💠 భక్తుల కొంగు బంగారం మహంకాళి అమ్మవారు. లష్కర్ ప్రజలనే కాకుండా నగర ప్రజలకు ఆరాధ్య దైవంగా సికింద్రాబాద్
శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారు విరాజిల్లుతున్నది. భక్తుల కోరికలను తీర్చే కొంగు బంగారంగా ఈ అమ్మవారిని ప్రజలు కోలుస్తుంటారు.
💠 పూర్వం నుండి ఈ అమ్మవారు ఇక్కడ గ్రామదేవతగా పూజలను అందుకుంటుంది. మహాకాళి అవతారమే ఈ అమ్మవారిగా భక్తుల నమ్మకం. ఇంకా ఈ అమ్మవారిని ఎల్లమ్మ, పోచమ్మ, పెద్దమ్మ, మైసమ్మ, మారెమ్మ ఇలా అనేక రకాల పేర్లతో భక్తులు పిలుచుకుంటారు
💠 ప్రతి సంవత్సరం ఆషాడ మాసంలో జరిగే మహంకాళీ జాతరకు నగరం నుండే కాకుండా తెలంగాణ జిల్లాల నుండి వేలాదిగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తున్నది.
రెండు రోజుల పాటు జరిగే ఈ జాతరకు హైదరాబాద్, తెలంగాణ జిల్లాల నుంచి లక్షలాది మంది భక్తులు విచ్చేసి ఈ జాతరలో పాలుపంచుకుంటారు. ఇక్కడ మహంకాళీ అమ్మవారిని భక్తులు ఏమి కోరుకున్నా అది జరగుతుందని నమ్మకం ఉండడం వల్లనే రోజురోజుకు అమ్మవారి దర్శనానికి భక్తుల రాక అధికమవుతున్నది.
💠 ఇక్కడ కొత్తగా ఏ వ్యాపారం ప్రారంభించినా ముందుగా అమ్మవారి ఆశీస్సులతోనే ఇక్కడ తమ వ్యాపారాన్ని మొదలుపెట్టడం జరుగుతూ వస్తుంది. అమ్మ ఆశీస్సులుంటే వ్యాపారంలో అగ్రగామిగా నిలుస్తామని ఇక్కడి వ్యాపారులకు గట్టి నమ్మకం.
🔔 ఆలయ చరిత్ర :
💠 సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళీ దేవాలయానికి దాదాపు 200 సంవత్సరాల ఘన చరిత్ర ఉంది. 1813వ సంవత్సరంలో మిలిటరీలో పనిచేస్తున్న సికింద్రాబాద్ వాస్తవ్యులు సురిటి అప్పయ్య (ఆర్మీసోల్జర్) మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని టవర్ కు బదిలీ అయినారు. బదిలయిన కొన్ని రోజులకు ఉజ్జయినిలో కలరా వ్యాధి సోకి వేలాది మంది మరణించడం జరిగింది. ఆ సమయంలో అప్పయ్య వారి అనుచరులు ఉజ్జయినిలోని శ్రీ మహంకాళీ దేవిని దర్శించి, కలరా వ్యాధి నుండి కాపాడాలని వేడుకున్నారు. పరిస్థితిలు అనుకూలించిన తదుపరి సికింద్రాబాద్ లోనే విగ్రహ ప్రతిష్ట చేయించి ఆలయ నిర్మాణం చేసి నిన్ను కోల్చుకుంటామని మొక్కుకోగా, కలరా వ్యాధి నుండి అనేక వేల మంది రక్షింపబడ్డారు.
💠 సురిటి అప్పయ్య వారి అనుచరులు సికింద్రాబాద్కు తిరిగివచ్చి 1815 సంవత్సరంలో ఇప్పుడు అమ్మవారు ఉన్న చోట కట్టెతో అమ్మవారి విగ్రహం చేయించి ప్రతిష్ట చేసి నిత్యపూజలు చేయడం జరిగింది.
అమ్మవారికి శ్రీ ఉజ్జయిని మహంకాళీ అని నామకరణం అప్పట్లోనే చేశారు.
ఇక్కడొక పెద్ద బావి ఉండేదని, దానిని మరమత్తు చేయుచున్న సమయంలో త్రవ్యకాల్లో “శ్రీ మాణిక్యాల దేవి” విగ్రహం దొరికింది.
ఇదియే ఇప్పుడు గర్బాలయమునందు కుడివైపున ఉన్నది. శ్రీ మాణిక్యాల దేవి అమ్మవారి ప్రక్కన ప్రతిష్టించుట జరిగింది.
💠 సూరిటి అప్పయ్య 1864 సంవత్సరంలో కట్టె విగ్రహం తీసేసి ఇప్పుడున్న మహంకాళీ మాణిక్యాల దేవి అమ్మవారుల విగ్రహాలను శాస్తోక్షముగా ప్రతిష్టించేసి ఆలయనిర్మాణం చేయడం జరిగింది. నాటి నుండి వారి తరువాత వారి వంశస్తుల సురిటి సంజీవయ్య, లక్ష్మయ్య, కిష్టయ్య, సురిటి లక్ష్మయ్య కుమారుడు సురిటి అప్పయ్య మునిమనువడు సురిటి కృష్ణ ప్రస్తుతం జాతర కార్యక్రమాల్లో పాల్గొనుచున్నారు.
🔔 బోనాలు :
💠 బోనాలు అమ్మవారుని పూజించే హిందువుల పండుగ. ఈ పండుగ ప్రధానంగా హైదరాబాదు, సికింద్రాబాదు మరియు తెలంగాణ, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో జరుపుకోబడుతుంది.
సాధారణంగా జూలై లేక ఆగష్టులో వచ్చు ఆషాఢ మాసంలో ఈ పండుగను జరుపుకుంటారు.
💠 తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాల పండగ. జంట నగరాల్లో జరిగే అతి పెద్ద జాతర లష్కర్ బోనాలు శివ సత్తులతో, పోతారాజుల నృత్యాలతో, బోనం ఎత్తిన మహిళలతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.
💠 భోజనం అని అర్థం కలిగిన బోనం దేవికి సమర్పించే నైవేద్యం
మహిళలు వండిన అన్నంతో పాటు పాలు,పెరుగు, బెల్లం, కొన్నిసార్లు ఉల్లిపాయలతో కూడిన బోనాన్ని మట్టి లేక రాగి కుండలలో తమ తల పై పెట్టుకుని, డప్పుగాళ్ళు, ఆటగాళ్ళు తోడ్కొని రాగా దేవి గుడికి వెళ్తారు. మహిళలు తీసుకెళ్ళే ఈ బోనాల కుండలను చిన్న వేప రెమ్మలతో, పసుపు, కుంకుమ లేక కడి (తెల్ల ముగ్గు) తో అలంకరించి, దానిపై ఒక దీపం ఉంచడం కద్దు.
💠మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, డొక్కాలమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ, మారెమ్మ మున్నగు పేర్లు కల ఈ దేవి గుళ్ళను దేదీప్యమానంగా అలంకరిస్తారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత బోనాలను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు. సికింద్రాబాద్ బోనాలను ఉజ్జయని మహాంకాళి బోనాలు అని అంటారు.
No comments:
Post a Comment