేవాలయానికి కొన్ని వైవిధ్యాలు ఉన్నాయి.
 మొదటిది – శివలింగంపై కొప్పు ఉండడం. రెండవది – అమ్మవారు స్వామివారి పక్కనే ఉండడం. 
శ్రీ పార్వతీపరమేశ్వరులు కలిసియున్న ఏకపీఠం ఇక్కడే ఉన్నది. 
మూడవది – నిజానికి శివలింగంపై కొప్పు మొదటినుండీ ఉండేది కాదు ...కాలాంతరంలో పుట్టుకొచ్చింది. 
గుడి వెలుపల, ఇటీవలే అమర్చిన ఒక శిలాఫలకంపై ఆ క్షేత్ర మాహాత్మ్యాన్ని తెలియజేస్తున్న వివరాలు ఉన్నాయి. 

👉అగస్త్య మహాముని వివరాలు క్లుప్తంగా తెలుసుకుంటే కింద ఉన్న మాహాత్మ్య వర్ణనం పూర్తిగా అర్థమవుతుంది.

👉మొదట్లో ఇక్కడ శివుడిని ఉమా అగస్త్యేశ్వరస్వామిగా పిలిచినా ఓ పూజారిని కాపాడేందుకు ఆ శంకరుడు కొప్పు ధరించాడట.
అలా అగస్త్యేశ్వర స్వామి కాస్త కొప్పేశ్వర స్వామిగా మారిపోయాడు.

👉 అగస్త్యుడు ఎంతటి పుణ్య పురుషుడో  శ్రీమద్రామాయణం, అరణ్య కాండము సర్గలు 10, 11 లలో ఆయన ఎంతటి గొప్పవాడో స్వయంగా శ్రీరాముడే తెలియజేస్తాడు. 
నిజానికి ‘అగమ్ స్థంభయతీతి అగస్త్యః’ అనగా అగమును (పర్వతమును) స్థంబింపజేసిన వాడు కాబట్టి ఆయన ‘అగస్త్యుడు’ అను పేరుతో విఖ్యాతి కెక్కారు.

👉అగస్త్య మహర్షి కైలాసంలో జరిగే శివ పార్వతుల కల్యాణం చూడలేకపోయినందుకు తెగ బాధపడతాడట.
శివుడి అనుగ్రహం కోసం ఘోర తపస్సు చేశాడట. అందుకు మెచ్చిన ఆది దంపతులు ప్రత్యక్షమవ్వగా వారి పెళ్లిని చూసే భాగ్యం కల్పించమని అగస్త్యుడు కోరుతాడు.

👉అలా మహర్షి కోరికను మన్నించిన ఆ పరమ శివుడు- పార్వతి, కుమారులతో సహా ఇక్కడ వెలిశాడని ప్రతీతి.
అయితే అప్పటి నుంచి ఈ స్వామి వారిని అగస్త్యేశ్వరుడిగా, పార్వతిని ఉమాదేవిగా పూజించడం మొదలుపెట్టారు.
తర్వాత తర్వాత పరమ శివుడు కాస్త కొప్పేశ్వర స్వామిగా మారిపోయాడు.

 👉పరమేశ్వరునకు కొప్పు లింగేశ్వరుడు అను పేరు వచ్చుటకు ఒక గాథ కలదు.

👉11వ శతాబ్దం లో రాజమహేంద్రవరం రాజధానిగా పరిపాలించిన రాజరాజ నరేంద్రుడు కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఇది నిజంగా అగస్త్య ప్రతిష్టితం. 
ఒకానొక కాలంలో ఈ ఆలయ పూజారి వేశ్యా వ్యసనం లో ఉండేవాడు. 
ప్రతి రోజు ఆముక్త మాల్యదలాగా వేశ్య తలలో పెట్టుకొన్న పూల మాలలనే దేవుడికి వేసేవాడు. ఒకసారి మహరాజు స్వామి దర్శనానికి గుడికి వస్తే స్వామికి అలంకరించిన పుష్ప మాలను పూజరి మహరాజుకి ఇచ్చాడు .అందులో ఒక స్త్రీ శిరోజాలు మహరాజు కనిపించాయి.
ఈ విషయమై పూజారిని నిలదీస్తే మన స్వామి లింగానికి ఉన్న కొప్పు లో ఉండే వెంట్రుకలే అని అబద్ధం చేప్పాడు. కావాలంటే రేపు ఉదయం రాగానే నిర్మాల్యాన్ని చూపిస్తాను అన్నాడు .సరే అని రాజు వెళ్ళిపోయాడు .

👉పూజారికి అబద్ధం ఆడినందుకు ప్రాణ సంకటంగా ఉంది .తన తప్పును రాజు గమనిస్తే మరణశిక్ష ఖాయం అనుకోని పశ్చాత్తాప పడతాడు.
బోళా శంకరుడు దయ తలిచి తన శివలింగం పై కొప్పు దానికి శిరోజాలు సృష్టించి పూజారిని కాపాడాడు.
 మర్నాడు రాజు రావటం స్వామి శిరస్సున శిరోజాలు చూసి పూజారిని అనుమానిచి నందుకు మన్నించమని కోరడం జరిగింది .
పూజారినీ రాజును భక్త వత్సలుడు మన్నించి దీవించాడు .
అప్పటినుండి కొప్పు లింగేశ్వర స్వామిగా ప్రజలు కొలుస్తున్నారు.
 
👉ప్రతీవారు తప్పని సరిగా దర్సించి తీరాల్సిన శివక్షేత్రం. తూర్పు గోదావరీ జిల్లా  కొత్తపేట సమీప గ్రామం  పలివెల.

👉ఈ ఆలయానికి తూర్పున కౌసికి, దక్షిణాన సాంఖ్యాయని, ఉత్తరాన మాండవి, పల్వల అనే నదుల మధ్య లో ఈ ఆలయం ఉంది. 
శివ లింగానికి పై భాగం లో చతురస్రాకారం లో కొప్పు కనిపిస్తుంది .
అందుకే కొప్పు లింగేశ్వరుడుగా దర్శనం ఇస్తాడు. 
పార్వతీ దేవి గర్భ గుడిలోనే స్వామి లింగంప్రక్కనే ఒకే పీఠంపై కొలువై ఉండటంవిశేషం.
ఈ ఆలయంలో కుమారస్వామి, వినాయకుడు కూడా ఉన్నారు.

👉అంతే కాదండోయ్ ఇక్కడకి ఎక్కువగా వ్యసనాలకు బానిసలైన వారిని తీసుకొచ్చి ప్రదక్షిణలు, ఏకాదశ రుద్రాభిషేకం, ఉమా దేవికి కుంకుమార్చన చేయిస్తే వాటి నుంచి త్వరగా బయడపడతారని భక్తుల నమ్మకం.
ఇక్కడ మహా శివరాత్రి సమయంలో అంగరంగ వైభవంగా పార్వతీ పరమేశ్వరులకు కల్యాణం జరిపిస్తారు.

No comments: