Adsense

Wednesday, June 15, 2022

శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయం : బాసర (ఆదిలాబాద్)



🔅 వేదమాతయైన జ్ఞాన సరస్వతి సాకారముగా పవిత్ర భారతావనిలో ఆంధ్రదేశమున వ్యాసపురిలో దర్శనమిచ్చుచున్నది.
 ఈ వ్యాసపురినే బాసర (వాసర)గా పిలుచుచున్నాము. సత్యవతీతనయుడైన బాదరాయణ మహర్షి అనంతములైన వేదములను బుక్ యజుస్సామాధర్వణములుగా విభజించి వేదవ్యాసుడను నామమును పొందినాడు. 

👉సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపుడైన వ్యాసుడు సమస్త తీర్థములను సేవించుచూ మానసిక ప్రశాంతత లభింపక గోదావరీ నదీ తీరమున గల సరోవరమును చేరి, సరస్వతీ నిలయమైన సరోవరమున స్నానమాచరించి, దేవి ఆలయమును ప్రవేశించి శ్రీ జ్ఞానసరస్వతి అమ్మవారిని బహువిధముల స్తోత్రము చేసెను. వ్యాసుని స్తుతికి ప్రసన్నురాలైన అమ్మవారు ప్రత్యక్షమై వ్యాసునికి సరస్వతీ సాయుజ్యము ముక్తి లభింపగలవని అనుగ్రహించెను.

👉వ్యాసుడి క్షేత్రమును నివసించి తపమాచరించి తరించిన కారణముగా ఈ ప్రాంతము వ్యాసపురిగా ప్రసిద్ధి చెందినది. కాలాంతరమున లీలా వినోదియైన అమ్మవారు అంతర్థానమైనప్పుడు అజ్ఞాన అమిరాతవృతమైన లోకమును ఉద్దరించుటకు సరస్వతీ దేవీ అజ్ఞానుసారముగా గోదావరి నది నుండి మూడు ముష్టి ప్రమాణమలు ఇసుకను తెచ్చి సర్వాంగ సుందరముగా దేవిని తీర్చిదిద్ధి ప్రతిష్టించినది కూడా వ్యాసుడే యగుటవలన వ్యాసపురియను సార్థక నామమీ ప్రాంతమును లభించినది.

👉వేదమాతయైన, సరస్వతి, సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపుడైన వేదవ్యాసుడు, పవిత్ర గోదావరి నదీ తీరము - ఈ మూడు విశేషముల వలన ఈ క్షేత్రము వేదనిలయమై శోభిల్లుచున్నది.

👉పవిత్ర గోదావరి తీర ప్రాంతంలో వెలిసిన అందరికీ తెలియని ప్రముఖ అనఘదత్త క్షేత్రం. ఎటుచూసినా కనువిందు చేసే ఔదుంబర వృక్షాలతో బాసర్ ఒక గొప్ప దత్తధామాన్ని తలపిస్తుంది.. అందరికీ సుపరిచితమైన శ్రీ మహా (జ్ఞాన) ‘సరస్వతి’ మాత క్షేత్రం బాసర్, అదే విధంగా అందరికీ తెలియని శ్రీ నృసింహ ‘సరస్వతి’ స్వామి వారి క్షేత్రం కుడా! ఈవిధంగా బాసర్ ‘సరస్వతి ద్వయ’ క్షేత్రంగా భాసిల్లుతోంది. బాసరలో మహాసరస్వతి, మహాలక్ష్మి, మరియు మహాకాళీ మాతలు కొలువు తీరి ఉన్నారు. ఈ ముగ్గురి అమ్మల కలయికే అనఘాలక్ష్మి. అందువల్లనే బాసర్ క్షేత్రం ఒక గొప్ప దత్తక్షేత్రం మరియు ‘సరస్వతి ద్వయ’ క్షేత్రం.

👉బ్రహ్మాది దేవతలు ప్రతిరోజూ వచ్చి సేవించేవారు. ఒకనాడు సరస్వతీ దేవి తన మహిమను ప్రకటించేందుకు, ఆలయం నుండి అంతర్థానమైంది. అప్పుడు ‘శబ్దస్వరూపిణి’ అయిన అమ్మవారి అంతర్థాన ఫలితంగా లోకం మొత్తం మూగబోయింది. మహర్షులు, దేవతలు, బ్రహ్మదేవుని వద్దకు వచ్చి జ్ఞాన సరస్వతి అంతర్థానం గురించి మూగ సైగలతో వివరించారు. ‘బ్రహ్మదేవా! ‘శబ్దస్వరూపిణి’ అనుగ్రహం పొందేందుకు మార్గం సూచించు” అని మూగ సైగలతో వేడుకున్నారు. వారి ప్రార్థన మేరకు బ్రహ్మదేవుడు ‘వేదవ్యాసుని’ వలన సరస్వతీ దేవి తిరిగి వస్తుందని చెప్పి, వారిని వ్యాసమహాముని దగ్గరికి వెళ్ళమని ఆజ్ఞాపించారు.

👉దేవతలు, మహర్షులు, వేదవ్యాసుని వద్దకు వెళ్ళారు. వారిని చూసిన వేదవ్యాసుడు వారి మనోభావం గ్రహించి నిశ్చల చిత్తంతో జ్ఞాన సరస్వతిని ధ్యానించాడు. సరస్వతీదేవి అనుగ్రహించి, వ్యాసునితో ‘ఓ వ్యాసమహామునీ! నీవు చేసిన స్తోత్రంతో ప్రసన్నురాలినయ్యాను. నా అనుగ్రహం వలన నీ కోరికలన్నీ నెరవేరగలవు. నీవు ‘వాసర’ నగరంలో నా సైకత విగ్రహాన్ని ప్రతిష్టించి పూజించు. నన్ను ప్రతిష్టించగల శక్తిని నీకు మాత్రమే అనుగ్రహిస్తున్నాను’ అని పలికింది.

👉 వ్యాసమహాముని, సమస్త ఋషీగణంతో, దేవతా సమూహంతో, గోదావరి నదీ తీరంచేరి గౌతమీ నదిలో స్నానమాచరించి, నదిలో నుండి మూడు గుప్పెళ్ళు (ముష్టిత్రయ ప్రమాణం) ఇసుక తెచ్చి ముగ్గురు దేవతామూర్తులను (మహా (జ్ఞాన) సరస్వతి, మహాలక్ష్మి, మరియు మహాకాళీ) ప్రతిష్టించాడు. 

👉సరస్వతి అమ్మవారి విగ్రహాన్ని వ్యాసుడు పునఃప్రతిష్టించిన కారణం చేత ఇక్కడ సరస్వతీ దేవిని వ్యాసుడే ప్రతిష్టించినట్లైనది. అది ఆ తల్లి ఆజ్ఞ. జ్ఞాన సరస్వతీదేవి వాసర క్షత్రం లో ద్వాపరయుగంలో మాఘమాస శుక్లపంచమి, మూలానక్షత్రం, శుక్రవారం రోజున, గోదావరి పుష్కరాలు జరుగుతుండగా వ్యాసమహర్షి వారిచే ‘ఐం’ బీజాక్షరయుతంగా సైకత విగ్రహంగా (ఇసుక విగ్రహం) ప్రతిష్టించబడినది. అందువల్లనే వాసర కు గల పూర్వనామం ‘పుష్కర పీఠికాపురం’. 

👉వ్యాసుడు విగ్రహం ప్రతిష్ఠించిన కారణంగా ఈ క్షేత్రానికి ‘వ్యాసపురి’ అనే పేరు స్థిరపడింది... అదే కాలక్రమేణా బాసర గా మారింది.

No comments: