Adsense

Wednesday, June 15, 2022

నాగోబా జాతర : నాగోబా దేవాలయం.(ఆదిలాబాద్ జిల్లా)


🌀 నాగోబా ఆలయం ఆదిలాబాద్ జిల్లా, ముట్నూరు గ్రామానికి సమీపంలో 'కిస్లాపూరు గ్రామంలో ఉంది. అంటే, ముట్నూరుకు మూడు కిలోమీటర్ల దూరంలో అన్నమాట.

👉 క్రిస్లాపూరు గిరిజనుల ఊరు.
 వారి ఆరాధ్య దేవత నాగోబా. 
నాగోబా అంటే సర్పదేవత, నాగుపామును చాలామంది ఆరాధిస్తారు. 
నాగ పంచమి, నాగుల చవితి లాంటి పర్వదినాలో నాగుపాముకు పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు చేస్తాం. అనేక దేవాలయాల్లో, ముఖ్యంగా శివాలయంలో నాగ దేవత శిలాఫలకాలు, కొన్ని పాము పుట్టలు ఉండటం తెలిసిందే,

👉 కిస్లాపూరు గిరిజనులు నాగోబాకు ఒక మందిరం కట్టించారు. ఇది పెద్దదేమీ కాదు, చిన్న దేవాలయమే. ఈ మందిరంలో ప్రతిష్టించిన నాగోబాను ఆరాధిస్తారు. ప్రత్యేక సందర్భాల్లో మరింత వేడుకగా ఉత్సవాలు జరుపుతారు. నాగపంచమి, నాగులచవితి పండుగ రోజుల్లో నాగోబా దేవాలయంలో మహా ఉత్సవమే చేస్తారు. అలాంటి తరుణాల్లో 'కిల్సాపూరు వాసులే కాకుండా, మొత్తం ఆదిలాబాద్ జిల్లాలోని వేలాదిమంది గిరిజనులు తరలివస్తారు.

👉 నాగోబా దేవాలయ ప్రాంతాన్ని వేదికగా చేసుకుని ఆ పరిసర ప్రాంతాల గిరిజనులు తమ సంస్కృతిని ప్రతిబింబించే పాటలు పాడతారు. నృత్యాలు చేస్తారు. ఏడాది పొడగునా కాయకష్టం చేసి బ్రతికే ఈ గిరిజనులు ఇలాంటి సందర్భాల్లో తమ ఇష్ట దైవం అయిన నాగోబా సన్నిధిలో కష్టాలు, కల్లోలాలు మర్చిపోయి సంతోషంగా గడుపుతారు.

👉 నాగోబా జాతర ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతరల్లో ఒకటి. సర్పజాతిని పూజించడమే ఈ పండగ ప్రత్యేకత. ఈ అమావాస్యరోజు తమ ఆరాధ్య దైవమైన నాగోబా (శేషనారాయణమూర్తి) పురివిప్పి నాట్యమాడుతాడని గిరిజనుల నమ్మకం. అమావాస్య నాడు సరిగ్గా సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల మధ్య కాలంలో గిరిజన పూజారులకు తమ ఆరాధ్య దైవం ఆదిశేషువు కనిపిస్తాడనీ, వారందించే పాలు తాగి ఆశీర్వదించి అదృశ్యమవుతాడని గిరిజనులు విశ్వసిస్తారు. 

👉ఆదిమ గిరిజనుల్లో మేస్రం వంశీయుల ఆరాధ్యదైవం నాగోబా గోండుల దేవత.
కెస్లాపూర్‌లో జరిగే ఈ జాతరను తెలంగాణ రాష్ట్ర పండుగగా ప్రకటించింది. కెస్లాపూర్‌ జనాభా 400కు మించదు. కాని పండగనాడు లక్షలాది మందితో అది జనారణ్యంగా మారుతుంది. జనవరి 25 నుంచి 29 వరకు నాలుగు రోజులపాటు గిరిజనులు ఈ పండుగ జరుపుకుంటారు. యేటా పుష్యమాసము అమావాస్య రోజున జాతర ప్రారంభ మవుతుంది.

👉 నాగోబా చరిత్రను గోండు గిరిజనులు రకరకాలుగా చెప్పుకుంటారు. పూర్వం మేస్రం కుటుంబానికి చెందిన నాగాయిమోతి రాణికి నాగేంద్రుడు కలలో కనిపించి సర్పం రూపంలో ఆమె గర్భాన జన్మిస్తానని చెప్పాడని, ఆ కల నిజమైందని గోండుల నమ్మకం. సర్పరూపంలోని నాగేంద్రునికి తల్లి అంటే రాణి తన తమ్ముడి కూతురు గౌరీతో వివాహం జరిపించింది. అత్త ఆజ్ఞ మేరకు గౌరీ భర్తను బుట్టలో పెట్టుకొని గోదావరికి ప్రయాణం కాగా, ఒకచోట పాము ఉడుం రూపంలో కనిపించగా ఆ ఊరు ఉడుంపూరైంది. 
ఆ తరువాత గౌరి ధర్మపురి వద్ద గోదావరిలో స్నానం చేయడానికి వెళ్లగా ఆమెను చూసి నాగేంద్రుడు మనిషి రూపంలోకి మారాడని, అయితే పేరు ప్రతిష్ఠలు కావాలో, సంప్రదాయం కావాలో తేల్చుకోమనగా గౌరి సంప్రదాయాలను లెక్కచేయక పోవడంతో తిరిగి పాముగా మారాడని కథ. ఆ తరువాత ఉడుంపూర్‌ నుంచి గరిమెల వరకు అతనికోసం వెతికిన గౌరి గోదావరిలోనే సత్యవసి గుండంలో కలిసిపోయిందని, నాగేంద్రుడు ఆమె వెంట ఉంచిన ఎద్దు రాయిగా మారిందని భక్తుల విశ్వాసం. 

👉ఆ తరువాత పెళ్ళి అయిన ప్రతి జంటకు నాగేంద్రుడి సన్నిధిలో పరిచయం చేయాలని (పేథికొరి యాక్‌) చెప్పి నాగేంద్రుడు కెస్లాపూర్‌ గుట్టల్లోకి వెళ్లిపోయాడని చెప్తుంటారు.
 అదే కెస్లాపూర్‌ గ్రామంగా మారి పోయింది. నాగేంద్రుడు వెళ్లిన గుట్ట వద్ద నాగోబా దేవాలయాన్ని నిర్మించారు. ప్రతిఏటా పుష్య మాసం అమావాస్య రోజున నాగేంద్రుడు ప్రత్యక్షమవుతాడని గిరిజనుల నమ్మకం. నాగోబా దేవతకు పూజలు మేస్రం వంశీయులే నిర్వహిస్తారు. మేస్రం వంశం కింద 22 తెగలు వస్తాయి. ఏడుగురు దేవతలను కొలిచే వారంతా మేస్రం వంశీయుల కిందికి వస్తారు. మడావి, మర్సకోల, పుర్క, మేస్రం, వెడ్మ, పంద్రా, పుర్వెత ఇంటి పేర్లు గలవారంతా మేస్రం వంశంలో వస్తారు.

👉 జాతరకు వచ్చే మేస్రం వంశీయులు వేలాది మంది ఉన్నా వారు వంట చేసుకునేది మాత్రం 22 పొయ్యిల మీదే. 
దీపాల కాంతుల వెలుగులో 22 పొయ్యిల్లో మేస్రం వంశీయుల వంతుల వారిగా వంటలు చేసుకుంటారు. మిగితా జాతుల వారు ఎక్కడైనా వంట చేసుకోవచ్చు.

👉సరిగ్గా పుష్య అమావాస్యo రోజున బావినీరులో మట్టి కలిపి ఒక పుట్టను తయారుచేసి ఆలయం పక్కన ఉన్న పూల మందిరాన్ని ఆ మట్టితో అలికి అమావాస్య అర్థరాత్రి కలశంలో ఉన్న జలంతో ఆలయంలో ఉన్న నాగదేవతను అభిషేకిస్తారు.

👉గోదావరి నదినుంచి తీసుకొచ్చిన జలంతో నాగోబా విగ్రహాన్ని శుభ్రపరుస్తారు. ఆలయాన్నంతా శుద్ధి చేస్తారు. బాజా భజంవూతీలతో ఆలయ ప్రాంగణంలో పూజా కార్యక్షికమాలను నిర్వహిస్తారు.

No comments: