🔔 దక్షిణ షిర్డిగా వెలుగొందుతున్న దిల్‌సుఖ్నగర్ షిర్డీ సాయిబాబా మందిరం
💠 ఎల్లప్పుడూ రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో మనస్సును ఉల్లాసంగా ఉంచే భక్తి పాటలు, భజనలతో మారుమోగుతుంటాయి.
ఎంతో రణగొణధ్వనులు ఉన్నా ఈ ప్రాంతానికి చేరుకునే సరికి సాయినామ స్మరణతో ప్రశాంతత చేకూరి మనస్సు తన్మయం చెందుతుంది.
తమను కాపాడే దైవం ఇక్కడే ఉన్నాడని, అదే దిల్ సుఖ్ నగర్ షిర్డీ సాయిబాబా దేవాలయం అని భక్తుల విశ్వాసం.
💠 ఈ ఆలయం దిల్ సుఖ్ నగర్ లోనే ఉన్నా అచ్చం షిర్డీ సాయిబాబా దేవాలయం నమూనాతో నిర్మాణం కావడంతో పాటు ఇక్కడి సాయినాధుని దర్శించుకుంటే షిర్డీ సాయినాధుని దర్శించుకున్నట్టే అనే భావన భక్తుల్లో కలుగుతుండడంతో ఈ ఆలయానికి దక్షిణ షిర్డీగా నామకరణం జరిగింది.
💠 సాయిబాబా దేవాలయాలు ఎన్నో నిర్మాణం అవుతున్నప్పటికీ దిల్ సుఖ్ నగర్ బాబా ఆలయానికి ఉన్న గుర్తింపు ఎంతో ప్రాముఖ్యమైనది. రాష్ట్రం నలుమూలల నుండి వచ్చే భక్తులే కాక వివిధ రాష్ట్రాల నుండి వచ్చే టూరిస్టులు ఈ ఆలయాన్ని దర్శించుకుని తన్మయం చెందుతుంటారు.
💠 మొదట్లో చిన్న ఆలయంగా ఉన్న ఈ దేవాలయం నేడు మూడంతస్తుల భవనంతోపాటు సాయినాధుని ఆదేశాల మేరకు అన్నట్లుగా సేవా కార్యక్రమాలు సైతం నిర్వహిస్తూ దేవాలయం ట్రస్ట్ ఆధ్వర్యంలో దేదీప్యమానంగా వెలుగొందుతోంది.
💠 ఈ ఆలయం లో విగ్రహం షిర్డీలో సాయినాధుని పాలరాతి విగ్రహం వలె ఉండడం, దానికి తోడు ఇక్కడికి వచ్చే భక్తుల కోర్కెలు బాబా ఆశీర్వాదంతో తీరుతుండడం, ప్రతి నిత్యం ఇక్కడ భక్తుల కోలాహలంతో రద్దీగా కనిపిస్తుంది.
💠 దిల్ సుఖ్ నగర్ ప్రాంతంలో జాతీయ రహదారి పక్కన ఒకప్పుడు సాయిబాబా ఆలయం చిన్న తడికెలతో ప్రారంభమైంది. స్థానికులు కొందరు ఎంతో వ్యవప్రయాసల కోర్చి ఆలయ నిర్మాణానికి కృషి చేశారు.
💠 పలువురు ట్రస్ట్ చైర్మన్లు, పాలక మండలి నేతృత్వంలో బాబా దేవాలయం నుండి 1984లో దేవాలయ గర్భగుడి నిర్మాణం చేపట్టగా, 1989లో ప్రస్తుతం భక్తులు దర్శించుకుంటున్న సాయిబాబా పాలరాతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా పాత విగ్రహాన్ని ఆలయం ఎడమ వైపు ప్రతిష్టించారు. ఆలయంలోకి ప్రవేశించగానే ద్వారకామాయిలోని ధుని, సాయిబాబా వారు ఉపయోగించిన వస్తువులు దర్శించుకుని ప్రధాన ఆలయంలోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడి ఆలయంలో ఎంతో సుందరంగా తీర్చి దిద్దిన అలంకరణలు భక్తులను అలరిస్తాయి.
💠 1991లో మొదటి అంతస్తు నిర్మాణం చేసి పైన ధ్యానమందిరం ఏర్పాటు చేశారు. 1993లో సాయిబాబా దేవాలయం ప్రధాన ఆర్చ్ ని జాతీయ రహదారి పక్కన నిర్మించారు. 1994లో సాయినాధునికి ఆరు లక్షల వ్యయంతో స్వర్ణ కిరీటాన్ని ఆలంకరించారు. 1996లో ఆలయానికి రెండవ అంతస్తు నిర్మాణం చేసి ట్రస్ట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అదే విధంగా పక్కన ఉన్న స్థలాన్ని తీసుకుని అక్కడ కూడా భవన నిర్మాణం చేసి పిఆర్ఓ రూము, అధ్యాత్మిక గ్రంధాలయాన్ని, మొదటి అంతస్తులో అన్నదాన సత్రాన్ని నిర్మాణం చేశారు. ఇలా ఈ ఆలయం రాష్ట్రంలోనే అత్యంత సుందరమైన ఆలయంగా విరాజిల్లుతోంది.
💠 సాయిబాబా దేవాలయం ట్రస్ట్ వారు దేవాలయం అభివృద్ధితో పాటు దాతల సహకారం, భక్తుల తోడ్పాటుతో పలు సమాజ, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. దేవాలయం ప్రాంగణంలోనే ఉచిత వైద్యశాల ఏర్పాటు చేసి రోగులకు సేవ చేస్తున్నారు.
26 మంది నిపుణులైన వైద్యులతో హోమియోపతి, అలోపతి, ఆయుర్వేదిక్ చికిత్సలు చేస్తున్నారు. ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారు. లక్షల రూపాయల వ్యయంతో ఈ వైద్య సేవలు అందిస్తున్నారు. అదే విధంగా ఆలయం ఆధ్వర్యంలో వృద్ధాశ్రమానికి కూడా సేవలందిస్తున్నారు.
💠 చికెన్ గున్యా, పోలియో, సీజనల్ వ్యాధులకు ఉచితంగా మందులు పంపిణీ చేయడం, రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఉపద్రవాలు వచ్చినా ఆపన్నులను ఆదుకోవడం కోసం విరాళాలు సేకరించి పంచడం వంటి కార్యక్రమాలు ఆలయ ట్రస్ట్ వర్గాలు చేపడుతున్నారు. ముఖ్యంగా ఆలయం ద్వారా సుమారు వెయ్యి మంది భక్తులకు చేపట్టే అన్నదాన కార్యక్రమం పలువురి మన్ననలు పొందుతోంది.
💠 ప్రతినిత్యం ఉదయం నాలుగు గంటల నుండి రాత్రి పది గంటల వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు అధ్యాత్మిక కార్యక్రమాలు ఘనంగా జరుగుతాయి.
💠 ప్రతి రోజూ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి హారతులతో పాటు పూజలు నిర్వహించబడతాయి.
ప్రతి రోజూ సాయంత్రం భజనలు, సంగీత ప్రార్థనలు, ప్రతి గురువారం పురవీధుల గుండా సాయి పల్లకి ఊరేగింపు, గురుపౌర్ణమి, శ్రీరామనవమి, దసరా తదితర పండుగలు ఘనంగా నిర్వహించడం విశేషం.
No comments:
Post a Comment