🔅 మహాశివరాత్రి సందర్భంగా మనం ఒక ప్రత్యేక శివాలయం గురించి చెప్పుకోవాలికదా. మీరు కొన్ని ఆలయాలలో శ్రీ మహావిష్ణువుని పడుకున్న రూపంలో దర్శించి వుండవచ్చు. కానీ శివుణ్ణీ ఎప్పుడన్నా అలా చూశారా!? మహా శివుడి దర్శనం సాధారణంగా లింగ రూపంలోనే అవుతుంది. కాకపోతే కొన్ని చోట్ల విగ్రహాలు వుండవచ్చు. కానీ పడుకున్న శివుడు ఎక్కడుంటాడు ?? ఇలాంటి అపురూప ఆలయం కనుకే మహా శివరాత్రి ప్రత్యేక కానుక. ఈ ఆలయం చిత్తూరు జిల్లా సురుటిపల్లిలో వున్నది.
👉 అమృతం కోసం దేవతులు, రాక్షసులు కలిసి ముందర పర్వతం, నాసుకి అనే సర్పం సాయంతో క్షీరసాగర మధనానికి పూనుకున్నారు. పాల సముద్రాన్ని చిలికే సమయంలో భయంకరమైన కాలకూట విషం బయటపడింది. పధ్నాలుగు లోకాలను దహించడానికి సిద్ధమైన ఆ కాలకూట విష ప్రభావ నుంచి రక్షించమని సుర అసురులు బోళా శంకరుడైన పరమ శివుని ప్రార్థిస్తారు. చతుర్దశ భువన పాలకుడైన మహేశ్వరుడు వారికి అభయమిచ్చి ఆ కాలకూట విషాన్ని చేతబూని అమాంతం! మింగివేస్తాడు. ఆ హాలాహలం శివుని గర్భంలోనికి పోనివ్వకుండా పార్వతీదేవి శివుని కంఠం పట్టుకోగా ఆ విషం కంఠం వద్దే నిలిచిపోయి స్వామిని నీలకంఠ నామధేయుడిని చేసింది. విష ప్రభావానికి లోనైన శివుడి మైకంతో కాసేపు ఈ క్షేత్రంలో విశ్రమిoచాడని, శివుడు శయనించిన క్షేత్రం గనుక దీనిని ', శయన క్షేత్రం' అంటారని స్కంద పురాణం ద్వారా తెలుస్తోంది. శివుడు హాలహలం తాగి విశ్రమించినందున దీనిని “కాల కూటసన క్షేత్రం" అని కూడా అంటారు. విషం మత్తులో పార్వతి వొడిపై తల వుంచి పవళించి వున్న గరళ కంఠుని విగ్రహంతో బాటు ఆయన చుట్టూ చేరి ప్రార్థ చేస్తున్న మహాశిష్టు, బ్రహ్మా, దేవేంద్రుడు మొత్తము దేవగణములు, మహార్షులు, యక్షగంధర్వాదు 4 రూపాలు కనిపిస్తాయి.
👉 శయనించి వుండటం వల్ల ఇక్కడి శివుడిని 'పల్లి కొండేశ్వరుడు' పళ్లి కొం (తమిళం) అంటే పడుకుని వున్నవాడు అని అర్థం అని అంటారు. శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వాము) వారు దశదినాలు ఈ క్షేత్రం వద్దే వుండి, అణువణువూ పరీక్షించి ఇలాంటి ఆలయం 'కాశి'లో లేకపోవడం లోపంగా యెంచి 1973 సంవత్సరంలో కాశీలో ఇదే నమూనాలో ఒక ఆలయాన్ని నిర్మించారు. కాశీలోని హనుమాన్ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన ఈ కామకోటేశ్వరాలయానికి “సురుటుపల్లి శివశయన క్షేత్రం” అనే నామకరణం చేశారు.
👉శివుడు అమ్మ ఒళ్ళో తలపెట్టుకుని శయనించినట్లు దర్శనమిచ్చేది ప్రపంచంలో బహుశా ఇక్కడ ఒక్క చోటే. 19 అడుగుల పొడుగున, సర్వమంగళాదేవి ఒడిలో తలపెట్టుకుని వున్న ఈ శయన శివుడు, అమ్మవారు అత్యద్భుతమైన సౌందర్యంతో విలసిల్లుతుంటారు. చుట్టూ విష్ణు, బ్రహ్మ, నారదుడు, సూర్య చంద్రులు, ఇంద్రుడు, తుంబురుడు, భృగు మహర్షి, మార్కండేయుడు, కుబేరుడు, అగస్త్యుడు, పులస్త్యుడు, గౌతముడు, వాల్మీకి, విశ్వామిత్రుడు వీరికి నమస్కరిస్తూవున్నారు. ఈ మూర్తులను వాల్మీకేశ్వరాలయం పక్కనే వున్న ప్రత్యేక ఆలయంలో దర్శించవచ్చు.
ఈ ఆలయంలో ముందు మరగతాంబికను, వాల్మీకేశ్వరులను దర్శించాక శయన శివుని దర్శించాలంటారు.
👉ఇక్కడ హాలాహలం నుంచి సకల భువనాలనూ రక్షించాక, శివుడు ప్రదోష సమయంలో నందీశ్వరుని కొమ్ముల నడుమ ఆనంద తాండవం చేశాడు కనుక ఇక్కడ ప్రదోష పూజకు చాలా విశిష్టత వున్నది. అసలు ప్రదోష సమయంలో పూజలు ముందు ఇక్కడే ప్రారంభం అయి తర్వాత మిగతా శివాలయాలకు విస్తరించాయంటారు. ఆ సమయంలో నందీశ్వరునికి కూడా ప్రాముఖ్యత ఇచ్చి ఆయనకీ అభిషేకం జరగటం ఇక్కడి విశేషం.
👉 ఇక్కడ అమ్మవారు మరగతాంబిక.
..అత్యంత సుందర రూపంలో దర్శనమిస్తారు
👉మరగతాంబిక ప్రక్కన వాల్మీకేశ్వరుని ఆలయం వున్నది. ఇక్కడ వాల్మీక ఋషి రామాయణం రాసేముందు శ్రీ రామలింగేశ్వరుని ప్రతిష్టించాలనుకున్నారు. కానీ సరిగ్గా కుదరనందువల్ల తపస్సు చేసి ఈశ్వరుని ప్రసన్నం చేసుకున్నారు. ఈశ్వరుడు స్వయంభువుగా వెలిశాడు. వాల్మీకి ఋషి తపస్సు వల్ల వెలిసిన ఈశ్వరుడు వాల్మీకేశ్వరుడయ్యాడు.
👉 వాల్మీకేశ్వరాలయం గర్భగుడి గోడకి వెలుపలవైపు వున్న అద్భుత విగ్రహం, మరెక్కడా చూడలేనిది దక్షిణామూర్తి. ఇక్కడ స్వామి వటవృక్షం కింద వుండడు. వృషభారూఢుడై వుంటాడు. జటాజూటం, గంగ, పులి చర్మం, నాగాభరణం కూడా వుంటాయి. అంతేకాదు అమ్మ గౌరి వెనకనుంచి స్వామిని కౌగలించుకుని వుంటుంది. ఈ దంపతి సమేత దక్షిణామూర్తిని దర్శించి సేవిస్తే జ్ఞానం, చదువు, పెళ్ళి, పిల్లలు, మాంగల్య భాగ్యం మొదలగు సకల సన్మంగళాలు జరుగుతాయని నమ్మకం.
👉 జ్వరహర మూర్తి .. దేవతలకు వచ్చిన శూలై అనే జ్వరమును తగ్గించేందుకు శివుడు ఎత్తిన అవతారమే జ్వరహర మూర్తి. ఈ మూర్తి చేతిలో అగ్ని, మూడు తలలు, మూడు కాళ్ళు, మూడు చేతులతో వుంటుంది. ఈ జ్వర హర మూర్తికి పాలాభిషేకం చేయిస్తే ఎలాంటి విష జ్వరాలయినా, చిన్న పిల్లలకి వచ్చే ఎలాంటి రుగ్మతలయినా పోతాయంటారు.
👉 ప్రతిరోజూ ప్రదోష సమయం సాయంత్రం 4 గం. ల నుంచి 6-30 గం. ల వరకు. త్రయోదశి రోజుల్లో ప్రదోష వేళల్లో విశేష పూజలు జరుగుతాయి.
No comments:
Post a Comment