Adsense

Wednesday, June 15, 2022

అదిలాబాద్ జిల్లా( మంచిర్యాల) : గూడెంగుట్ట


🔅 తెలంగాణ అన్నవరం
 " శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవాలయం "  : గూడెంగుట్ట.

🔅అదిలాబాద్ జిల్లా( ప్రస్తుతం మంచిర్యాల)  అనేక మతపరమైన ప్రదేశాలకు నిలయం. 

👉 ప్రకృతి ఒడిలో.. భక్తులను పులకరింపజేస్తుంది గూడెంగుట్ట.. ఎత్తయిన కొండలు... గోదావరి నీటి గలగల సవ్వడులు అలరిస్తున్నాయి. 
కొండపై వెలసిన శ్రీ రమాసహిత సత్యనారాయణస్వామి భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్నాడు. 

👉ఈ ప్రదేశాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండో అన్నవరంగా పిలిచేవారు. 
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ‘తెలంగాణ అన్నవరం’గా పిలుచుకుంటున్నారు. 

👉 ఇది కేవలం ఒక పుణ్యక్షేత్రం గానే కాక తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రత్యేక పర్యాటక ప్రదేశంగా కూడా గుర్తింపు పొందింది.
  
👉 ఈ ఆలయం మంచిర్యాల  మరియు కరీంనగర్ జిల్లా సరిహద్దులలో ఉన్న గోదావరి నది అంచులో ఉంది.  

👉 గూడెంగుట్ట  నూతనంగా ఏర్పడిన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం గ్రామ శివారులో ఎత్తయిన కొండపై వెలసిన శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రం మంచిర్యాలకు 30 కిలోమీటర్లు, కరీంనగర్‌కు 70 కిలోమీటర్ల దూరంలో 63 వ జాతీయ రహదారికి పక్కనే ఉంది.

👉 ఇక్కడి మూలదైవం  శ్రీ రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి.
ఈయని సత్యవాక్ పరిపాలనకు ఆది దేవునిగా కొలుస్తారు.

👉తెలంగాణ అన్నవరం అని కూడా పిలువబడే ఈ ఆలయo లో కార్తీకమాస  సమయంలో అత్యధిక భక్తులతో రద్దీ గా ఉంటుంది.
ఈ కార్తీక మాసంలో వేలాది భక్తులు ఈ క్షేత్రాన్ని దర్శించి గోదావరి నదిలో పవిత్ర స్నానాలు చేసి ఈ ఆలయంలో స్వామిని దర్శించి , సత్యనారాయణ వ్రతాలు చేసుకుని,  తమ మొక్కులు చెల్లించుకుంటారు .
ఇక్కడ నిత్యపూజలతో పాటు, సత్యనారాయణ వ్రతాలు, పెళ్లిళ్ల సీజన్‌లో పెళ్ళిళ్లు కూడా జరుగుతుంటాయి.

👉 కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రోజు ఈ ఆలయం భక్తులతో నిండిపోతుంది.

👉 కార్తీకమాసంలో వ్రతాలు కోసం ,పవిత్ర నదీ స్నానాల కోసం ఈ ఆలయాన్ని దర్శించే వేలాది భక్తుల కోసం ఆలయ నిర్వాహకులు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు మరియు  ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తారు.
 
🔅 ఆలయ ప్రాశస్త్యం 🔅

👉 సుమారుగా 53 సంవత్సరాల క్రితం గూడెం గ్రామానికి చెందిన గోవర్దన పెరుమాండ్లు అనే చాత్తాద వైష్ణవుడికి సత్యదేవుడు కలలో కనిపించాడు. మీ గ్రామ శివారులో గల రాట్నపు చెవుల కొండపై ఉన్నానని చెప్పాడు. ఆ వైష్ణవుడు కొండపై వెదకగా చిన్న విగ్రహం దర్శనమిచ్చింది. ఆయన సంతోషంతో సమీపాన గల గోదావరి నదికి వెళ్లి స్నానం ఆచరించి వచ్చాడు. గోదావరి జలంతో అభిషేకం నిర్వహించి సుగంధ ద్రవ్యాలతో పూజలు నిర్వహించాడు. 

👉విషయం తెలుసుకున్న గ్రామస్థులు కూడా స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. కొద్దిరోజుల తర్వాత చాత్తాద వైష్ణవుడు భక్తుల సహకారంతో గుట్టపైనే ఆలయం నిర్మించాడు. 

👉క్రోధి నామ సంవత్సర మాఘశుద్ధ దశమి రోజున (1964 లో) విగ్ర ప్రతిష్ట చేశారు. అప్పటినుంచి ఇప్పటి వరకు ఆలయం దినదినాభివృద్ధి చెందుతూ ప్రసిద్ధికెక్కింది.

👉 ఇక్కడ ప్రతి పౌర్ణమికి జాతర, కార్తీక పౌర్ణమికి భారీఎత్తున జాతర నిర్వహిస్తూ, ప్రతి ఏటా స్వామివారి కళ్యాణ బ్రహ్మోత్సవాలు కూడా ఘనంగా నిర్వహిస్తుంటారు.

👉 ఈ గుడిలోని మరొక ప్రత్యేకత ఇక్కడ అయ్యప్ప స్వామి వారి ఆలయం ఉన్నది.
ఇక్కడి అయ్యప్ప స్వామివారిని " అభినవ శబరిమల అయ్యప్ప " అని పిలుస్తారు .
ఈ ఆలయం కూడా దాదాపు కేరళలోని శబరిమల అయ్యప్ప సన్నిధానం మాదిరిగా ఉంటుంది.
ఎంతో దూరంలో ఉండే కేరళ అయ్యప్ప స్వామిని వ్యయప్రయాసలతో దర్శించలేని తెలంగాణ భక్తులు ఇక్కడి గూడెంలో ఉన్న "అభినవ అయ్యప్పస్వామి"  ఆలయంలో తమ అయ్యప్ప దీక్షలు మరియు ఇరుముడి మొక్కులు తీర్చుకుంటారు.

👉 ఇది ఉత్తర తెలంగాణా ప్రాంతంలోని అత్యంత ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.
 
👉 ఇక్కడ గోదావరి నది అవతలి ఒడ్డున ఉన్న కరీంనగర్ జిల్లా వైపున ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి  దేవాలయాన్ని కూడా పర్యాటకులు తరచుగా విశేష సంఖ్యలో సందర్శిస్తారు.  
ఇక్కడి గోదావరి నదిపై ఉండే వంతెన ఒక ఆధ్యాత్మిక వారధిగా అటు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవాలయానికి ఇటు గూడెం శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవాలయానికి కలుపుతూ భక్తులను ఒకేసారి రెండు పుణ్యక్షేత్రాలను దర్శించిన పుణ్యాన్ని కలగజేస్తుంది.

👉 ఈ శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆలయం ఇంకా దినదిన అభివృద్ధి చెంది మహా పుణ్యక్షేత్రగా తీర్థ స్థలంగా మారే అవకాశం ఉంది కాని తగినన్ని సదుపాయాలు ,వసతి, రవాణా లాంటి సమస్యల వల్ల ఇంకా కావలసినంత అభివృద్ధిని మరియూ ప్రాచుర్యాన్ని పొందలేకపోతుంది .

No comments: